ధాన్యంపై దండయాత్ర!

30 Dec, 2021 05:48 IST|Sakshi

2021లో రాష్ట్రాన్ని కుదిపేసిన ధాన్యం రగడ 

గణనీయంగా ఉత్పత్తి.. కొనుగోలుపై కేంద్రం ఆంక్షలు 

వరి సాగు భవిష్యత్తులో కష్టమే ∙ఆందోళనలో అన్నదాత 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావం తరువాత మొదలైన కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని జిల్లాలను సస్యశ్యామలంగా మార్చింది. పాలమూరు, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని సాగునీటి పథకాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 20 ఏళ్ల కిందట 2002–03లో వానాకాలం, యాసంగి కలిపి కేవలం 6 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని విక్రయించిన తెలంగాణ రైతులు.. మారిన పరిస్థితుల్లో వ్యవసాయాన్ని పండుగగా చేసుకొని అధిక దిగుబడి తెస్తున్నారు.

గత యాసంగి (రబీ) సీజన్‌లోనే ఏకంగా 92.33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని విక్రయించే స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం కొనుగోళ్లు నడుస్తున్న వానకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో ఇప్పటివరకు 62 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యాన్ని విక్రయించారు. మరో 20–30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం విక్రయించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య ధాన్యం రగడ దేశంలో కొత్త సమస్యను తెరపైకి తెచ్చింది.

రైతు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన కేంద్రం వరి విషయంలో కొత్త కొర్రీలు పెడుతోంది. కేంద్రం విధించిన ‘ఉప్పుడు బియ్యం’ ఆంక్షల చిచ్చు యాసంగి సీజన్‌లో వరిని రైతుకు దూరం చేస్తోంది. రైతు పండించిన ధాన్యం నుంచి సెంట్రల్‌ పూల్‌ కింద ఏయే రాష్ట్రాల నుంచి బియ్యాన్ని భారత ఆహార సమాఖ్య (ఎఫ్‌సీఐ) ఎంత సేకరించాలో ముందే నిర్ణయించి అంతకుమించి తీసుకోబోమని తెగేసి చెప్పింది. యాసంగిలో రాష్ట్రం నుంచి ఎఫ్‌సీఐకి వెళ్లే బాయిల్డ్‌ రైస్‌ను ఇక ముందు కిలో కూడా సేకరించబోమని స్పష్టం చేసింది. దీంతో వరి సాగు విషయంలో కొత్త ఆంక్షలు ఎదుర్కొనే పరిస్థితి ఈ ఏడాది రైతాంగానికి ఎదురైంది.  

యాసంగి ఉప్పుడు బియ్యం లొల్లి 
తెలంగాణలో వేసవి కాలంలో ఏర్పడే అధిక ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ మార్పుల కారణంగా యాసంగిలో ధాన్యం దిగుబడి భారీగానే వస్తుంది. అదే సమయంలో ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్‌ చేసేటప్పుడు బియ్యం గింజ విరుగుతుంది. నూకల శాతం 35–50 శాతం ఉంటుంది. దీంతో రైతుకు నష్టం ఎక్కువ ఉంటుండటంతో యాసంగి ధాన్యాన్ని ఉప్పుడు బియ్యం (బాయిల్డ్‌ రైస్‌)గా మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి పంపించడం కొన్నేళ్లుగా సాగుతోంది.

అయితే కేంద్రం ఒక్కసారిగా ఉప్పుడు బియ్యం సేకరణకు నిరాకరించింది. అందులోభాగంగా 2021 యాసంగిలో వచ్చిన 92.33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నుంచి కేవలం 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో హతాశులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కేంద్రంతో సంప్రదింపులు జరిపినా.. పరిస్థితి మారలేదు.

స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగంలోకి దిగి యాసంగిలో వచ్చే 65 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నుంచి 24.75 ఎల్‌ఎంటీ మాత్రమే తీసుకుంటే కష్టమని, మిగతా బియ్యం ఏం చేసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో కేంద్రం మరో 20 ఎల్‌ఎంటీ అదనంగా తీసుకొనేందుకు ఒప్పుకుంది. అయితే ఇంకెప్పుడూ ఉప్పుడు బియ్యం ఇవ్వకూడదనే షరుతు విధించింది. దీంతో యాసంగిలో కొనుగోలు కేంద్రాలనే ఎత్తేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. వరిసాగు ఇక రైతుల అభీష్టం మేరకేనని స్పష్టంచేసింది.  

యాసంగే కాదు.. వానకాలం పంటపైనా.. 
యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకోబోమని చెప్పిన కేంద్రం వానాకాలం సీజన్‌లో పండించిన బియ్యంపైనా లక్ష్యాన్ని నిర్దేశించింది. వానాకాలంలో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సేకరణకు మాత్రమే ఒప్పుకోవడంతో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు, టీఆర్‌ఎస్‌ నేతలు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు.

మంత్రుల బృందం వారంపాటు ఢిల్లీలో ఉండి కేంద్రంపై ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు మరో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సేకరిస్తామని కేంద్రం లేఖ రాసింది. పచ్చి బియ్యం ఎంతైనా కొంటామని చెప్పిన కేంద్రం తీరా ఇప్పుడు 46 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొంటామని చెప్పడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది.   

మరిన్ని వార్తలు