TSRTC Ticket Prices Hike: ఆర్టీసీ చార్జీల మోత.. డీజిల్‌ సెస్‌ పేరిట మళ్లీ టికెట్‌ ధరల పెంపు

8 Jun, 2022 21:33 IST|Sakshi

పల్లె వెలుగు నుంచి ఏసీ బస్సుల దాకా అన్నింటికీ వర్తింపు 

ప్రయాణించే దూరాన్ని బట్టి రూ.5 నుంచి రూ.170 వరకు పెంపు

సిటీ బస్సులకు మాత్రం మినహాయింపు

ప్రయాణికులపై 2 నెలల్లోనే మరోసారి రాయితీ శాతాన్ని తగ్గించడంతో భగ్గుమన్న బస్‌పాస్‌లు

రెండు, మూడింతల వరకు మోత

ధరలపై నేడు స్పష్టత

జిల్లా పాస్‌లలోనూ స్వల్ప సవరింపు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో మరోసారి బస్సు చార్జీలు భగ్గుమన్నాయి. డీజిల్‌ భారాన్ని, నష్టాలను తగ్గించుకునేందుకు ఆర్టీసీ మళ్లీ ‘డీజిల్‌ సెస్‌’మోత మోగించింది. 2 నెలల క్రితం అమల్లోకి తెచ్చిన సెస్‌ను కొనసాగిసూ్తనే.. కొత్తగా అదనపు సెస్‌తో ప్రయాణికులపై పెద్ద భారాన్నే మోపింది. ప్రస్తుత చార్జీలకు అదనంగా ప్రతి టికెట్‌పై రూ.5 నుంచి రూ.170 వరకు ‘సెస్‌’విధించింది. కొత్త ధరలను గురువారం తెల్లవారుజామున తొలి సర్వీసు నుంచే అమల్లోకి తెచ్చింది. దీనితో ఆర్టీసీకి ఏటా రూ.150 కోట్లకుపైగా అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా.

నేరుగా చార్జీలు పెంచకుండా..
డీజిల్‌ ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో.. బస్సుచార్జీలు పెంచాలన్న ప్రతిపాదన కొద్దినెలలుగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రతి కిలోమీటర్‌కు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 25 పైసలు, ఆపై కేటగిరీ బస్సుల్లో 30 పైసల చొప్పున పెంచాలని ఆర్టీసీ కోరింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో.. తన విచక్షణాధికారం పరిధిలో ఉన్న సెస్‌లకు పదునుపెట్టింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎమినిటీస్‌ సెస్, డీజిల్‌ సెస్‌ల పేరుతో ప్రతి టికెట్‌పై రూ.2 నుంచి రూ.10 వరకు పెంచింది. చిల్లర సమ స్య లేకుండా చార్జీలను రౌండాఫ్‌ చేయడంతో మరింతగా పెంపు నమోదైంది. రెండు నెలల్లోనే మరోసారి ‘అదనపు సెస్‌’ పేరిట భారం వేసింది.

కొత్త పెంపు ఇలా..
ఆర్టీసీ తాజా అదనపు సెస్‌ను దూరాన్ని బట్టి మారేలా శ్లాబులుగా విధించింది. తక్కువ దూరానికి తక్కువగా.. ఎక్కువ దూరానికి ఎక్కువగా భారం పడనుంది.
పల్లె వెలుగు: ఈ కేటగిరీ బస్సులపై 250 కిలోమీటర్ల గరిష్ట దూర ప్రయాణాన్ని పరిగణనలోకి తీసుకుని.. రూ.5 నుంచి రూ.45 వరకు అదనపు సెస్‌ విధించారు. తొలి స్టాపు వరకు రూ.10 కనీస చార్జీ అలాగే ఉంటుంది. రెండో స్టాప్‌ చార్జీ రూ.15ను రూ.20కి పెంచారు. మూడో స్టాప్‌ ధర స్థిరంగా ఉంచగా.. నాలుగో స్టాప్‌ ధరను రూ.25 నుంచి రూ.30కి, ఏడో స్టాప్‌ వరకు చార్జీని రూ.30 నుంచి రూ.35కు.. ఇలా పెంచుతూ పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్టంగా 150 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే పల్లె వెలుగు సర్వీసులు నడుస్తున్నాయి. అంటే వీటిల్లో గరిష్టంగా రూ.30 వరకు మాత్రమే పెరుగుతుంది.

ఎక్స్‌ప్రెస్‌: ఈ బస్సుల్లో 500 కిలోమీటర్ల దూరాన్ని పరిగణనలోకి తీసుకుని కనిష్టంగా రూ.5, గరిష్టంగా రూ.90 మేర సెస్‌ విధించారు. అయితే తొలి 25 కిలోమీటర్ల వరకు అదనపు సెస్‌ విధించలేదు. 26వ కిలోమీటర్‌ నుంచి 40 కిలోమీటర్ల వరకు రూ.5.. 46వ కి.మీ. నుంచి 70 కి.మీ. వరకు రూ.10.. 71 కి.మీ. నుంచి 100 కి.మీ. వరకు రూ.15 ఇలా పెంచుతూ పోయారు. గరిష్టంగా రూ.90 పెరుగుతుంది.

డీలక్స్‌: ఈ బస్సుల్లో కూడా 500 కిలోమీటర్ల వరకు దూరానికి కనీసం రూ.5.. గరిష్టంగా రూ.125 వరకు పెంచారు.

సూపర్‌ లగ్జరీ: 500 కి.మీ. వరకు దూరానికి సంబంధించి రూ.10 నుంచి రూ.130 వరకు పెంచారు. ఈ కేటగిరీలో కూడా తొలి 25 కిలోమీటర్లకు సెస్‌ వేయలేదు.ఆ తర్వాత 20 కి.మీ.కు రూ.5 చొప్పున విధిస్తూ వచ్చారు. సర్వీసుల వారీగా ఇందులో తేడాలుంటాయి. 

ఏసీ సర్వీసులు: 500 కి.మీ. దూరానికి కనీసం రూ.10, గరిష్టంగా రూ.170 వరకు అదనపు సెస్‌ విధించారు.

భగ్గుమన్న బస్‌ పాసులు
నగరాల్లో బస్‌పాస్‌ల ధరలను ఆర్టీసీ భారీగా పెంచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సిటీ బస్సులను అదనపు సెస్‌ నుంచి మినహాయించినా.. బస్‌పాస్‌ల ధరలను అసాధారణంగా మూడింతలకు వరకు పెంచారు. పాస్‌లపై ఇప్పటివరకు నిర్ధారిత శాతంగా చార్జీలు పెంచుతూ వచ్చేవారు. కానీ రెండున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడే పాస్‌లపై రాయితీని తగ్గించటం ద్వారా ధరలను సవరించారు. ఆర్టీసీ ఇంతకాలం జిల్లాల్లో బస్‌పాస్‌లపై ఆర్టీసీ 72 శాతం, నగరాల్లో 89శాతం రాయితీ ఇస్తూ వచ్చింది.

అంటే జిల్లాల్లో ప్రయాణికులు 28 శాతం, గనరాల్లో 11 శాతం చార్జీని మాత్రమే చెల్లించారు. నిజానికి ఈ పాస్‌ల రాయితీ మొత్తాన్ని ప్రభుత్వమే ఆర్టీసీకి రీయింబర్స్‌ చేయాలి. కానీ ఈ సొమ్ము సరిగా అందక ఆర్టీసీ నష్టపోతోందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాసులపై రాయితీని ఆర్టీసీ తగ్గించుకుంది. జిల్లాలో ప్రయాణికుల వాటాను 28శాతం నుంచి 30శాతానికి పెంచింది. నగరాల్లో 11 శాతం నుంచి 25 శాతానికి పెంచింది. దీనితో జిల్లాల్లో పాస్‌ల ధరలు ఓ మోస్తరుగా పెరగ్గా.. నగరాల్లో మాత్రం మూడు రేట్ల వరకు పెరగడం గమనార్హం.

15 శాతం భారం 
అదనపు సెస్‌తో ఆర్టీసీ బస్‌చార్జీలు సగటున 15 శాతం వరకు పెరిగాయి. బుధవారం అర్ధరాత్రి తర్వాత బయలుదేరే బస్సుల్లో చార్జీల వివరాలు వెల్లడయ్యాయి.  
     హైదరాబాద్‌– నిజామాబాద్‌ సూపర్‌ లగ్జరీ చార్జీ రూ. 290 నుంచి రూ.350కి.. రాజధాని బస్సులో రూ.380 నుంచి రూ. 440కి పెరిగాయి. 
     హైదరాబాద్‌– కర్నూల్‌ సూపర్‌ లగ్జరీ చార్జీ రూ.340 నుంచి రూ.390కి పెరిగింది. 
     హైదరాబాద్‌– నంద్యాల సూపర్‌ లగ్జరీ చార్జీ రూ. 450 నుంచి రూ.520కి పెరిగింది. 
     హైదరాబాద్‌– విజయవాడ సూపర్‌ లగ్జరీ చార్జీ రూ. 420 నుంచి రూ.490కి.. రాజధాని చార్జీ రూ.540 నుంచి రూ.630కి పెరిగింది.  

స్టూడెంట్‌ బస్సు పాసుల్లో మోత ఇలా (రూ.లలో)
జిల్లాల్లో (మూడు నెలల పాస్‌లు)
దూరం    ప్రస్తుత చార్జీ    కొత్త చార్జీ
5 కి.మీ వరకు    310    400
10 కి.మీ వరకు    415    680
15 కి.మీ వరకు    510    900
20 కి.మీ వరకు    675    1,150
25 కి.మీ వరకు    850    1,350
30 కి.మీ వరకు    930    1,500
35 కి.మీ వరకు    1,025    1,600

జిల్లాల్లో (నెలవారీ పాస్‌లు)
5 కి.మీ వరకు    115    150
10 కి.మీ వరకు    140    250
15 కి.మీ వరకు    180    300
20 కి.మీ వరకు    240    400
25 కి.మీ వరకు    300    450
30 కి.మీ వరకు    330    500
35 కి.మీ వరకు    355    550

హైదరాబాద్, వరంగల్‌లో స్టూడెంట్‌ జనరల్‌ బస్‌పాస్‌
నెలవారీ పాస్‌    165    400
మూడు నెలల పాస్‌    495    1,200

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో (హైదరాబాద్‌ నగరం అవతల వివిధ పట్టణాలు, పల్లెలకు వెళ్లే సబర్బన్‌ సర్వీసుల్లో)

  • నెలవారీ పాస్‌కు ఇంతకుముందు రూ.165తో పాటు ప్రతి 2 కి.మీ.కి రూ.50 చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు రూ.400తోపాటు ప్రతి 2కి.మీ.కి రూ.70 చొప్పున వసూలు చేయ నున్నారు. Ü మూడు నెలల పాస్‌కు ఇంతకు ముందు రూ.495తోపాటు ప్రతి 2 కి.మీ.కి రూ.150 చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు రూ.1,200తోపాటు ప్రతి 2కి.మీ.కి రూ.210 చొప్పున వసూలు చేయనున్నారు. 
మరిన్ని వార్తలు