కొత్తగా మరో జాతీయ రహదారి.. హైదరాబాద్‌–తిరుపతి.. మరింత దగ్గర

28 Jan, 2022 02:25 IST|Sakshi
కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు నిర్మించనున్న కొల్లాపూర్‌ జాతీయ రహదారి మ్యాప్‌. (ఆకుపచ్చరంగులో ఉన్నది) 

కొత్త జాతీయ రహదారితో 70 కి.మీ. తగ్గనున్న దూరం.. 

కల్వకుర్తి–నంద్యాల మధ్య 173 కి.మీ. మేర రహదారి నిర్మాణం  

సోమశిల వద్ద కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి 

డీపీఆర్‌కు ఆమోదముద్ర వేసిన కేంద్ర ప్రభుత్వం 

మరోవైపు మహబూబ్‌నగర్‌ నుంచి చించోలి వరకు ఎన్‌హెచ్‌–167ఎన్‌కు వీడిన గ్రహణం 

అలైన్‌మెంట్‌ ఖరారు.. రూ.703 కోట్లు మంజూరు 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా మరో జాతీయ రహదారి ఏర్పాటుకానుంది. దీనివల్ల హైదరాబాద్, తిరుపతి మధ్యదూరం దాదాపు 70 కిలోమీటర్ల మేర తగ్గనుంది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్‌ రోడ్డు వరకు ఆరులేన్ల జాతీయ రహదారి (కొల్లాపూర్‌ ఎన్‌హెచ్‌ –167కే) నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది.

ఈ రహదారిలో భాగంగా కృష్ణా నదిపై సోమశిలవద్ద వంతెనను కూడా నిర్మించనున్నారు. ఈ మేరకు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఆమోదిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అలాగే మహబూబ్‌నగర్‌ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు ఎన్‌హెచ్‌–167ఎన్‌ విస్తరణకు కూడా గ్రహణం వీడింది. దీని అలైన్‌మైంట్‌ ఖరారు కావడంతో పాటు నిర్మాణానికి రూ.703.68 కోట్లు మంజూరయ్యాయి. ఈ రహదారుల నిర్మాణంతో వివిధ ప్రాంతాలకు దూరం తగ్గనుండడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 

కొల్లాపూర్‌ ఎన్‌హెచ్‌కు టెండర్లే తరువాయి.. 
కొల్లాపూర్‌ జాతీయ రహదారి–167కే నిర్మాణానికి కేంద్రం గతేడాది గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 173.73 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్న ఈ రహదారి పనులకు రూ.600 కోట్లు, మార్గ మధ్యలో కొల్లాపూర్‌ వద్ద సోమశిల సమీపంలోని కృష్ణానదిపై 2 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి మరో రూ.600 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ రహదారి డీపీఆర్‌కు కేంద్రం ఆమోదముద్ర వేయడంతో నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి.

ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడమే తరువాయని తెలుస్తోంది. తెలంగాణలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, రాంపూర్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని మందుగుల, శివాపురం, కరివెన మీదుగా నంద్యాల వరకు నిర్మించనున్న ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్, తిరుపతి మధ్య దాదాపు 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఈ మార్గంలో పది ప్రాంతాల్లో బైపాస్‌ రోడ్లు, జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారవర్గాలు తెలిపాయి.   

కల్వకుర్తి కొట్రా జంక్షన్‌ టు నంద్యాల బైపాస్‌ 
తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలోని కొట్రా జంక్షన్‌ నుంచి కొల్లాపూర్‌ ఎన్‌హెచ్‌–167కే ప్రారంభమవుతుండగా.. కల్వకుర్తి, తాడూరు, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లలో బైపాస్‌ రోడ్లు నిర్మించనున్నారు. సోమశిల సమీపంలో కృష్ణా నదిపై రీ–అలైన్‌మెంట్‌ బ్రిడ్జి, ఆ తర్వాత ఏపీలోని కర్నూలు జిల్లాలో ఎర్రమఠం, ముసిలిమాడ్, ఆత్మకూరు, వెలుగోడు, సంతజుటూరు, కరివెనపై నంద్యాల బైపాస్‌ రోడ్డు వరకు రహదారి నిర్మిస్తారు.

చివరగా అక్కడ జాతీయ రహదారి–40 జంక్షన్‌కు అనుసంధానించనున్నట్లు డీపీఆర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం నంద్యాలనుంచి హైదరాబాద్‌ రావాలంటే కర్నూలు, వనపర్తి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గం పూర్తయితే నంద్యాలనుంచి నేరుగా నాగర్‌కర్నూలు మీదుగా హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.  

అలైన్‌మెంట్‌ ఖరారు ఇలా.. 
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూత్పూర్‌ ఫ్లైఓవర్, పాలకొండ, పాలమూరు యూనివర్సిటీ మీదుగా ఎన్‌హెచ్‌–167ఎన్‌ అలైన్‌మెంట్‌ ఖరారైంది. ఆ తర్వాత వీరన్నపేట, డంప్‌ యార్డు మీదుగా చిన్న దర్పల్లి, హన్వాడ.. నారాయణపేట జిల్లాలోని కోస్గి, వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్, తాండూరు మీదుగా కర్ణాటకలోని చించోలి వరకు విస్తరణ పనులు చేపట్టనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం చుట్టూ 8 కి.మీ.లు, కొడంగల్‌లో 5 కి.మీ.లు, తాండూర్‌లో 6 కి.మీ.ల మేర బైపాస్‌ రోడ్లు నిర్మించనున్నారు. ఎన్‌హెచ్‌–167ఎన్‌ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ నుంచి ముంబైకి వెళ్లే వారికి దూరం తగ్గనుంది

ఎన్‌హెచ్‌–167ఎన్‌.. రూ.703 కోట్లు మంజూరు 
మహబూబ్‌నగర్‌–చించోలి అంతర్రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్పు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గతేడాది ప్రకటించారు. ఈ మేరకు సర్వే పూర్తి కాగా.. అలైన్‌మెంట్‌పై కూడా స్పష్టత వచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎన్‌హెచ్‌–44పై ఉన్న భూత్పూర్‌ ఫ్లైఓవర్‌ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు జాతీయ రహదారి–167ఎన్‌ను విస్తరించేందుకు డీపీఆర్‌ సిద్ధమైంది. దీంతో ఇటీవల రూ.703.68 కోట్లు మంజూరు చేస్తున్నట్లు గడ్కరీ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

ఈ రహదారి మొత్తం 190 కిలోమీటర్ల నిడివి ఉండగా.. మహబూబ్‌నగర్‌ నుంచి వికారాబాద్‌లోని కర్ణాటక సరిహద్దు వరకు 126కి.మీ.లు, కర్ణాటక రాష్ట్రం పరిధిలో 64కి.మీ.లు విస్తరించనున్నారు. పట్టణాలు, గ్రామాలు కలిసే చోట 120 అడుగులు, మిగతా చోట్ల 100 అడుగుల మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. 

మరిన్ని వార్తలు