Telangana: రూ.3 వేల కోట్లు.. 4 వేల కిలోమీటర్లు 

24 Nov, 2022 12:42 IST|Sakshi

సుదీర్ఘ విరామం తర్వాత రోడ్ల మరమ్మతు పనులు..

ప్రభుత్వానికి రోడ్లు, భవనాల శాఖ ప్రతిపాదన 

రెండేళ్ల వరదలతో దెబ్బతిన్న వాటికీ మరమ్మతులు

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో రోడ్లను మెరుగుపరిచే నిర్వహణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. కనీసం నాలుగు వేల కిలోమీటర్ల మేర రోడ్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి మెరుగుపరచాలని రోడ్లు, భవనాల శాఖ నిర్ణయించింది. అలాగే గత రెండేళ్లలో కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిని వాహనదారులకు నరకాన్ని చూపుతున్న రోడ్లను కూడా బాగు చేయనున్నారు. ఇందుకు రూ.3 వేల కోట్లు ఖర్చు కానున్నట్టు రోడ్లు, భవనాల శాఖ అంచనా వేసింది.

ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రోడ్లను అద్దాల్లా మెరిసేలా చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కదలిక వచ్చింది. గతంలోనూ నిధుల కోసం పలుమార్లు ప్రతిపాదనలు రూపొందించి వాటి విడుదల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఈసారి స్వయంగా ముఖ్యమంత్రే ఆదేశించిన నేపథ్యంలో నిధులు వెంటనే మంజూరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. బడ్జెట్‌ కేటాయింపుల పరిమితితో సంబంధం లేకుండా ఈ నిధులు విడుదల కానున్నాయి.

ఏడో వంతు మాత్రమే.. 
రాష్ట్ర రహదారుల విభాగం పరిధిలో 28 వేల కిలోమీటర్ల రోడ్‌ నెట్‌వర్క్‌ ఉంది. ఇందులో ఇప్పుడు 4 వేల కి.మీ. పరిధిలో మాత్రమే పనులు జరగనున్నాయి. అంటే ఏడో వంతు మాత్రమే. ప్రతిరోడ్డుకు ఐదేళ్లకోసారి రెన్యూవల్‌ పనులు జరగాలని ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ చెప్తోంది. అయితే అది ఖర్చు తో కూడుకున్న వ్యవహారం అయినందున కనీసం ఏడేళ్లకోసారి అయినా మరమ్మతు జరగాలన్నది నిపుణుల మాట.

రాష్ట్రంలో 28 వేల కి.మీ. రాష్ట్ర రహదారులున్నందున ప్రతియేటా 4వేల కి.మీ. రోడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున డబుల్‌ రోడ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఈ రోడ్ల పనులు చేపట్టారు. ఇందులో కొన్నింటిని పూర్తి చేశారు. వీటి నిర్మాణం వల్ల ఆయా ప్రాంతాల్లో ఏర్పడ్డ కొత్త రోడ్లనే రెన్యువల్స్‌గా భావిస్తున్నారు.

అవి తప్ప విడిగా రోడ్డు రెన్యువల్‌ పనులు చేపట్టలేదు. ఫలితంగా చాలా రోడ్లు బలహీనపడ్డాయి. గత మూడేళ్లుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. పునరుద్ధరణ పనులకు నిధులులేక.. బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. రోడ్ల దుస్థితిపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఇటీవల ముఖ్యమంత్రి సమీక్షించి వాటిని మెరుగు పరిచేందుకు ఆదేశాలివ్వటంతో సుదీర్ఘ విరామం తర్వాత వాటికి మంచిరోజులు రాబోతున్నాయి. రూ.3 వేల కోట్లలో దాదాపు రూ.700 కోట్లు వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు కేటాయించారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు