తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు

22 Jan, 2021 09:24 IST|Sakshi

ఏడాది తర్వాత మరోసారి పెరగనున్న బస్సు చార్జీలు 

ముఖ్యమంత్రితో ఆర్టీసీ అధికారుల భేటీలో ప్రస్తావన 

డీజిల్‌ ధరలు భగ్గుమంటుండంతో తప్పదని చర్చ 

త్వరలో సీఎంకు సవివర ప్రతిపాదన.. ఆపై తుది నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు మరోసారి మోత మోగనున్నాయి. 2019 డిసెంబరులో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచిన ఆర్టీసీ.. ఏడాది తర్వాత మళ్లీ పెంపునకు సిద్ధమైంది. ఈసారి కి.మీ.కు 10 పైసల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ధరలపై ముఖ్యమంత్రికి నివేదించి చర్చించాకే అమలులోకి తేనున్నట్లు సమాచారం. ఈ మేరకు గురువారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో ఆర్టీసీ చార్జీల పెంపు అంశం చర్చకు వచ్చింది. డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగడం, లాక్‌డౌన్‌ కారణంగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో చార్జీల పెంపు తప్పదనే కోణంలో చర్చించారు. మరోవైపు ఆర్టీసీ సిబ్బందికీ జీతాలు పెంచనున్నట్లు ఇప్పటికే సీఎం ప్రకటించారు.

ప్రస్తుతం ఆర్టీసీ వ్యయంలో 52 శాతం జీతభత్యాల పద్దే ఆక్రమించింది. జీతాల భారం 50 శాతం దాటితే ఏ సంస్థ మనుగడ అయినా కష్టమనేది ఆర్థిక నిపుణుల మాట. అలాంటిది ఇప్పటికే సగానికి మించడం, మళ్లీ పెరగనుండడంతో తదనుగుణంగా ఆర్టీసీ ఆదాయాన్నీ పెంచుకోక తప్పదు. ప్రత్యామ్నాయ ఆదాయం ఇప్పటికిప్పుడు అసాధ్యం. కాబట్టి చార్జీల పెంపు తప్ప మరో మార్గం కనిపించటం లేదని తేల్చారు. లేదంటే బడ్జెట్‌ రూపంలో ఆర్టీసీకి ప్రభుత్వం కనీసం మరో రూ.వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఆర్టీసీ సిబ్బంది జీతాలకు ప్రస్తుతం ప్రభుత్వమే నిధులు ఇస్తున్నందున, ఇంకా పెంపు కష్టమని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక మిగిలింది చార్జీల పెంపు మాత్రమే కావటంతో ఆ కోణంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.  

ప్రజల్లో వ్యతిరేకత? 
ఏడాది కింద చార్జీల పెంపుతో జనంపై రూ.750 కోట్ల వార్షిక భారంపడింది. ఆర్డినరీలో కనీస చార్జి రూ.10, ఎక్స్‌ప్రెస్‌లో రూ.15 చేయడంతో సామాన్యులకు బస్సు ప్రయాణం భారమైందనే అభిప్రాయం ఉంది. చార్జీలు పెంచాక కేవలం మూడు నెలలు మాత్రమే పూర్తిస్థాయిలో బస్సులు నడిచాయి. మార్చి నుంచి లాక్‌డౌన్‌ మొదలవడంతో డిపోలకే పరిమితమయ్యాయి. మళ్లీ మే నుంచి దశల వారీ ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తిస్థాయిలో తిరగడం లేదు. మరో వైపు కోవిడ్‌ వల్ల ప్రజల ఆర్థిక పరి స్థితీ దిగజారింది. ఈ సమయంలో చార్జీలు పెంచితే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. 

సిటీ సర్వీసులు 75 శాతానికి.. 
కోవిడ్‌ నేపథ్యంలో ఇప్పటికీ హైదరాబాద్‌లో సిటీ బస్సులు పూర్తిస్థాయిలో తిరగటం లేదు. తొలుత 25 శాతం, అనంతరం 50 శాతానికి అనుమతించారు. ఫిబ్రవరి 1నుంచి జిల్లా సర్వీసులు పూర్తిస్థాయిలో తిరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలో సర్వీసులను 75 శాతానికి పెంచుకునేందుకు గురువారం సమావేశంలో సీఎం అనుమతించారు.    

మరిన్ని వార్తలు