మాస్క్‌ లేకుండానే రైట్‌ రైట్‌ 

3 Aug, 2020 03:45 IST|Sakshi

ఆర్టీసీలో కొందరు డ్రైవర్లు, కండక్టర్ల తీరు 

సిబ్బందిలో అవగాహన పెంచని సంస్థ 

పెరుగుతున్న కరోనా మరణాలతో కలవరం

పని లేకున్నా విధులకు పిలుస్తున్న యంత్రాంగం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీని కరోనా వణికిస్తోంది. శనివారం ఒక్కరోజే ముగ్గురు ఉద్యోగులు మరణించగా ఇప్పటివరకు ఆ సంఖ్య 30కి చేరింది (అనధికారిక సమాచారం). మరో 250 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌ సిటీ మినహా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సర్వీసులు తిరుగుతుండటంతో అన్ని డిపోల్లో సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. నగరంలోని అన్ని డిపోలకు నిత్యం 30 శాతం మంది సిబ్బంది హాజరవుతున్నారు. తాజా పరిణామాలతో సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది.  

ఏదీ అవగాహన? 
బెంగళూరు హైవేపై నగర శివారులో కంట్రోలర్‌గా పనిచేసే ఉద్యోగి ఇటీవల వైరస్‌ బారినపడి చనిపోయారు. ఆయన మాస్కు సరిగా ధరించేవాడు కాదన్నది ఆ తర్వాతగాని అధికారులు గుర్తించలేకపోయారు. మాస్కు ధరించి నిత్యం వాట్సాప్‌లో ఫొటో పంపాలని సంబంధిత డిపో మేనేజర్‌ ఆదేశాలుండటంతో కేవలం ఫొటో కోసమే ధరించేవాడు, ఆ తర్వాత తొలగించేవాడని గుర్తించారు. ఆయనకు ఆస్తమా సమస్య ఉండటంతో మాస్కు ధరిస్తే సరిగా ఊపిరాడదన్న ఉద్దేశంతో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఫలితం.. వైరస్‌ సోకి శ్వాసతీసుకోవటంలో తీవ్ర ఇబ్బంది తలెత్తి చనిపోయాడు. ఇంత జరుగుతున్నా.. కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆర్టీసీ ఇప్పటి వరకు సిబ్బందిలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టలేదు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన కొత్తలో కొన్ని కరపత్రాలను పంచటం మినహా తర్వాత చర్యలు శూన్యం. దీంతో చాలామంది డ్రైవర్లు, ప్రయాణికులతో నేరుగా ప్రమేయం ఉండే కండక్టర్లలో కొందరు మాస్కులు కూడా సరిగా ధరించట్లేదు. 

నిర్లక్ష్యమే రిస్క్‌లో పడేస్తోంది 
వరంగల్‌కు చెందిన ఓ డ్రైవర్‌ తాను కూర్చునే ప్రదేశం చుట్టూ ప్లాస్టిక్‌ కాగితాన్ని అతికించి క్యాబిన్‌లాగా మార్చుకున్నాడు. ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్న వారు కనిపిస్తున్నా.. చాలామంది ఊపిరాడట్లేదనో, చుట్టూ ఉన్నది తోటి ఉద్యోగులే కదా అన్న భావనతోనో, అవగాహన లేకో మాస్కులు సరిగా ధరించట్లేదు. ప్రస్తుతం నగరంలో ఆర్టీసీ సిటీ బస్సులు నడవట్లేదు. కానీ ఇటీవల ముషీరాబాద్‌ సహా పలు డిపోల్లో పనిచేసే సిబ్బంది కరోనా వైరస్‌ బారినపడ్డారు.

ప్రస్తుతం చనిపోయిన వారిలో సగం మంది నగరానికి చెందినవారే. డిపోలకు వచ్చాక వీరు మాస్కులను మెడ వరకు లాగేసి తోటి సిబ్బందే కదాని కలివిడిగా గడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం కూకట్‌పల్లి డిపో ఉద్యోగి ఒకరు తల్లి ఆరోగ్యరీత్యా ఆసుపత్రుల చుట్టూ తిరిగి వైరస్‌ బారినపడ్డాడు. లక్షణాలు కనిపించినా వైద్యం తీసుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. ఇంతలో ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రికి వెళ్లేలోపే చనిపోయాడు. మాస్కులు సరిగా ధరించటం, శానిటైజర్‌ వినియోగం, లక్షణాలు కనిపిస్తే అనుసరించాల్సిన తీరుపై ఆర్టీసీ అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదు. కొందరు డిపో మేనేజర్లు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి నిత్యం సూచనలు మాత్రం అందిస్తున్నారు. 

బస్సులు నడవనప్పుడు సిబ్బంది ఎందుకు? 
ప్రస్తుతం సిటీలో బస్సులు తిరగట్లేదు. పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, విమాన ప్రయాణికుల తరలింపు కోసమే బస్సులు నడుస్తున్నాయి. మిగతావన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. కానీ అన్ని డిపోల్లో 15 శాతం మందికంటే ఎక్కువే విధులకు హాజరవుతున్నారు. డిపోల్లో బస్సులు నిండిపోయి ఉండటంతో వీరు కూర్చునే స్థలం కూడా ఉండట్లేదు. ఫలితంగా భౌతికదూరం కరువవుతోంది. ఇదే ప్రమాదకరంగా మారుతోంది. కాగా, వందల మంది సిబ్బంది వైరస్‌ బారినపడుతున్న నేపథ్యంలో ఏదైనా ఆర్టీసీ భవనంలో ప్రత్యేక కోవిడ్‌ వార్డు ఏర్పాటు చేయాలని, సిబ్బందికి ఫేస్‌షీల్డ్‌లు, మెరుగైన మాస్కులు అందించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి హన్మంతు కోరారు. మృతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరహాలో పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు