ఆర్టీసీలో ‘వయోపరిమితి’ లొల్లి

12 Jul, 2021 01:17 IST|Sakshi

విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వానికి ప్రతిపాదన 

కఠినమైన విధులను అప్పటిదాకా నిర్వహించడం కష్టమంటున్న కార్మికులు 

స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశమివ్వాలని డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో ఉద్యోగ విరమణ వయస్సు పెంపు అంశంపై అధికారులు, కార్మికుల మధ్య వివాదం నెలకొంది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్లకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాన్ని ఆర్టీసీలో కూడా వర్తింపచేయాలంటూ తాజాగా ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు సమాచారం. దీన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వయోపరిమితిని పెంచేట్టయితే, 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆర్టీసీలో కొనసాగాలా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ పొందాలా అన్నవాటిల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 2019 చివరిలో సుదీర్ఘకాలం ఆర్టీసీలో సమ్మె నడిచిన తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల వయోపరిమితిని పెంచింది. ఆ నిర్ణయంతో గత రెండేళ్లుగా నిలిచిన పదవీ విరమణలు వచ్చే డిసెంబర్‌లో మొదలు కానున్నాయి.  

కార్మికుల వ్యతిరేకతకు కారణమిదే.. 
ఆర్టీసీ బస్సులు నడపటం, గంటలతరబడి నిలబడి టికెట్లు జారీ చేయటం, గ్యారేజీలో మరమ్మతు వంటి కఠినమైన విధులు వయస్సు మీరుతున్న కార్మికులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. రిటైర్మెంటుకు చేరువయ్యేవారు ఈ పనులు చేయలేక సతమతమవుతూ ఉంటారు. దీంతో తమకు స్వచ్ఛంద పదవీవిరమణ అవకాశం కల్పించాలని చాలాకాలంగా వారు కోరుతున్నారు.  

వాలంటరీ రిటైర్మెంట్‌కు అవకాశం ఇవ్వండి 
‘‘ఇప్పటికే రెండేళ్ల కాలం పొడగింపుతో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బందిలో చాలామంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కష్టతరంగా ఉన్న విధులను 61 ఏళ్ల వయసులో చేయలేరు. వయోపరిమితి పెంపునకు ముందుగా కార్మికులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఎంచుకునే అవకాశం కల్పించాలి’’. 
– తిరుపతి, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు