సమగ్ర ఆరోగ్య విధానం అమలు చేయాలి

14 Feb, 2022 03:58 IST|Sakshi
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ   

లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌  జయప్రకాష్‌ నారాయణ  

సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో సమగ్ర ఆరోగ్య విధానం అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌  జయప్రకాష్‌ నారాయణ డిమాండ్‌ చేశారు. పైసా ఖర్చు లేకుండా ప్రజలందరికీ వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో ‘అందరికి వైద్యం హక్కుగా వైద్య సేవలు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేపీ మాట్లాడుతూ.... ప్రాధమిక దశలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ వ్యవస్థాను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్‌ భవ వంటి పథకాలను ద్వితీయ, తృతీయ స్థాయిల్లో అమలు చేయాలని కోరారు.  రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రూ.1900 కోట్లు అదనంగా కేటాయిస్తే బాగుంటుందన్నారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు బాగానే ఉన్నా అవి ఎంతమాత్రం సరిపోవని, వైద్య సేవలు మరింతగా మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం అందుతున్న వైద్య సదుపాయాలన్నీ  విడిగా ఉన్నాయని వాటన్నింటినీ అనుసంధానం చేసి సమగ్ర ఆరోగ్య విధానం అమలు చేయాలన్నారు. స్వాతంత్య్రం అనంతరం నుంచి ఇప్పటివరకు ప్రజారోగ్యం పట్ల పాలకులు పెద్దగా శ్రద్ధగా చూపలేదని ఇప్పటికీ అయినా సమయం మించిపోలేదు. ఆరోగ్య వ్యవస్థ పట్ల దృష్టిని సారించాలని కోరారు.  తెలంగాణ లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్‌ సభ్యులు డాక్టర్‌ ఆకుల నరేష్బాబు, డాక్టర్‌ చింతల రాజేందర్, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ సత్యప్రకాష్, కటారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు