Telangana Roads: అడుగుకో మడుగు.. గజానికో గొయ్యి..

7 Oct, 2021 09:44 IST|Sakshi
ఇది హన్మకొండ జిల్లాలోని కాజీపేట–కడిపికొండ రోడ్డు. రోడ్డు అనదగ్గ ఆనవాళ్లు కూడా లేకుండాపోయిన ఈ దారి ఆర్‌అండ్‌బీ రోడ్డు. కానీ, కనీసం కచ్చా రోడ్డులా కూడా లేకుండాపోయి వాహనదారులను బెంబేలెత్తిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా వానలకు తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు

4,400కి.మీ.మేర కొట్టుకు పోయిన తారు

60 తక్కువ ఎత్తు కాజ్‌వేలు ధ్వంసం

15 వేల మీటర్ల మేర గండ్లు.. ప్రమాదకరంగా ప్రయాణాలు

అసెంబ్లీలో పార్టీలకతీతంగా రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యేల ఆవేదన

సాక్షి, హైదరాబాద్‌: భారీవర్షాలు రోడ్లను తీవ్రంగా దెబ్బతీశాయి. మరోవైపు కొత్త రోడ్ల నిర్మాణం మినహా, కొంతకాలంగా పాతరోడ్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉండటంతో రోడ్లు క్రమంగా ఛిద్రమవుతున్నాయి. ప్రతి ఏడాది వాటిని మరమ్మతులు చేయాల్సి ఉండగా, నిధుల సమస్యతో పెండింగులో పెడుతూ వస్తున్నారు. దీంతో వానాకాలం ప్రారంభంలో కురిసిన వానలతో రోడ్ల ధ్వంసం మొదలైంది. జూలైలో కురిసిన భారీ వర్షాలతో వందల కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం కాగా, ఇటీవల కురిసిన వర్షాలు మరింతగా దెబ్బతీశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 4,461 కి.మీ. మేర రోడ్డు ఉపరితలం దెబ్బతినగా, 15,721 మీటర్ల మేర రోడ్లకు గండ్లు పడ్డాయి.

ఫలితంగా చాలాప్రాంతాల్లో వాహనాల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఎత్తు తక్కువ కాజ్‌ వేలున్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత ప్రమాదకంగా మారింది. ఇలాంటి 60 వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నెలలో కూడా వానలు పడితే రోడ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయేలా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు రోడ్ల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన బాగు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఇది సిరిసిల్ల–కరీంనగర్‌ రోడ్డు. ఇంత ప్రధానమైన రోడ్డు ఇలా తయారైంది. బలహీనపడ్డ తారుపూత వరదకు కొట్టుకుపోయి పెద్దగొయ్యి ఏర్పడింది. 

ఎందుకీ పరిస్థితి..
సాధారణంగా ప్రతి ఐదేళ్లకోసారి రోడ్లను పూర్తిస్థాయిలో రెన్యూవల్‌ చేసేలా పీరియాడికల్‌ సైకిల్‌ ప్లాన్‌ ఉంటుంది. ఇందుకయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని దీన్ని ఏడెనిమిదేళ్లకు పెంచారు. దీనివల్ల ఐదేళ్ల తర్వాత రోడ్లు క్రమంగా బలహీనపడుతున్నాయి. ఆ సమయంలో పనుల్లో మరింత జాప్యం జరిగితే, తదుపరి వర్షాలకు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో 28 వేల కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లున్నాయి. వీటిల్లో గత ఆరేళ్లలో 7,500 కి.మీ. మేర రోడ్లను విస్తరించారు. ఇవి మినహా మిగతావి అంత మెరుగ్గా లేవు. మిగతా రోడ్లలో, పంచాయతీరాజ్‌ శాఖ నుంచి బదిలీ అయినవి 6 వేల కి.మీ.మేర ఉన్నాయి.

వీటి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రణాళిక ప్రకారం రెన్యూవల్‌ చేయాల్సిన రోడ్లు 12 వేల కి.మీ. మేర పెండింగులో ఉన్నాయి. వీటన్నింటికి మరమ్మతులు చేయాలంటే రూ.2 వేల కోట్లు అవసరమవుతాయి. ఇలాంటి రోడ్లే వానల్లో బాగా దెబ్బతింటున్నాయి. విస్తరించిన రోడ్లు, నిర్వహణ పూర్తయిన రోడ్లు పర్వాలేదు. వాగులు వంకలపై తక్కువ ఎత్తుతో ఉండే కాజ్‌వేలను తొలగించి వాటిస్థానంలో వంతెనలు నిర్మించాల్సి ఉంది. తెలంగాణ వచ్చాక ఇలాంటివి 600 వరకు మార్చారు. ఇంకా 700 వరకు మార్చాల్సి ఉంది. తాజా వానల్లో ఇలాంటివి బాగా దెబ్బతిని రాకపోకలను స్తంభింపచేశాయి. 

రూ.645 కోట్లు కావాలి..
బలహీనంగా ఉండి, భారీ వర్షాలతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో వాటిని ఇప్పటికిప్పుడు మరమ్మతు చేయాలంటే రూ.645 కోట్లు అవసరమని రోడ్లు, భవనాల శాఖ గుర్తించింది. కానీ, ప్రస్తుతం అన్ని నిధులు అంద బాటులో లేకపోవటంతో వాటిని విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అందుబాటులో ఉన్న రూ.60 కోట్లతో అత్యవసర పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు