రొమ్ము తొలగించకుండానే..కేన్సర్‌ కొమ్ము వంచేలా..

9 Oct, 2023 04:52 IST|Sakshi

ఆంకోప్లాస్టీ పద్ధతిలో మహిళలకు రొమ్ము కేన్సర్‌ చికిత్స

ప్రభుత్వ ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రిలో ఉచితంగా ఆధునిక చికిత్సా పద్ధతి

 ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా తర్వాత హైదరాబాద్‌లోనే

డాక్టర్‌ మాటూరి రమేష్‌ నేతృత్వంలోని వైద్యబృందం ఘనత

సాక్షి, హైదరాబాద్‌: రొమ్ము కేన్సర్‌ వచ్చిన మహిళా రోగులకు రొమ్ము తొలగించకుండా నిర్వహించే ‘ఆంకోప్లాస్టీ’ చికిత్స పద్ధతికి  ప్రభుత్వ ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ ఎయిమ్స్, ముంబైలోని టాటా కేన్సర్‌ ఆస్పత్రి, పుణే, కోల్‌కతా­లతో పాటు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆస్పత్రి­లోనే ఈ అధునాతన ఆంకోప్లాస్టీ పద్ధతిలో రొమ్ము కేన్సర్‌కు చికిత్స చేస్తున్నారు. ఎంఎన్‌జేలోని సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ మాటూరి రమేష్‌ నేతృత్వంలోని వైద్యబృందం ఈ అధునాతన చికిత్స నిర్వహి­స్తున్నారు. ఇప్పటివరకు 50 మంది మహిళలకు ఆంకోప్లాస్టీ పద్ధతిలో చికిత్స చేశారు.  

పెరుగుతున్న రొమ్ము కేన్సర్‌ కేసులు
రొమ్ము కేన్సర్లలో 70–80 శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతే మేలుకొంటున్నారు. ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రికి వచ్చే రోగుల్లో ఇలాంటి వారే ఎక్కు­వగా ఉంటున్నారు. మహిళా కేన్సర్‌ కేసుల్లో 15 శాతం వరకు రొమ్ము కేన్సర్‌వే ఉంటున్నాయి. అందులో 80 శాతం చాలా అడ్వాన్స్‌ స్టేజీలో చికిత్సకు వస్తున్నారు. అక్టోబరు నెలను బ్రెస్ట్‌ కేన్సర్‌ అవగా­హన మాసంగా నిర్వహిస్తున్నారు.

రొమ్ము కేన్సర్లకు చికిత్సపరంగా కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్‌ ఉంటాయి. వ్యాధి రొమ్ము వరకు ఉంటేనే సర్జరీ చేయ­డానికి అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండి ఫోర్త్‌ స్టేజ్‌కు వస్తే నయం చేయలేం. 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళ కేన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్టు చేయించుకోవాలి. ఎంత ముందుగా గుర్తించగలిగితే నయం చేయడానికి అంత ఎక్కు­వగా అవకాశం ఉంటుంది.

ఆంకోప్లాస్టీ చికిత్స ఇలా..
సాధారణంగా రొమ్ము కేన్సర్‌కు చికిత్సలో మహిళ రొమ్ము మొత్తం తీసేస్తారు. దీనివల్ల వారు మా­నసికంగా ఆందోళనకు గురవుతారు. అయితే పూర్తిగా రొమ్ము తీసే పద్ధతికి ఎంఎన్‌జే ఆస్పత్రి వైద్యులు చెక్‌ పెట్టారు. ఆంకోప్లాస్టీ పద్ధతిలో రొమ్ము తొలగించకుండానే సాధారణంగా ఉండేలా చేస్తున్నారు. ఎవరైనా మహి­ళకు రొమ్ము కేన్సర్‌ను గుర్తించినప్పుడు లేదా ఒకవేళ అది సైజు పెద్దగా ఉంటే కీమోథెరపీ ఇచ్చి గడ్డగా చిన్నగా చేస్తారు. గడ్డ వరకే ఆపరేషన్‌ చేసినప్పుడు మిగిలిన రొమ్ముపై గుంటలాగా ఉంటుంది. దాన్ని ఆంకోప్లాస్టీ ద్వారా దాన్ని సాధారణ స్థితికి తీసుకొ­స్తారు.

ప్లాస్టిక్‌ సర్జరీ టెక్నిక్‌ను వాడుకొని ఏడాది­న్నరగా ఈ ఆంకోప్లాస్టీ చేస్తున్నారు. ఆంకోప్లాస్టీ సర్జరీ చేయడానికి నాలుౖ­గెదు గంటలు పడుతుంది. రొమ్ము పక్కన చంక సమీపంలోని కండను అంతర్గతంగానే ప్రత్యేక పద్ధతిలో తీసుకొచ్చి రొమ్ములో సర్దుబాటు చేస్తారు. అంటే చంకలో ఉండే అదనపు కొవ్వు, కండ, అవసరమైతే చర్మం కూడా తీసుకొని రొమ్ములో ఎక్కడ అవసరం పడుతుందో అక్కడకు తీసుకొచ్చి కుడతారు. పైకి ఎలాంటి కోత కనిపించకుండా ఆంకోప్లాస్టీ పద్ధతిలో చేస్తారు. ఎంఎన్‌జేలో ఇది పూర్తిగా ఉచితం. అదే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఆంకోప్లాస్టీ సర్జరీకి ఏకంగా రూ.5 లక్షల వరకు ఉంటుంది.

మూడువారాల్లో సాధారణ స్థితిలోకి..
ఆంకోప్లాస్టీ విధానంపై మేం ప్రత్యేకంగా శిక్షణ పొందాం.ఆంకోప్లాస్టీ సర్జరీ చేశాక మూడునాలుగు రోజుల్లో ఆస్పత్రి నుంచి రోగిని డిశ్చార్జి చేస్తాం. ఈ చికిత్సలో కుట్లు వాటంతట అవే కరిగిపోయేలా ఉంటాయి. కాబట్టి కుట్లు తీయాల్సిన పనిలేదు. మూడువారాల్లో రోగి సాధారణ జీవితం గడపొచ్చు. నొప్పులేమీ ఉండవు. ఇంటికి వెళ్లేప్పుడు డోలో వంటి మాత్రలు మాత్రమే ఇచ్చి పంపిస్తాం.    – డాక్టర్‌ మాటూరి రమేష్,సర్జికల్‌ ఆంకాలజిస్ట్, ఎంఎన్‌జే, హైదరాబాద్‌

రొమ్ము కేన్సర్‌లో ఆంకోప్లాస్టీ ప్రాచుర్యం పొందింది 
ఈ నెల 13వ తేదీన ప్రత్యేకంగా రొమ్ము కేన్సర్‌పై అవగాహనకు వాక్‌ నిర్వహిస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఆంకోప్లాస్టీ విధానం ప్రపంచంలో ప్రాచుర్యం పొందుతుంది. ఇండియాలో కొన్నిచోట్ల మాత్రమే ఈ చికిత్స చేస్తున్నారు. అందులో హైదరాబాద్‌లో ఎంఎన్‌జేలో చేస్తున్నాం.  – డాక్టర్‌ జయలత, డైరెక్టర్,ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి

మరిన్ని వార్తలు