ఆర్టీసీ మూసివేత ప్రసక్తే లేదు 

27 Sep, 2021 02:03 IST|Sakshi

ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి  

సాక్షి, నిజామాబాద్‌: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) మూసి వేత ప్రసక్తేలేదని, అలాగే ప్రైవేటుపరం కూడా చేసేది లేదని ఆ సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తేల్చి చెప్పారు. సంస్థకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. దుబారా ఖర్చులు తగ్గించి లాభాల బాట పట్టించేందుకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు మానుకోవాలని, నష్టాలు తగ్గించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

కోవిడ్‌కు ముందు ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ.14 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.3 కోట్లు మాత్రమే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు పెంచడంతో మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని విచారం వ్యక్తం చేశారు. కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో సంస్థ ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్‌ ప్రతినెల జీతాలిచ్చేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్గో సేవలతో లాభాలు పెరుగుతాయని, ఇందుకు మరో వెయ్యి బస్సులు ఏర్పాటు చేస్తామని, ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్‌ బంకులు, షాపింగ్‌ కాంప్లెక్సులు నిర్మిస్తామని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు