ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా.. గురుకులాలకు షాక్‌! 

20 Jul, 2021 17:03 IST|Sakshi

 ప్రవీణ్‌కుమార్‌ రాజీనామాతో నాలుగు కీలక పదవులు ఖాళీ

సవాల్‌గా మారిన హెచ్‌వోడీల నియామకం 

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు బ్రాండ్‌గా నిలిచిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో గురుకుల సొసైటీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) కార్యదర్శిగా 2012లో బాధ్యతలు చేపట్టారు.

తక్కువ సమయంలోనే గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి వాటి ఖ్యాతిని పెంచారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గురుకులాల కీర్తిని నిలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సీ,  ఎస్టీ గురుకుల సొసైటీల్లో పెద్ద ఎత్తున కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. సాధారణంగా మూడేళ్ల పాటు ఒక పదవిలో పనిచేసిన వ్యక్తికి బదిలీ అనివార్యం. కానీ ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను అక్కడి నుంచి కదిలించలేదు. 

కీలక బాధ్యతల్లో కొనసాగుతూ.. 
రెండు సొసైటీల కార్యదర్శితో పాటు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ సొసైటీ (ఈఎంఆర్‌ఎస్‌ఎస్‌) కార్యదర్శిగా, ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. కేజీ టు పీజీ మిషన్‌ కింద గురుకుల విద్యా సంస్థలను పెద్ద సంఖ్యలో పెంచింది. ఈ క్రమంలో గురుకుల సొసైటీల్లో వేలాది ఉద్యోగాల భర్తీ చేయాల్సి రావడంతో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)ని ఏర్పాటు చేసి, ఈ బోర్డు చైర్మన్‌గా ప్రవీణ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. దాదాపు ఈ బోర్డుకు నాలుగేళ్ల నుంచి చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం ప్రవీణ్‌కుమార్‌ రాజీనామాతో ఈ నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఒకవేళ ఆయన రాజీనామాను ఆమోదిస్తే ఇప్పటికిప్పుడు కిందిస్థాయి అధికారులకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించినా.. వందల సంఖ్యల్లో విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ఈ సొసైటీలకు హెచ్‌వోడీల నియామకం సులువైన విషయం కాదు. గరుకుల సంస్థల్లో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లోని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు సులువుగా పొందుతున్నారు. వీటిని ఇదే స్థాయిలో నిర్వహించాలంటే ప్రవీణ్‌కుమార్‌లా చురుగ్గా ఉండే అధికారి కావాలని విద్యార్థులు సైతం ఆకాంక్షిస్తున్నారు.   

మరిన్ని వార్తలు