దంచికొడుతున్న వానలు.. మానేరు వాగులో కొట్టుకుపోయిన సిద్దిపేట ఆర్టీసీ బస్సు

31 Aug, 2021 11:02 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల: ఆదివారం రాత్రి నుంచి జిల్లాలో ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే పంటలు నీట మునిగాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పలుచోట్ల ఒర్రెలు తెగడం, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వంతెనపై ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. సోమవారం సాయంత్రం కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద తాకిడికి వాగులో చిక్కుకుపోయింది. ఒక టైర్‌ కిందికి దిగి ఆగిపోయింది. బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉండగా.. గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్‌ సీటు పక్కన ఉండే కిటికీలోంచి ప్రయాణికులను రక్షించారు.

కాగా ఎగువ మానేరు జలాశయానికి భారీగా వరద చేరడంతో నీరు మత్తడి దుంకుతుంది. దీంతో వాగుల్లో వరద పెరిగింది. అయితే వరదను తక్కువగా అంచనా వేసి బస్సును ముందుకు పోనివ్వడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ సహాయక చర్యలు కొనసాగాయి. జేసీబీ సాయంతో బస్సును బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు, గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వరద మరింత పెరగడంతో మంగళవారం బస్సు పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది.

మరిన్ని వార్తలు