ఆర్టీసీకి దారులు మూస్తున్న ప్రైవేట్‌ రూట్‌

4 Apr, 2021 04:41 IST|Sakshi

ప్రైవేటు స్టేజీ క్యారియర్లతో ప్రమాదంలో ఆర్టీసీ మనుగడ

రోడ్డు రవాణా నిబంధనల్లో కేంద్రం చేసిన సవరణలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..

టూరిస్టు బస్సుల్లో వ్యక్తులుగా కూడా ప్రయాణాలకు చాన్స్‌

దేశమంతా ఒకే పర్మిట్‌

సాక్షి, హైదరాబాద్‌: నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని మరింతగా అగాథంలోకి నెట్టే కొత్త విధానానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. నిబంధనలకు పాతరేసి స్టేజీ క్యారియర్లుగా ప్రయాణికులను తరలిస్తూ ఆర్టీసీ కొంప ముంచుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు ఇక దర్జాగా తిరగనున్నాయి. ఇంతకాలం టూరిస్ట్‌ పర్మిట్లకే పరిమితమవుతూ వచ్చిన బస్సులు ఇక సమూహాలతోపాటు వ్యక్తులుగా కూడా ప్రయాణికులను తరలించొచ్చు. దీంతో ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద ప్రమాదం వచ్చి పడింది.

ఏంటీ ఈ మార్పు..
కేంద్ర ప్రభుత్వం గతంలో రోడ్డు రవాణా నిబంధనల్లో చేసిన అతి కీలక సవరణ ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. గతంలో టూరిస్టు పర్మిట్లతో కేవలం నిర్ధారిత ప్రాంతం నుంచి గమ్యం వరకు సమూహాలను మాత్రమే తరలించే వెసులుబాటు ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు బస్సులకు ఉండేది. ఏయే రాష్ట్రాల మీదుగా ఆ బస్సు తిరిగితే, ఆయా రాష్ట్రాలకు పర్మిట్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు పర్యాటకాన్ని ప్రోత్సహించే పేరుతో కేంద్రం అఖిల భారత టూరిస్ట్‌ పర్మిట్‌ నిబంధనలను సవరించింది. ఇందులో భాగంగా కొత్త పర్మిట్‌ విధానం, ప్రయాణికుల తరలింపులో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో పెళ్లి బృందాలు, యాత్రలు, ఇతర అవసరాలకు సంబంధించి ఒక ప్రాంతం నుంచి గమ్యం వరకు ఒకే బృందంగా ప్రయాణికులను తరలించేవారు. కానీ, ఇప్పుడు ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా ఎవరికి వారుగా ప్రయాణాలు చేయొచ్చు. అలాంటప్పుడు వారి గమ్యస్థానాలు కూడా వేరుగా ఉంటాయి. అంటే.. స్టేజీ క్యారియర్లుగా అధికారికంగా మారినట్టే. బస్సుకు బోర్డు పెట్టొద్దన్న నిబంధన తప్ప మిగతా అంతా ఆర్టీసీ బస్సు తరహాలోనే మారే అవకాశం కనిపిస్తోంది. 

పర్మిట్‌ ఫీజులు ఇలా..
గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పర్మిట్‌ ఫీజులు వసూలు చేసుకునేవి. ఇప్పుడు దేశం మొత్తం ఒకే పర్మిట్‌ ఫీజు ఉంటుంది. మొత్తం వసూళ్ల నుంచి దామాషా ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు పంచుతుంది. కొత్త ఫీజులు ఇలా... డ్రైవర్‌ కాకుండా తొమ్మిది మంది లోపు ప్రయాణికులుండే వాహనాలకు సంబంధించి ఏసీ వాహనాలకు రూ.25 వేలు, నాన్‌ ఏసీ వాహనాలకు రూ.15 వేలు, పది అంతకంటే ఎక్కువ–23 కంటే తక్కువ మంది ప్రయాణికుల సామర్ధ్యం ఉండే వాహనాలలో ఏసీ అయితే రూ.75 వేలు, నాన్‌ ఏసీ అయితే రూ.50 వేలు, 23 మంది ప్రయాణికులు అంతకంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న వాహనాలకు ఏసీ అయితే రూ.3 లక్షలు, నాన్‌ ఏసీ అయితే రూ.2 లక్షలు వార్షిక పర్మిట్‌ ఫీజు చెల్లించాలి. ఇది మ్యాక్సీ క్యాబ్, టూరిస్టు బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. సొంత వాహనాలకు ఇది వర్తించదు. 

పెరగనున్న ప్రైవేటు బస్సులు
ప్రస్తుతం రాష్ట్రంలో 4,575 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ఉన్నాయి. వీటిల్లో కొన్ని టూరిస్టు బస్సులు పోను, మిగతావన్నీ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులే. ఆర్టీసీ తరహాలో ఇవి టికెట్లు బుక్‌ చేసి ప్రయాణికులను తరలిస్తున్నాయి. వీటి వల్ల సాలీనా ఆర్టీసీ రూ.3 వేల కోట్ల వరకు నష్టపోతోందన్న అంచనా ఉంది. ప్రైవేట్‌ బస్సులను నియంత్రించే యంత్రాంగంలోని పలువురు సిబ్బంది నిర్వాహకుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసి వదిలేస్తున్నారు. ఎప్పుడో ఓసారి దాడులు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్టీసీ, రవాణా శాఖలతో కలిపి ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించి, అప్పటి జేటీసీ వెంకటేశ్వర్లుకు బాధ్యత అప్పగించారు. కానీ, ఆ తర్వాత దాని గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ అధికారి రిటైరయ్యే వరకు ఎలాంటి కార్యాచరణ లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తవిధానం వచ్చిన నేపథ్యంలో ప్రైవేట్‌ బస్సుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దూరప్రాంతాలకు అవి స్టేజీ క్యారియర్లుగా తిరిగే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఇక ఆర్టీసీకి అశనిపాతమే..
‘కొత్తగా అమలులోకి వచ్చిన ఈ వెసులుబాటు నిజంగా ఆర్టీసీకి అశనిపాతమే కానుంది. ఊరి పేరుతో బోర్డు లేకుండా ప్రైవేటు బస్సులు స్టేజీ క్యారియర్ల తరహాలోనే తిరుగుతాయి. చర్యలు తీసుకుంటారన్న భయం కూడా ఉండదు. కేంద్రం చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకించే వెసులుబాటు ఇందులో లేకుండా పోయింది’’
–గాంధీ, రవాణా శాఖ విశ్రాంత అదనపు కమిషనర్‌  

మరిన్ని వార్తలు