Telangana: రోడ్లకు రోగం.. పరిస్థితి అధ్వానం!

10 Nov, 2022 10:07 IST|Sakshi

ఇటీవలి వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు

గుంతలు పడి, గోతులు తేలి ప్రమాదకరంగా మారిన దారులు

దాదాపు 2,975 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని అంచనా

మరమ్మతులకు దాదాపు రూ.714 కోట్లు అవసరమంటున్న అధికారులు

పరిపాలన అనుమతులు వచ్చాక జీవో విడుదలకు అవకాశం

రోడ్లు దెబ్బతిని, దుమ్ము కారణంగా జనం ఆరోగ్యంపై ప్రభావం

గుంతల వల్ల పాడైపోతున్న వాహనాలు.. పెరుగుతున్న ప్రమాదాలు

ఇది యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి నుంచి ఆత్మకూర్‌ (ఎం) మండలం రాయిపల్లికి వెళ్లే రోడ్డు దుస్థితి. సుమారు 5కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు ఎక్కితే చాలు అంతా దుమ్మే. కొంత దూరంలో ఏముందో కూడా కనబడని పరిస్థితి. ప్రయాణికులతో పాటు రోడ్డుకు సమీ పంలోని ఇళ్లలో ఉంటున్నవారు దుమ్ముతో అనారోగ్యం పాలవుతున్నారు. వానలకు రోడ్డు గుంతలు పడటంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు, వాహనాలు దెబ్బతింటున్నాయి.

రెండేళ్ల కిందే రోడ్డు పనులను మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తిచేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇటీవల కాటే పల్లికి చెందిన రాంరెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రికి వెళితే వైద్యులు పరీక్షించి దుమ్ము వల్లే సమస్య అని చెప్పారు. రాంరెడ్డి ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది. ఇప్పుడాయన కుటుంబం రాత్రిపగలు ఇంటి తలుపులు, కిటికీలు పెట్టుకునే ఉంటోంది. ఇక వాహనాల నుంచి వస్తున్న దుమ్ముతో పిల్లలు తరచూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని, మాస్కులు పెట్టుకుని ఉంటున్నామని కాటేపల్లికి చెందిన పచ్చిమట్ల ప్రమీల వాపోయారు. పిల్లలను బయట ఆడు కోనిచ్చే పరిస్థితి లేదన్నారు.    
– సాక్షి, యాదాద్రి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇటీవలి వర్షాల కారణంగా దాదాపు అన్ని జిల్లాల్లో స్థానిక రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. గుంతలు పడి ప్రమాదకరంగా మారాయి. పలుచోట్ల రాష్ట్ర రహదారులు కూడా దెబ్బతి న్నాయి. దీంతో ఓ వైపు ప్రయాణికులు తీవ్రంగా అవస్థలు పడు తుంటే.. మరోవైపు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,245 కి.మీల రహదారులు రోడ్లు–భవనాల శాఖ పరిధిలో ఉన్నాయి. ఇందులో 3,152 కి.మీ. రాష్ట్ర రహదారులు, 12,079 కి.మీ ప్రధాన జిల్లాలను కలిపే రహదారులు కాగా.. 9,014 కి.మీ ఇతర జిల్లాలను, పట్టణాలను కలిపే రోడ్లు. ఇటీవలి వర్షాల నష్టం నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పరిస్థితిని ఆర్‌అండ్‌బీ అధికారులు పరిశీలించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో సగటున ప్రతీ నియోజకవర్గంలో 25 కిలోమీటర్ల మేర రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరముందని గుర్తించారు. మొత్తంగా 2,975కి.మీ.ల మేర రహదారులకు మరమ్మతులు అవ సరమని అంచనా వేశారు. అన్ని వివరాల మదింపునకు మరో పదిరోజులు పట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇక వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి చాలాచోట్ల కల్వర్టులు, కాజ్‌వేలు దెబ్బతి న్నాయి. వాటికి మరమ్మ తులు చేయ డం, కొత్తగా నిర్మించడం, అవస రమైన చోట బ్రిడ్జీల నిర్మా ణం చేపట్టడంపై అధికారులు దృష్టి సారించారు.

రూ.714 కోట్లు అవసరం!
సగటున ప్రతి నియోజకవర్గంలో రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం కనీసం రూ.6 కోట్లు కావాలని అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా కలిపి రూ.714 కోట్లకుపైగా నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. వీటికి పరిపాలనా పరమైన అనుమతులు రాగానే ప్రభుత్వం జీవో విడుదల చేసి, నిధులు విడుదల చేస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇక కుంగిన, కూలిన బ్రిడ్జీ లు, కల్వర్టుల కోసం ప్రత్యేకంగా నిధులు అవసరమని అంటున్నారు.

చాలాచోట్ల ఇదే దుస్థితి..
సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండా పూర్‌ వద్ద కాజ్‌వే వరదలకు కొట్టుకుపోయింది. తాత్కాలికంగా మట్టిరోడ్డు వేసి రాకపోకలు ప్రారంభించారు. వంతెన నిర్మాణం కోసం రూ.5.1 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు.
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరదల వల్ల ఆర్‌అండ్‌ బీ రోడ్లు 109.3కి.మీ. మేర దెబ్బతిన్నాయని, రూ.123 కోట్లకుపైగా నష్టం జరిగిందని అధికారు లు గుర్తించారు. తక్షణ మరమ్మతుల కోసం రూ.22 కోట్లు విడుదల చేసి పనులు చేపట్టినట్టు తెలిపారు.
నిజామాబాద్‌ జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో 54 పెద్ద రోడ్లు, వందకుపైగా చిన్నరోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు.ఆర్మూర్, బాల్కొండ, బోధన్, నిజామాబాద్‌ రూరల్, అర్బన్‌ సబ్‌ డివి జన్ల పరిధిలో రూ.22 కోట్ల అంచనాలతో మర మ్మతుల ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.


ఖమ్మం–భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు వద్ద ప్రధాన రహదారి దుస్థితి ఇది. ఖమ్మం జిల్లా ఏన్కూర్‌ మండలం అక్కినాపురంతండా వద్ద తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రహదారి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోభానగర్‌–కొమ్ముగూడెం రోడ్డు కూడా దెబ్బతిని గుంతలు పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

పెద్దవాగు బ్రిడ్జిలో ప్రజల ఇబ్బందులు

ఆదిలాబాద్‌ జిల్లాలో కుప్పకూలిన అందెవెల్లి పెద్ద వాగు బ్రిడ్జి, దీనివల్ల రాకపోకల కోసం వాగులో తిప్పలుపడుతున్న ప్రజల చిత్రాలివి. భారీ వర్షా లతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చాలాచోట్ల రోడ్లు, కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయి. 


ఉమ్మడి నల్లగొండ జిల్లా వెంకేపల్లి– చర్లగూడెం మధ్య ప్రధాన రహదారిపై కుంగిపోయిన కల్వర్టు ఇది. అధికారులు ఎన్నికల నేపథ్యంలో కంటి తుడుపు చర్యగా మట్టి పోసి చేతులు దులుపుకొన్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె వాగుపై ఉన్న బ్రిడ్జి దుస్థితి ఇది. నల్లగొండ జిల్లాలోని చందంపేట, దేవరకొండ మండలాలకు వెళ్లే రోడ్డుపై ఉన్న ఈ బ్రిడ్జి వరదల వల్ల బాగా దెబ్బతిన్నది. ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు.

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రానికి, వేచరేణి గ్రామానికి మధ్య రోడ్డు ఇది. భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా తెగిపోయింది. వేచరేణి గ్రామస్తులు చుట్టూ తిరిగి చేర్యాలకు వెళ్లాల్సి వస్తోంది.


జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహము త్తారం మండలం యత్నారం– సింగంపల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న కల్వర్టు ఇది. ఫలితంగా సింగంపల్లి, మోదేడు, కొత్తపల్లి గ్రామాల ప్రజలు కాలినడకనే మండల కేంద్రానికి రావాలి. వాహనాల్లో వెళ్లాలంటే చుట్టూ 40 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది.  

మరిన్ని వార్తలు