సముద్ర ప్రాంతాల సర్వేకు రోబోటు

24 Nov, 2020 09:23 IST|Sakshi

  సిద్ధం చేసిన ఐఐటీ మద్రాస్

  లోతు తక్కువ జలాల్లోనూ కచ్చితమైన కొలతలు చేపట్టగల సామర్థ్య 

 పూర్తిగా సౌరశక్తితో పనిచేయగలగడం ప్రత్యేకత

 గస్తీ కాసేందుకూ ఉపయోగించే వీలు

సాక్షి, హైదరాబాద్‌: దేశానికి సంబంధించిన వేలాది కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతాన్ని సులువుగా సర్వే చేసేందుకు సరికొత్త రోబో బోటును ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. దేశ సముద్ర సంబంధ రంగంలో స్వావలంబన సాధించే దిశగా రూపొందించిన ఈ రోబో బోటు పూర్తిగా సౌరశక్తితో నడుస్తుంది. సముద్ర ప్రాంతాలతోపాటు నదీజలాల్లోనూ స్వతంత్రంగా సర్వే చేయడం, గస్తీ కాసేందుకూ దీన్ని ఉపయోగించవచ్చు.

ధ్వనికి సంబంధించిన ఎకో సౌండర్, జీపీఎస్, బ్రాడ్‌బ్యాండ్‌ వంటి ఐటీ హంగులను, లిడార్, 360 డిగ్రీ కెమెరా కొలతలకు సంబంధించిన ఇతర పరికరాలు ఇందులో ఉంటాయి. ఈ రోబో బోటును ఇప్పటికే చెన్నై సమీపంలోని కామరాజర్‌ నౌకాశ్రయంలో పరీక్షించామని, కోల్‌కతాలోని శ్యామాప్రసాద్‌ ముఖర్జీ నౌకాశ్రయంలో మరిన్ని కఠిన పరీక్షలకు గురిచేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని నేషనల్‌ టెక్నాలజీ సెంటర్‌ ఫర్‌ పోర్ట్స్, వాటర్‌వేస్‌ అండ్‌ కోస్ట్స్‌ ఇన్‌చార్జి ప్రొఫెసర్‌ కె. మురళి తెలిపారు.

లోతు తక్కువ సముద్ర జలాల్లోనూ ఇది కచ్చితమైన కొలతలు ఇవ్వగలదని, నౌకాశ్రయం సామర్థ్యం పెంచేందుకు పలు విధాలుగా ఉపయో గపడుతుందని ఆయన వివరించారు. పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఎంత సేపైనా ఉపయోగించుకోవచ్చని, అడ్డంకులను దానంతట అదే తప్పించుకొని పనులు నిర్వహించగలదని తెలిపారు. వచ్చే ఏడాది ఈ బోటు కార్యకలాపాలు సాగించగలదని అంచనా వేస్తున్నారు.  

మరిన్ని వార్తలు