Rahul Gandhi: రాహుల్‌ రాకపై కాక! 

2 May, 2022 04:34 IST|Sakshi

ఉస్మానియా వర్సిటీలో రాహుల్‌ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై టెన్షన్‌ 

అనుమతి ఇవ్వాల్సిందేనంటూ  కాంగ్రెస్‌ ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన వ్యవహారం మరింత ముదురుతోంది. రాజకీయాలకు అతీతంగా రాహుల్‌ ఓయూకి వస్తారంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్‌ ఓయూ వీసీని కలిసి అనుమతి కోరినా.. రాజకీయ సభలకు అనుమతి లేదంటూ తిరస్కరించడంతో కాంగ్రెస్‌ అనుబంధ విభాగాలు ఆందోళనకు దిగాయి. ఓయూ విద్యార్థి నేతలు ఆదివారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడికి యత్నించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ) చాంబర్‌ ముందు చీరలు, గాజులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. ఈ విద్యార్థి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం, వారిని పరామర్శించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వర్సిటీ, పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓయూలో రాహుల్‌ పర్యటనకు అనుమతించాల్సిందిగా వీసీ ని సోమవారం మరోమారు కలవాలని నిర్ణయించారు. 

రెండు చోట్ల నిరసనలతో.. 
రాహుల్‌ ఓయూ పర్యటనకు అనుమతి నిరాకరించడాన్ని తప్పుబడుతూ ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత కె.మానవతా రాయ్, నాయకులు చెనగాని దయాకర్, లోకేశ్‌యాదవ్, మరికొందరు నేతలు బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌ను ముట్టడించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌ కు తరలించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అక్కడికి చేరుకుని వారిని పరామర్శించారు. మరోవైపు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు వీసీ చాంబర్‌ వద్ద ఆందోళనకు దిగారు. గులాబీ రంగు చీర, జాకెట్, గాజులు, పూలు తీసుకొచ్చి వీసీ రవిందర్‌కు అందజేస్తామంటూ నిరసన చేపట్టారు. కార్యాలయం తలుపులను í మూసేయడంతో అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు వెంకట్‌తో పాటు ఇతర నేతలను అరెస్టు చేశారు. ఎన్‌ఎస్‌ యూఐ నేతలను పరామర్శించేందుకు జగ్గారెడ్డి బయలుదేరుతుండగా  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నియంత రాజ్యంలో ఉన్నామా? 
ఓయూలో రాహుల్‌ సమావేశానికి అనుమతివ్వకపోవడం,  జగ్గారెడ్డి అరెస్టుపై కాంగ్రెస్‌ వర్గాలు భగ్గుమన్నాయి. వర్సిటీ అధికారులు టీఆర్‌ఎస్‌కు గులాముల్లా పనిచేస్తున్నారని మం డిపడ్డాయి. టీఆర్‌ఎస్‌ నేతలు ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట సభలు పెట్టినా పట్టించుకోని అధికారులు.. ఇతర సంఘాల కార్యక్రమాలకు అనుమతించకపోవడం దారుణమన్నాయి. 

విద్యార్థి నేతలను పరామర్శించేందుకు వెళ్తున్న జగ్గారెడ్డి అరెస్టు చేయడం దారుణమని.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో, నియంత రాజ్యంలో ఉన్నామో అర్థం కావడం లేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ఉస్మానియాకు వస్తానంటే అడ్డుకోవడం ఎందుకని నిలదీశారు. 
   
 జగ్గారెడ్డి, వెంకట్, విద్యార్థి నేతల అరెస్టు సరికాదని టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన సోనియా కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. 
  
   రాహుల్‌ సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమని, రాష్ట్రంలో వాక్‌ స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. 
 
    జగ్గారెడ్డి, విద్యార్థి నేతల అరెస్టును టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మల్లురవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఖండించారు.  
     ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్, మధుయాష్కీ, గీతారెడ్డి తదితరులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జగ్గారెడ్డి, విద్యార్థి నేతలకు సంఘీభావాన్ని ప్రకటించారు. 

 నేడు కేసీఆర్‌ దిష్టిబొమ్మల దహనం
బల్మూరి వెంకట్, ఇతర నేతల అరెస్టులకు నిరసనగా సోమ వారం రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

నేడు మళ్లీ ఓయూకు కాంగ్రెస్‌ నేతలు 
ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం సోమవారం మరోమారు ఉస్మానియా  వర్సిటీకి వెళ్లి రాహుల్‌ పర్యటనకు అనుమతించాలని కోరనుంది. ఆదివారం బంజారాహిల్స్‌ పీఎస్‌ నుంచి బయటికి వచ్చాక జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా విద్యార్థుల బలిదానాలపైనే టీఆర్‌ఎస్‌ నేతలు సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారని.. కానీ ప్రస్తుత పరిణామాలను చూసి అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. రాహుల్‌ పర్యటనకు అనుమతి కోసం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఓయూ వీసీని కలుస్తామని చెప్పారు. పార్టీ జెండాలు, కండువాలు లేకుండా రాహుల్‌తో పాటు ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఓయూకు వస్తామని చెప్తామని.. వీసీ అనుమతివ్వకపోతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం అడ్డుకోవాలని చూసినా రాహుల్‌ను ఓయూకు తీసుకెళ్లి తీరుతామన్నారు.  

>
మరిన్ని వార్తలు