స్లమ్స్‌లో రూ.5కే క్రమబద్దీకరణ

23 Sep, 2020 03:51 IST|Sakshi

ఖాళీ స్థలం లేకుంటే చెల్లించాల్సిన 14% ప్లాటు ధర మినహాయింపు

రిజిస్ట్రేషన్‌ దస్తావేజులో స్లమ్‌ పేరు ఉంటే వర్తింపు 

ప్రత్యేక క్లారిఫికేషన్‌ ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: మురికివాడల్లోని అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు కేవలం రూ.5 రుసుం చెల్లిస్తే సరిపోనుంది. లేఅవుట్‌లో 10 శాతం ఖాళీ స్థలం లేకుంటే రిజిస్ట్రేషన్‌ తేదీ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగా 14 శాతం ప్లాట్‌ ధరను చార్జీలుగా చెల్లించాలి. అయితే మురికి వాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చార్జీల నుంచి మినహాయింపు కల్పించనుంది. గత నెల 31న జారీ చేసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ జీవో 131లో ఈ మేరకు మరింత స్పష్టతనిస్తూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మురికివాడల్లోని పేద, మధ్యతరగతి ప్రజ లకు ఈ నిర్ణయం వరంగా మారనుంది. లేనిపక్షంలో ప్లాటు విస్తీర్ణం, రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగా రూ.వేల నుంచి రూ.లక్షల వరకు రుసుం చెల్లించాల్సి వచ్చేది. జీవోలో ప్రస్తావన లేక ఆందోళన: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీ్ధకరణను ప్రభుత్వం తప్పనిసరిచేసింది.

లేనిపక్షంలో సదరు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరపమని, భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయమని లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్‌–2020లో స్పష్టం చేసింది. మురికివాడల్లోని ప్లాట్ల విషయంలో ప్లాటు విస్తీర్ణం, మార్కెట్‌ విలువతో సంబంధం లేకుండా నామమాత్రంగా రూ.5ను ‘క్రమబద్ధీకణ రుసుం’గా చెల్లిస్తే సరిపోతుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అయితే, లేఅవుట్‌లో 10 శాతం ఖాళీ స్థలం లేనందుకు చెల్లించాల్సిన 14 శాతం ప్లాట్‌ ధర చార్జీలు మురికివాడల్లోని ప్లాట్లకు వర్తిస్తాయా? లేదా ? అన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పష్టత ఇవ్వలేదు. దీంతో మురికివాడల్లో స్థలాలు కలిగి ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు 14శాతం ప్లాటు ధరను చార్జీలుగా చెల్లించాల్సి వస్తుందని ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ‘సాక్షి’పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ను సంప్రదించగా, మురికివాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణ విషయంలో 14 శాతం ప్లాటు ధర చార్జీలు వర్తించవని, దీనిపై త్వరలో క్లారిఫికేషన్‌ విడుదల చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు.

దస్తావేజులో స్లమ్‌ పేరు ఉండాలి
జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,179 నోటిఫైడ్‌ స్లమ్స్, 297 నాన్‌ నోటిఫైడ్‌ స్లమ్స్‌ కలిపి మొత్తం 1,476 మురికివాడలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో మరో 700కి పైగా మురికివాడలు ఉన్నాయి. వీటికి సంబందించిన జాబితా స్థానిక పురపాలికతో పాటు మెప్మా అధికారుల వద్ద లభిస్తుంది. ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ దస్తావేజులో మురికివాడ పేరు ఉంటే ఈ మేరకు 14శాతం ప్లాటు ధరను ఫీజుగా చెల్లించకుండా మినహాయింపు పొందడానికి వీలుకలగనుంది. ప్లాటు మురికివాడలో ఉన్నా కొన్నిసార్లు దస్తావేజుల్లో సదరు మురికివాడ పేరుకు బదులు వేరే పేర్లు ఉండే అవకాశముంది. ఇలాంటి సందర్భాల్లో సదరు ప్లాట్లకు సంబంధించిన గత 20, 30 ఏళ్ల కాలానికి సంబంధించిన పహాణీలను స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం నుంచి తీస్తే అందులో మురికివాడ పేరు ఉండే అవకాశలుంటాయి. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్‌ దస్తావేజులో ఆ మేరకు కాలనీ పేరు సవరణ చేయించుకుంటే ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుల చెల్లింపు నుంచి రాయితీ పొందడానికి అవకాశం ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. 

   

మరిన్ని వార్తలు