భారం పడనీయం.. చార్జీలు పెంచం

4 Jan, 2024 04:28 IST|Sakshi

ప్రతినెలా మహాలక్ష్మికి నిధులు

ఆదాయమార్గాలు అన్వేషించాలని ఆర్టీసీ అధికారులకు సూచన

రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆర్టీసీ అధికారులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి నిధుల కొరత రానీయబోమని.. ఎప్పటి కప్పుడు ఆర్టీసీకి నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ప్రయాణికులపై ఎలాంటి చార్జీల భారం మోపబోమని...సంస్థ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వారిద్దరూ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలపై దృష్టి పెట్టాలని, నిర్వహణ సామర్థ్యం పెంచుకోవాలని అధికారులకు సూచించారు.

టీఎస్‌ ఆర్టీసీ ఆర్థిక అంశాలు, మహాలక్ష్మి పథకం అమలుతీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం, తదితర విషయాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో సంస్థ ఉన్నతాధికారులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ పథకం కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని, ఈ పథకం ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్‌మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి..త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మహాలక్ష్మి పథకం కింద ప్రతీరోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లు మంజూరు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించగా.. రోజు వారీ నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజల సంస్థ.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలపై సంస్థ ఆలోచిస్తోందని, టికెట్‌ ఆదాయంపైనే కాకుండా..లాజిస్టిక్స్, వాణిజ్య, తదితర టికెటేతర ఆదాయంపై దృష్టి పెట్టిందని చెప్పారు.

ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, రవాణా, రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, టీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మునిశేఖర్, కృష్ణకాంత్, ఆర్థిక సలహాదారు విజయపుష్ప, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు