దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం

16 Sep, 2020 05:55 IST|Sakshi

గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌

ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌): ఏ దేశమైనా అభివృద్ధి పథంలో సాగాలంటే ఇంజనీర్ల పాత్ర కీలకమని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. భారతరత్న, సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే ఇంజనీర్స్‌ డే వేడుకలు మంగళవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో వెబినార్‌ ద్వారా జరిగాయి. ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌(ఐఈఐ)–తెలంగాణ స్టేట్‌ సెంటర్‌ ఆధ్వ ర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గవర్నర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను యువ ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రధాని మోదీ దేశాభివృద్ధి కోసం తీసుకొచ్చిన ‘మేకిన్‌ ఇండియా’ పథకాన్ని యువ ఇంజనీర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అవార్డు గ్రహీతలు, ఐఈఐ సభ్యులను గవర్నర్‌ అభినందించారు. అంతకుముందు ఉదయం ఐఈఐ చైర్మన్‌ డాక్టర్‌ రామేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌ చౌరస్తాలోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా ప్రభుత్వ కార్యదర్శి కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఐఈఐ చైర్మన్‌ డాక్టర్‌ జి.రామేశ్వర్‌రావు, కార్యదర్శి టి.అంజయ్య, ఐఈఐ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, డాక్టర్‌ జి.హనుమంతాచారి తదితరులు పాల్గొన్నారు.   

అవార్డు గ్రహీతలు వీరే.... 
ఏటా ఇంజనీర్ల దినోత్సవం పురస్కరించుకొని నైపుణ్యమున్న ఇంజనీర్లను ప్రోత్సహించేందుకు వివిధ అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇచ్చే సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును ఈసారి నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ) వరంగల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌వీ రమణారావు, డీఆర్‌డీఎల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జైతీర్థ్‌ ఆర్‌.జోషి దక్కించుకున్నారు. ‘ఇంజనీర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును ఉస్మానియా యూనివర్సిటీ, సివిల్‌ ఇంజనీరింగ్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ప్రొఫెసర్‌ ఎం.గోపాల్‌ నాయక్, డీఆర్‌డీవో అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ లేబొరేటరీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్, శాస్త్రవేత్త ఎన్‌.కిశోర్‌నాథ్, బీహెచ్‌ఈఎల్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఎం. మోహన్‌రావు అందుకున్నారు. ‘యంగ్‌ ఇంజనీర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును శాస్త్రవేత్త అల్కా కుమారి, బీహెచ్‌ఈఎల్‌ మెటలర్జీ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ మేనేజర్‌ డాక్టర్‌ పవన్‌ ఆళ్లపాటి వెంకటేశ్‌కు అందజేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా