బాబోయ్‌ చీకటి పడితే.. ఆ రోడ్డంటే భయం భయం

11 Dec, 2021 17:21 IST|Sakshi

సాక్షి,సిరిసిల్ల(కరీంనగర్‌): సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులోని కలెక్టరేట్‌ బైపాస్‌రోడ్డుపై సాయంత్రం వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వీధిలైట్లు వెలుగక ఎటూ చూసిన కారుచీకట్లే ఉండడం అఘంతకులకు కలిసొస్తుంది. ఆ రహదారిపై సాయంత్రం వాహనాల రాకపోకలు చాలా తక్కువగా ఉంటుండడంతో దుండగులకు అవకాశంగా మారింది. ఇటీవల తరచూ దా రిదోపిడీ ఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఓ ద్విచక్రవాహనదారున్ని బెదిరించిన తీరు.. తాజాగా రిటైర్డ్‌ ఉద్యోగిని బెదిరించి బంగారం ఉంగరం ఎత్తకెళ్లడంతో స్థానికులు భయపడుతున్నారు.

దారిపొడువున చీకటి 
సిరిసిల్ల బైపాస్‌ రోడ్డు మొత్తం అంధకారం అలుముకుంటుంది. సాయంత్రం వేళ ఆ రోడ్డుపై వాహనాల రద్దీ దాదాపు తగ్గిపోతుంది. కలెక్టరేట్, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం అదే దారిలో ఉన్నాయి. ఆయా కార్యాలయాలకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేక ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. విధులు ముగిసిన అనంతరం సాయంత్రం కాలినడకన వెళ్దామంటే వీధిదీపాలు లేక చీకటిగా ఉంటుంది. ఇదే ఆసరాగా చేసుకుని కొందరు పోకిరీలు వెకిలి చేష్టలు చేస్తుండగా, మరికొందరు దారికాచి దొంగతనాలు చేస్తున్నారు. వాహనాలపై వెంబడించి దారిదోపిడీలకు పాల్పడుతున్నారు.

పోలీసులమని బెదిరింపులు 
జిల్లాలో పోలీసుల పేరు చెప్పి బెదిరించే సంస్కృతి ఊపందుకుంటోంది. రగుడు ఎల్లమ్మరోడ్డు నుంచి బైపాస్‌రోడ్డులో పలు సంఘటనలు జరిగాయి. జిల్లా ఆవిర్భవించిన ఏడాదికి భార్యభర్తలు బైక్‌పై వె ళ్తుంటే పోలీసులమని చెప్పి వాహనాన్ని తనిఖీ చేసి డబ్బులు వసూలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు నెలల క్రితం వ్యాపారులను కొందరు బెదిరించి పెద్ద ఎత్తున నగదు లాక్కున్నట్లు తెలిసింది. మళ్లీ ఇప్పుడు విశ్రాంత రెవెన్యూ ఉద్యోగిని పోలీసులమని బెదిరించి  బంగారు ఉంగరాన్ని లాక్కెళ్లారు. దీంతో సదరు ఉద్యోగి తనకు జ రిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించాడు.  బైపాస్‌రోడ్డులో పోలీసుల గస్తీ పెంచాలని, వీధి దీపాలు బిగించాలని స్థానికులు కోరుతున్నారు.

ఉంగరం లాక్కున్నారు
భూమి పనిమీద సిరిసిల్లలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి  బుధవారం సాయంత్రం వెళ్లిన. బైపాస్‌రోడ్డులో ఇద్దరు అడ్డగించి, నా జేబులు చెక్‌ చేశారు. రూ.200 మాత్రమే ఉండడంతో చేతికి ఉన్న బంగారు ఉంగారాన్ని లాక్కున్నారు.  
– ఎం.సిద్ధేశ్వర్‌రావు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి, బొప్పాపూర్‌ 

చర్యలు తీసుకుంటాం
పోలీసులమని చెప్పి తనిఖీలు చేసి.. చేతికున్న ఉంగరాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తీసుకున్నట్లు ఒక వృద్ధుడు పోలీస్‌స్టేషన్‌లో తెలిపిన మాట వాస్తవమే.  ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో నాకు ఆలస్యంగా తెలిసింది. తగు చర్యలు తీసుకుంటాం
– అనిల్‌కుమార్, సీఐ, సిరిసిల్ల  

చదవండి: స్కూల్‌కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు!

మరిన్ని వార్తలు