కరోనా టైమ్‌.. రోబోటిక్‌ సర్జరీలకు ఊపు

4 Jan, 2021 08:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరోనాతో రోబోటిక్‌ సర్జరీలకు ఊపు 

సోషల్‌ డిస్టెన్సింగ్‌కు ఉపయుక్తం 

వేగంగా డిశ్చార్జితో ఇన్ఫెక్షన్స్‌కు తక్కువ ఆస్కారం  

వైద్య రంగంలో రోబోలు ప్రవేశించి దశాబ్దాలు గడిచింది. వాటి వినియోగం కూడా దినదినాభివృద్ధి చెందుతున్న క్రమంలో.. చాలా రంగాల్లో పెను మార్పులు తెచ్చిన కరోనా వైద్య రంగంలో కూడా అనేక మార్పులకు కారణమైంది. అందులో ఒకటి రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ(ఆర్‌ఎఎస్‌)లకు మరింత ఆదరణ పెంచడం. నగరంలో మరింత మందికి రోబోల సాయంతో చేసే శస్త్ర చికిత్సలపై అవగాహన పెంచడంతో పాటు భవిష్యత్‌లో వాటి అవసరాన్ని గుర్తించేలా చేసింది కరోనా. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన రోబోటిక్‌ సర్జరీ నిపుణులు చెబుతున్న ప్రకారం..      

సాక్షి, హైదరాబాద్‌: కొన్ని నెలల్లోనే ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, కోల్‌కతాల్లో ఆర్‌ఏఎస్‌లు ఊపందుకున్నట్టు సమాచారం. లాక్‌డౌన్‌ ప్రకటించిన 4 నెలల్లోపు బెంగళూర్‌లోనే 400కిపైగా ఆర్‌ఏఎస్‌లు నిర్వహించారు. అలాగే మిగిలిన మెట్రోల్లో కూడా లాక్‌డౌన్‌ టైమ్‌లో రోబోల వినియోగం బాగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్‌ కారణంగా అత్యవసరం కాని సర్జరీలను ఇన్ఫెక్షన్‌ భయంతో ఆస్పత్రులు ఆపి ఉంచాయని నగరానికి చెందిన ఓ సర్జన్‌ చెప్పారు. తక్కువ సంఖ్యలో వైద్య సిబ్బంది, పేషెంట్‌కు దూరంగా సర్జన్‌ ఓ కన్సోల్‌ మీద కూర్చుని ఉండి చేయవచ్చు కాబట్టి.. తప్పనిసరిగా చేయాల్సిన సర్జరీను మాత్రం లాక్‌డౌన్‌ టైమ్‌లో రోబోల సహకారంతో నిర్వర్తించామన్నారని ఆయన వెల్లడించారు.  

ఆస్పత్రిలో గడిపే కాలం తగ్గడం 
ఓపెన్‌ సర్జరీ చేస్తే కొన్ని రోజుల పాటు తప్పకుండా ఆస్పత్తిలో ఉండాల్సి ఉంటుంది. అదే రోబోటిక్‌ సర్జరీ చేస్తే సర్జరీ చేసిన తర్వాత కేవలం ఒక్కరోజులో డిశ్చార్జి అయి వెళ్లిపోవచ్చు. దీని ద్వారా కనీసం వారం రోజుల వ్యవధి తేడా వస్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశాలు కూడా ఆ మేరకు తగ్గినట్టే అవుతుంది. అయితే మరి ధరలో వ్యత్యాసం ఉన్నప్పటికీ.. తక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండటం ద్వారా రోజువారీ వ్యయాలు చాలా తగ్గుతాయి. కాబట్టి పెద్ద తేడా అనిపించదు. పైగా నొప్పి కూడా తక్కువ ఉంటుంది.  

సర్జన్ల కొరత.. పెరిగిన శిక్షణ 
ఒకప్పుడు భయపడేవారు ఇప్పుడు తగ్గింది. చివరి దశలో ఉన్నవారు కూడా రోబోటిక్‌ సర్జరీ చేయాలంటున్నారు. రోబోటిక్‌ సర్జరీలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా సదరు సర్జరీలపై మరింత మంది వైద్యులకు శిక్షణ అవసరం అవుతోంది. నగరంలో ఈ శిక్షణ పొందిన సర్జన్లు రెండంకెలలోపే ఉంటారని అంచనా. గతంలో ఈ శిక్షణ అమెరికా, పారిస్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా లభిస్తోంది. అయితే రెగ్యులర్‌ సర్జరీల్లో తగినంత అనుభవం వచ్చిన తర్వాతనే ఈ శిక్షణ ఇస్తారు. ‘తెలుగు రాష్ట్రాలలో రోబోటిక్‌ సర్జరీలు చేసేవారి సంఖ్య 20లోపే ఉండొచ్చు. పరిస్థితుల కారణంగా శిక్షణ కార్యక్రమాలు కూడా పెరిగాయి. నేనూ ఇటీవలే విశాఖ వెళ్లి శిక్షణ ఇచ్చి వచ్చాను’ అని అపోలో వైద్యులు డా.చినబాబు చెప్పారు.  

సోషల్‌ డిస్టెన్స్‌కి మేలు.. 
⇔ సాధారణంగా ల్యాప్రొస్కపీ, ఓపెన్‌ హార్ట్‌ తదితర సర్జరీలకు సర్జన్‌ సహా అందరూ పక్కపక్కనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే రోబోట్రిక్స్‌లో ఆ అవసరం ఉండదు. కనీసం 8 నుంచి 10 అడుగుల దూరం వరకూ ఉండే సర్జరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో కరోనా టైమ్‌లో రోబోల వినియోగంవైపు బాగా మొగ్గు చూపుతున్నారు.  

⇔ ప్రస్తుతం గైనిక్‌ కేన్సర్స్, పెద్దపేగు, అన్నవాహిక, ప్రోస్టేట్‌ కేన్సర్‌లకు అవసరమైన సర్జరీలు చేయడంలో ఎక్కువగా రోబోటిక్స్‌ సహకారం తీసుకుంటున్నారు. అలాగే గర్భసంచి తొలగించడానికి కూడా రోబోటిక్‌ సర్జరీ ఎంచుకుంటున్నారు. 

కరోనా పరిస్థితుల్లో ఉపయుక్తమే.. 
నాకు 8 ఏళ్ల నుంచి రోబోటిక్‌ సర్జరీలు చేస్తున్న అనుభవం ఉంది. కోవిడ్‌ కారణంగా కొంత వరకూ రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీల శాతం పెరిగిందనేది నిజమే. సోషల్‌ డిస్టెన్స్‌కి, అలాగే ఆస్పత్రుల్లో తక్కువ రోజుల్లోనే డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం వల్ల కోవిడ్‌ పరిస్థితుల్లో ఈ సర్జరీలు చాలా ఉపయుక్తంగా మారాయి. రోగుల్లో కూడా రోబోటిక్‌ సర్జరీలపై బాగా అవగాహన పెరిగింది. వారే స్వయంగా ఈ పద్ధతిలో సర్జరీ గురించి అడిగే పరిస్థితి కూడా వచ్చింది. అలాగే రోబోలకు సంబంధించి కొత్త కొత్త ఆవిష్కరణలూ వెలుగు చూస్తున్నాయి.  
– డాక్టర్‌ చినబాబు సుంకవల్లి, రోబోటిక్‌ సర్జికల్‌ అంకాలజిస్ట్, అపోలో కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ 

మరిన్ని వార్తలు