కారును పోలిన రోటీ మేకర్‌

11 Nov, 2020 03:18 IST|Sakshi

 స్వతంత్ర అభ్యర్థికి 3,570 ఓట్లు 

‘గుర్తు’పట్టక నొక్కేశారని అంచనా! 

సిద్దిపేటజోన్‌ : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు కారును పోలిన రోటీ మేకర్‌ (చపాతీ పీట, అప్పడాల కర్ర) గుర్తు స్వతంత్ర అభ్యర్థికి అనూహ్యంగా ఓట్లు తెచ్చిపెట్టింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బండారి నాగరాజుకు రోటీమేకర్‌ గుర్తురాగా, ఆయనకు 3,570 ఓట్లు పోల్‌ అయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్‌గూడేనికి చెందిన నాగరాజు దుబ్బాక ఎన్నికల్లో పోటీకి దిగారు.

ఈ ఎన్నికల్లో 23 మంది బరిలో ఉండడంతో పోలింగ్‌ రోజు రెండు ఈవీఎంలను వినియోగించారు. మొదటి ఈవీఎంలో 3వ నంబర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి (కారు గుర్తు) ఉండగా, రెండో ఈవీఎంలో అచ్చంగా కారును పోలిన రోటీ మేకర్‌ గుర్తు కూడా పైన ఉండటం ఓటర్లను అయోమయానికి గురిచేసింది. చాలామంది కారు గుర్తుగా పొరపడి రెండో ఈవీఎంలోని రోటీ మేకర్‌పై ఓటు వేయడంతో స్వతంత్ర అభ్యర్థి నాగరాజుకు 3,570 ఓట్లు వచ్చి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.   

మరిన్ని వార్తలు