పంచాయతీలో భార్యను బంధించిన భర్త

20 Aug, 2020 22:02 IST|Sakshi

వికారాబాద్: గ్రామంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని ఓ వ్యక్తి  మహిళా సర్పంచ్, సెక్రటరీ, ఇద్దరు వార్డు సభ్యులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించాడు. అయితే నిర్బంధించిన మహిళా సర్పంచ్ బాధితుడి భార్య కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

గ్రామ పంచాయితీ పరిధిలో తాను చేసిన అభివృద్ధి పనులకు డబ్బులు చెల్లించడం లేదని సర్పంచ్ భర్త కూర్వ మల్లేశం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు వార్డు సభ్యులను నిర్బంధించారు. బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచిగా కూర్వ శివలీల సర్పంచ్ గా ఉన్నారు. ఆమె భర్త మల్లేశం గ్రామంలో గుంతలు పూడ్చడం, బోరు మోటార్లు మరమ్మతులు చేయడం వంటి పనులు చేయించారు. ఇందుకోసం సుమారు 1.30 లక్షలు ఆయనకు బిల్లులు రావాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఎంబీ రికార్డులు కూడా పూర్తయ్యాయి. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా జాయింట్ సంతకంతో వచ్చిపడింది. సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరు సంతకం చేస్తేనే బిల్లులు డ్రా చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ ఉప సర్పంచ్ ఎవరు లేకపోయినా ఒక మహిళా వార్డు సభ్యులకు జాయింట్ సంతకం అథారిటీ ఇచ్చారు. ఆమె సంతకం పెట్టడం లేదని అందువల్ల తనకు బిల్లు చెల్లింపు కావడం లేదని మల్లేశం ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించేందుకు వచ్చిన సర్పంచ్ శివలీల, పంచాయతీ కార్యదర్శి పరమేష్, వార్డు సభ్యులు మాణిక్యమ్మ, లక్ష్మీలను గ్రామపంచాయతీలో నిర్బంధించారు.

జీపీ కార్యాలయానికి తాళం వేసుకొని తనకు డబ్బులు చెల్లిస్తేనే తాళం తీస్తానని మొండికేశారు మల్లేశం. తమను విడిచి పెట్టాలని పంచాయతీ కార్యదర్శి సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. బిల్లులు చెల్లించేందుకు తన వద్ద ఎలాంటి పవర్ లేదని సెక్రటరీ చెప్పుకొచ్చారు. మీ సర్పంచ్, ఉప సర్పంచ్‌ల సంతకాలు అయితే బిల్లులు వస్తాయని తానేమి చేయలేనని చెప్పి సముదాయించారు. ఓ గంట తర్వాత అతడు కార్యాలయానికి వేసిన తాళం తొలగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా