ఏడో నిజాం వాహనంపై బాంబు దాడి.. ఆర్య సమాజ్‌కు సంబంధమేంటి.. అసలు ఆ కథేంటీ?

16 Sep, 2022 20:58 IST|Sakshi

నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆర్య సమాజ్‌ దాదాపు రెండు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించింది. పౌరుల ప్రాథమిక హక్కులకోసం సత్యాగ్రహం చేసి వేల సంఖ్యలో ఆర్య సమాజ్‌ నేతలు, కార్యకర్తలు అరెస్టయ్యారు. కొందరు యువకులు ఏడో నిజాం వాహనంపై బాంబు దాడికి ప్రయత్నించారు. ఈ నిరసన కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంగానే జరిగాయి.
చదవండి: నిజాం నవాబుకు పటేల్ 3 నెలలు గడువు ఎందుకిచ్చారు?.. దీని వెనుక కారణాలేమిటంటే..

హిందూ మతంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘన చరిత్ర ఆర్య సమాజ్‌ది. అయితే కేవలం ఇది మతానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆంగ్లేయుల పాలన నుంచి  దేశాన్ని విముక్తి చేయడానికి జరిగిన స్వాతంత్ర్య  పోరాటంలో పాల్గొన్న ఎంతోమంది యోధులకు కూడా ఆర్యసమాజే స్ఫూర్తినిచ్చింది. వేద విలువలే పునాదిగా దాదాపు 150 సంవత్సరాల క్రితం స్వామి దయానంద సరస్వతి ప్రారంభించిన ఈ సమాజ్‌.. హైదరాబాద్ నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ కీలకపాత్ర పోషించింది. అందులోనూ సుల్తాన్ బజార్ లోని దేవిదీన్ బాగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 

ఆర్య సమాజ్‌ మందిరాలు అనగానే  హైదరాబాద్‌లోని కాచిగూడ, పాతబస్తీలోని శాలిబండ ఆర్య సమాజ్ మందిరాలే  ముందుగా గుర్తొస్తాయి. కానీ సుల్తాన్ బజార్ ప్రాంతంలోని దేవిదీన్ బాగ్ ప్రాంగణం గురించి  తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది సుల్తాన్‌బజార్‌ ఆర్యసమాజ్‌ ఆధ్వర్యంలోనే నడిచేది. ఎంతో మంది ఆర్య సమాజ్ నాయకులకు ఇది సమావేశాల వేదికగా ఉండేది. నిజాం వ్యతిరేక పోరాటానికి తమ కార్యకర్తలను ఇక్కడ నుంచే దిశానిర్దేశం చేసేవారు నాయకులు. ఈ ప్రాంగణంలో ఇప్పుడు ఆర్య కన్య స్కూల్ నడుస్తోంది. దీన్ని ఆర్య సమాజమే నిర్వహిస్తోంది. అప్పుట్లో ఆర్య సమాజ్‌లో క్రియశీల పాత్ర పోషించిన స్వాతంత్ర సమరయోధుడు గంగారామ్. నిజాం నిరంకుశ వ్యతిరేక పాలనలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొనడంతో  ఆయన చదువును మధ్యలోనే ఆపేశారు.

నిజాం పాలనలోని దారుణాలకు వ్యతిరేకంగా ఏడో నిజాం వాహనంపై బాంబుదాడికి ప్రయత్నించిన ఆర్య సమాజ్‌కు చెందిన నారాయణ్‌రావు పవార్‌, జగదీశ్‌ ఆర్య, గండయ్యలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజలు వారిని గుండెల్లో దాచుకున్నారు. నిజాం ప్రభుత్వం ఆ ముగ్గురికీ మరణశిక్ష విధించింది. అయితే అదే సమయంలో హైదరాబాద్‌ స్టేట్‌ .. భారత్‌లో విలీనం కావడంతో ఆ ముగ్గురు విడుదలయ్యారు. 

1938-39  మధ్య కాలంలో సుమారు 13 నెలలపాటు ఆర్య సమాజ్ కార్యకర్తలు ప్రాథమిక హక్కులకోసం చేసిన సత్యాగ్రహం కీలకంగా మారింది. ఆ సమయంలో 13 వేల మంది ఆర్యసమాజ నాయకులు, కార్యకర్తలు అరెస్టయ్యారు. ఎంతో మంది జైళ్లలోనే ప్రాణాలు వదిలారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్య సమాజ్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి నిజాంకి వ్యతిరేకంగా పోరాడారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆర్య సమాజ్‌ కార్యకర్తల అడ్రస్‌లు తీసుకొని.. వారి క్షేమ సమాచారాలను వారి తల్లిదండ్రులకు ఉత్తరాల ద్వారా తెలిపేవారు నాటి ఆర్య స్టూడియో ఫోటోగ్రాఫర్ సత్యనారాయణ ముల్కీ.  అలా తెర ముందు కొందరు, తెర వెనక మరెందరో ఆనాటి ఉద్యమంలో భాగస్వామ్యులయ్యారు.

మరిన్ని వార్తలు