బ్యాంకులకు 3,316 కోట్ల ఎగవేత

6 Aug, 2021 02:42 IST|Sakshi

వీఎంసీ ఎండీ హిమబిందు అరెస్టు

18వ తేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ పత్రాలు సృష్టించి జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని చెల్లించకుండా మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉప్పలపాటి హిమబిందును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్‌ (ప్రస్తుతం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం అయింది), కార్పొరేషన్‌ బ్యాంక్‌ల కన్సార్షియం నుంచి వీఎంసీ డైరెక్టర్లు భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. కానీ తిరిగి చెల్లించకపోవడంతో.. ఇప్పుడు బకాయిల మొత్తం ఏకంగా రూ. 3,316 కోట్లకు చేరింది. దీనితో కన్సార్షియం బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడానికి వీఎంసీ డైరెక్టర్లు నకిలీ పత్రాలు సృష్టించారని తెలిపాయి.

ఈ నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఆ సమయంలోనే తమకు బీఎస్‌ఎన్‌ఎల్‌ లిమిటెడ్‌ నుంచి రూ.262 కోట్ల మేరకు బకాయిలు రావాల్సి ఉందని, ఆ డబ్బులు వచ్చిన తర్వాత రుణాలు చెల్లిస్తామని డైరెక్టర్లు నమ్మబలికారు. అయితే వీఎంసీకి బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి రావాల్సిన మొత్తం రూ.33 కోట్లు మాత్రమేనని తేలింది. ఈ క్రమంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గత నెల 20వ తేదీన వి.హిమబిందు, వి.సతీష్, వి.మాధవి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పత్రాలు, 40 ఎక్సటర్నల్‌ హార్డ్‌ డిస్క్‌ల్లో నిక్షిప్తమైన డిజిటల్‌ డేటాతో పాటు, ఆరు మొబైల్‌ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా వీఎంసీ సంస్థ కన్సార్షియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను అనుబంధ సంస్థలకు తరలించినట్లు ఆడిట్‌ నివేదికల్లో బయటపడిందని ఈడీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి టెండర్లు దక్కించుకోవడంలో పీఐఎస్‌ఎల్‌ అనే సంస్థకు ఎలాంటి పాత్ర లేకపోయినా మూడు శాతం కమీషన్‌ను వీఎంసీఎల్‌ చెల్లించినట్లు తేలిందని వివరించింది.

పీవోఎంఎల్‌ కోర్టులో హాజరు 
హిమబిందు రూ.692 కోట్ల మేరకు డమ్మీ లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ లు (ఎల్‌వోసీ) సృష్టించినట్లు ఈడీ పేర్కొంది. విదేశాల్లో త మ బంధువులు నడిపిస్తున్న సంస్థలకు పెద్ద మొత్తంలో నిధు లు మళ్లించినట్లు తెలిపింది. దర్యాప్తునకు సహకరించ లేదని, విదేశీ లావాదేవీల గురించి అవాస్తవాలు చెబుతున్న నేపథ్యం లో ఆమెను అరెస్టు చేసి ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ కోర్టు లో హాజరుపర్చినట్లు ఈడీ తెలిపింది. కోర్టు ఈనెల 18వ తేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించినట్లు వివరించింది.    

మరిన్ని వార్తలు