ఆర్టీసీ నిధులన్నీ హాంఫట్‌! 

19 Aug, 2020 05:13 IST|Sakshi

విశ్రాంత ఉద్యోగుల డిపాజిట్లు స్వాహా 

అవసరాలపేరిట వాడేసుకున్న సంస్థ 

వాటిపై వచ్చే వడ్డీతో గడుపుతున్న కుటుంబాలు 

ఈనెల వడ్డీ చెల్లించక చేతులెత్తేసిన ఆర్టీసీ 

కరోనా కష్టకాలంలో అల్లాడుతున్న వృద్ధుల కుటుంబాలు 

ఆయన ఆర్టీసీలో కండక్టర్‌. పదేళ్ల క్రితం రిటైర్‌ అయ్యారు. ఐదేళ్ల క్రితం చనిపోయారు. పదవీ విరమణ సమయంలో వచ్చిన మొత్తాన్ని ఆర్టీసీకి అనుబంధంగా ఉండే సహకార పరపతి సంఘం (సీసీఎస్‌)లో డిపాజిట్‌ చేశారు. దానిపై రూ.10వేల వడ్డీ ప్రతినెలా ఆయన భార్యకు అందుతోంది. ఆమెకు అదే జీవనాధారం. ఇప్పుడు ఉన్నట్టుండి నిధులు లేవని వడ్డీ ఇవ్వటం మానేశారు. మరి ఆమెకు పూట గడిచేదెలా? 

డ్రైవర్‌గా పనిచేసి రిటైర్‌ అయిన ఓ వ్యక్తి కుటుంబంలో ఇద్దరికి కోవిడ్‌ సోకింది. చికిత్సకు భారీగా ఖర్చయింది. తాను సీసీఎస్‌లో దాచుకున్న డబ్బులోంచి అంత మొత్తం ఇవ్వాలని వేడుకున్నా.. నిధులు లేకపోవటంతో చిల్లిగవ్వ కూడా అందలేదు.  

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఇద్దరి పరిస్థితే కాదు.. ఆర్టీసీలో పదవీ విరమణ చేసి, అప్పుడు వచ్చిన డబ్బును సీసీఎస్‌లో దాచుకున్న 15 వేల మంది దీనగాథ. ఉద్యోగుల నెల జీతాల్లోంచి కొంత మొత్తం మినహాయిస్తూ కూడిన మొత్తంతో సీసీఎస్‌ నడుస్తుంది. ఆ నిధుల్లోంచి ఉద్యోగులు కుటుంబ అవసరాలకు రుణాలు తీసుకుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంతింటి నిర్మాణం, ఆస్పత్రుల ఖర్చులు.. ఇలా అన్నింటికి అదే దిక్కు. ఇక రిటైర్‌ అయిన సమయంలో వచ్చిన మొత్తాన్ని చాలా మంది ఇందులోనే డిపాజిట్‌ చేసుకుంటారు. ఇక్కడ కాస్త ఎక్కువ వడ్డీ ఇస్తారు. ఆ వడ్డీని పింఛన్‌ తరహాలో నెలనెలా పొందుతారు. ఇప్పటి వరకు వడ్డీ చెల్లింపులో జాప్యం లేకుండా సీసీఎస్‌ చెల్లిస్తూ వచ్చింది. కానీ, ఈ నెల వడ్డీ చెల్లించలేక చేతులెత్తేశారు. దీంతో ఈ వడ్డీనే ఆధారంగా చేసుకుని బతుకీడుస్తున్నవారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వడ్డీ సంగతి దేవుడెరుగు, అసలు అందుతుందా అన్న భయం మొదలైంది. 

ఎందుకీ పరిస్థితి?.. 
ఉద్యోగి జీతంలో 7 శాతం మొత్తాన్ని ఆర్టీసీ.. సీసీఎస్‌కు చెల్లిస్తుంది. ఆ మొత్తాన్ని రుణాల రూపంలో ఉద్యోగులకు ఇచ్చి.. వచ్చే వడ్డీతో సీసీఎస్‌ పాలకవర్గం నిధిని పెంపు చేస్తుంది. అలాగే మిగతా మొత్తాన్ని వేరే సంస్థల్లో పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని పొందుతుంది. రుణాలు తీసుకున్న ఉద్యోగుల కిస్తీలను ఆర్టీసీనే ప్రతినెలా వారి జీతం నుంచి మినహాయించి సీసీఎస్‌కు చెల్లిస్తుంది. అలా ప్రతినెలా దాదాపు రూ.40 కోట్లు సీసీఎస్‌కు జమవుతాయి. కానీ గత 19 నెలలుగా ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్‌కు జమ చేయడం మానేసింది. ఇక సీసీఎస్‌ నిధుల నుంచి రూ.740 కోట్లను ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. దానికి సంబంధించి రూ.140 కోట్ల వడ్డీ పేరుకుపోయింది. ఇక సీసీఎస్‌ నుంచి ఉద్యోగులు ఇప్పటికే తీసుకున్న రుణాల మొత్తం రూ.800 కోట్లు. వెరసి సీసీఎస్‌ వద్ద ప్రస్తుతం చిల్లి గవ్వ కూడా లేదు. ఫలితంగా ఆగస్టు నెలకు సంబంధించి రిటైర్డ్‌ ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ ఇవ్వలేకపోయింది. ఇదే విషయాన్ని పాలక వర్గం ఆర్టీసీ యాజమాన్యాన్ని అడిగితే, మా వద్ద డబ్బు లేదని చేతులెత్తేసింది. కరోనా వేళ బయట అప్పు పుట్టడం కష్టంగా ఉన్న సమయంలో సీసీఎస్‌ వడ్డీ రాక విశ్రాంత ఉద్యోగులు అల్లాడుతున్నారు.  

ఇదీ లెక్క.. 
విశ్రాంత ఉద్యోగులు దాచుకున్న మొత్తం డబ్బు: రూ.370 కోట్లు 
దీనిపై నెలకు చెల్లించాల్సిన వడ్డీ: రూ.4.5 కోట్లు 
డబ్బు దాచుకున్న రిటైర్ట్‌ ఉద్యోగుల సంఖ్య: 15,000 

సీసీఎస్‌ వడ్డీ చెల్లింపు ఇలా...
రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ డబ్బులో 50 శాతానికి వడ్డీ: 14%  
మిగతా 50 శాతానికి వడ్డీ: 10%  
అదనంగా డిపాజిట్‌ చేస్తే దానిపై ఇచ్చే వడ్డీ: 8.5%  

ఈనెల సరుకులకు డబ్బుల్లేవ్‌ 
రంగారావు, విశ్రాంత ఉద్యోగి 
నా రిటైర్‌మెంట్‌ డబ్బంతా సీసీఎస్‌లో ఉంచాను. నెలకు రూ.13వేల వడ్డీ వస్తుంది. ఈ నెల వడ్డీ అందలేదు. దీంతో సరుకులు కొనేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాం. వెంటనే నా డిపాజిట్‌ డబ్బు మొత్తం ఇవ్వాలని కోరుతున్నా.  

మా అబ్బాయి వద్ద చేయి చాచాల్సి వచ్చింది 
చంద్రారెడ్డి, విశ్రాంత ఉద్యోగి 
సీసీఎస్‌ వడ్డీ డబ్బులతో ఇంతకాలం ఇల్లు గడిచింది. ఈ నెల వడ్డీ రాలేదు. డబ్బులు చాలక మా అబ్బాయి వద్ద చేయి చాచాల్సి వచ్చింది. 72 ఏళ్ల వయసులో నాకు ఎందుకీ ఇబ్బంది. వెంటనే ప్రభుత్వం ఆ డబ్బు చెల్లించేలా సహకరించాలి. 

మరిన్ని వార్తలు