ఉక్రెయిన్‌ పెయిన్‌.. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

26 Feb, 2022 12:16 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో/నెట్‌వర్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో నగరంలో భయాందోళనలు  నెలకొన్నాయి. నగరానికి చెందిన పలువురు విద్యార్ధులు ఉక్రెయిన్‌లో మెడిసిన్, తదితర ఉన్నత విద్యను అభ్యసిస్తూండడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు రోజులుగా నెలకొన్న పరిణామాలు..ఉక్రెయిన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల రాకపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలను తీసుకొచ్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని  కోరుతున్నారు. కేంద్రం మరిన్ని ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితిలో తాము ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నామని పలువురు  విద్యార్థులు తెలిపారు. జెప్రోజియా వంటి నగరాల్లో ఉన్న వారు తాము ఉంటున్న ఫ్లాట్‌లను ఖాళీ చేసి  బంకర్‌లకు తరలి వెళ్లారు. ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నిల్వలు పడిపోవడంతో అవసరాలకు సరిపడా డబ్బులు లేక ఇబ్బందులకు గురవుతున్నట్లు  మరికొందరు  చెప్పారు. భయానకమైన వాతావరణంలో ఉండలేక బిక్కుబిక్కుమంటూ గడుపవలసి వస్తుందని పేర్కొన్నారు. 

తిరిగి వెళ్లిన కొద్ది రోజులకే... 
హయత్‌నగర్‌లోని బృందావన్‌కాలనీకి చెందిన ఎర్ర హరిబాబు కుమార్తె ఎర్ర మేఘన 2019లో ఎంబీబీఎస్‌ చదివేందుకు ఉక్రెయిన్‌కు వెళ్లింది. జెఫ్రోజియా నగరంలోని జెఫ్రోజియా స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చేరి ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఉంటోంది. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన మేఘన కొద్ది రోజుల క్రితమే ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లింది. 

నీళ్లు కూడా లేవంట... 
బృందావన్‌కాలనీకే చెందిన గూడూరి మల్లారెడ్డి, రాధ దంపతుల రెండవ కుమారుడు మురళిరెడ్డి ఉక్రెయిన్‌ వీనిత్స నగరంలోని వినీత్స యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. రాజధాని కీవ్స్‌ నగరానికి కేవలం 150–200 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మురళిరెడ్డి కోసం తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘గురువారం రాత్రి వీడియోకాల్‌ చేశాడు. ఏటీఎంలలో డబ్బులు లేవని, తాగేందుకు నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పాడు’ అని మురళి సోదరుడు మహేష్‌రెడ్డి చెప్పారు.  నిత్యావసర వస్తువులు కూడా లభించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.  

క్యాంపస్‌ సెల్లార్లలో దాక్కున్నారు.. 
మన్సూరాబాద్, ఎల్లారెడ్డి కాలనీలోని సంతోషి హైట్స్‌అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న దువ్వ సతీష్‌కుమార్, ధనలక్ష్మిల పెద్దకుమారుడు రుషికేష్‌ కూడా వీనిత్స నగరంలోని వీనిత్స మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ నాలుగవ సంవత్సరం చదువుతున్నాడు. యనివర్సిటీ హాస్టల్‌ రూంలో ఉంటున్నాడు. సైరన్‌ మోతలు వినిపిస్తున్నాయని, క్యాంపస్‌ సెల్లార్‌లో ఉన్నామంటూ తల్లిదండ్రులకు వీడియోలు పోస్టు చేశాడు. 

కంటిన్యూగా బాంబుల మోత 
శుక్రవారం ఉదయం నుంచి గన్‌ఫైరింగ్, బాంబులు పేలుతున్న శబ్ధాలు ఎడతెరిపి లేకుండా వినిపిస్తున్నాయని ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని ఓ బంకర్‌లో ఆశ్రయం పొందుతున్న గడిపె అనీల తెలిపింది. ఆమె శుక్రవారం వాట్సప్‌ కాల్‌ ద్వారా ‘సాక్షి’తో మాట్లాడుతూ భయాందోళన వ్యక్తం చేసింది. సికింద్రాబాద్‌ మైలార్‌గడ్డకు చెందిన మనోహర్‌బాబు, శాంతిలకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అనీల మెడిసిన్‌ చదివేందుకు 2016లో ఉక్రెయిన్‌ వెళ్లింది. సికింద్రాబాద్, బెంగుళూరుకు చెందిన హారిక, జెన్నిఫర్‌తో కలిసి అనీల ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ఇండియాకు వచ్చేందుకు గత వారం రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా విమాన టిక్కెట్లు దొరకకపోవడంతో ఇక్కడే చిక్కుకుపోయామని ఆవేదన వ్యక్తం చేసింది.

గురువారం ఉదయం నుంచి డేంజర్‌ సైరన్‌లు మోగుతూనే ఉన్నాయని, మధ్యాహ్నం సూపర్‌మార్కెట్లు మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో వెంటనే వెళ్లి కావాల్సిన సరుకులు తెచ్చుకున్నామని తెలిపింది. సాయంత్రం బాంబు సైరన్‌ మోగడంతో స్నేహితులతో కలిసి అపార్ట్‌మెంట్‌కు సమీపంలో ఉన్న బంకర్‌లో తలదాచుకున్నానని, తమవెంట కొన్ని స్నాక్స్, వాటర్‌ బాటిళ్లు తెచ్చుకున్నామని వివరించింది. శుక్రవారం ఉదయం నుంచి బాంబు దాడులు, గన్‌ఫైరింగ్‌ శబ్ధాలు వినిపిస్తున్నాయని, బయట పరిస్థితి ఎలాఉందో తెలియడం లేదని వివరించింది. తమ కుమార్తెతో పాటు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని  క్షేమంగా తీసుకువచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ద్వారా మంత్రి కేటీఆర్‌కు విన్నవించుకున్నామని అనీల తండ్రి మనోహర్‌బాబు తెలిపారు.  


మెట్రో బంకర్‌లో తలదాచుకుందట.. 
మా కూతురు సింధుప్రియ ఉక్రెయిన్‌లోని ఖార్‌కివ్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్శిటీలో ఎంబీబీఎస్‌ థర్డ్‌ ఈయర్‌ చదువుతోంది. యుద్ధం కారణంగా ఇప్పుడు సింధు అక్కడి మెట్రో అండర్‌గ్రౌండ్‌ బంకర్‌లో తలదాచుకుంది. ఎలాంటి వసతులు లేవంట. ఫోన్‌చార్జింగ్‌కు కూడా ఇబ్బందిగా ఉందని చెప్పింది.     – మధుకర్‌ గౌడ్, పీర్జాదిగూడ (సింధుప్రియ తండ్రి) 


భయమేస్తోంది... 
మా పెద్దబ్బాయి రాహుల్‌ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. వినెత్స వర్సిటీలో సీటు వచ్చింది. ప్రస్తుతం అక్కడ యుద్ధంతో భయమేస్తోంది. యూనివర్సిటీ వారు ఎలాంటి బాధ్యత తీసుకోవడం లేదని మావాడు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే పిల్లల్ని ఇక్కడికి తీసుకురావాలని వేడుకుంటున్నాం. 
– కె.వేణుగోపాల్‌ గుప్తా, జ్యోతిక (రాహుల్‌ తల్లిదండ్రులు) 

ధైర్యం చెప్పాం..
మా పెద్దమ్మాయి కీర్తి ఖార్‌కివ్‌ యూనివర్సిటీలో మెడిసిన్‌ మూడో సంవత్సరం చదువుతోంది. మాతో ఫోన్‌లో మాట్లాడుతోంది. ప్రస్తుతం ఆమె మెట్రో అండర్‌ గ్రౌండ్‌ సెల్లార్‌లో తలదాచుకుంటోంది. పరిస్థితి బాలేదని చెప్పింది. ధైర్యంగా ఉండాలని మేం చెప్పాం. త్వరగా ఇక్కడికి తీసుకురావాలని ప్రభుత్వాలను కోరుతున్నాం. 
– వేముల శ్రీనివాస్, పీర్జాదిగూడ ( కీర్తి తండ్రి) 

భద్రంగా రప్పిస్తాం: కిషన్‌రెడ్డి 
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను భద్రంగా రప్పిస్తామని, ఆందోళన పడవద్దని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కాచిగూడ నెహ్రూనగర్‌ ప్రాంతానికి చెందిన మరికంటి విశ్వనాథ్‌ కుమారుడు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోగా..అతన్ని రక్షించాలని కోరుతూ విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిశారు. తమ కుమారునితో పాటు మరికొంత మంది విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడించారు. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులు నకుల్‌ ప్రణయ్, సాయిరామ్, తరుణ్, రోషిణి, రీనా డోర్కా తదితరులతో కిషన్‌రెడ్డి మాట్లాడి వారికి భరోసా కల్పించారు.

ల్యాండింగ్‌కు అనుమతిస్తేనే.. 
యుద్ధానికి ముందే చాలా మంది విద్యార్ధులు ఇండియాకు వచ్చారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్లు రావడం కొద్దిగా కష్టమే. ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినప్పటికీ రష్యన్‌ సైనికుల ఆధీనంలో ఉన్న కీవ్‌ ఎయిర్‌పోర్టులో మన విమానాలకు ల్యాండింగ్‌ సదుపాయం ఉంటుందా లేదా అన్నది తెలియడం లేదు. ఒకవేళ ల్యాండింగ్‌కు అనుమతి లభిస్తే ఒకటి, రెండు రోజుల్లో అందరూ వచ్చేస్తారు. ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌కు ఏడున్నర గంటల్లో చేరుకుంటారు.   – వాల్మికి హరికిషన్, వాల్మీకి ట్రావెల్‌ అండ్‌ టూరిజం సొల్యూషన్స్‌ 

క్షేమంగానే ఉన్నాం 
యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రస్తుతం  క్షేమంగానే ఉన్నాం. క్యాంపస్‌లో అలారం మోగితే వెంటనే బంకర్లలోకి వెళ్లాలని నిర్వహకులు సూచించారు. కివీ నగరానికి దూరంగా ఉండటంతో మాకు  యుద్ధం ప్రభావం తక్కువగానే ఉంది.కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంబసీ వర్గాలు తెలియజేశాయి.      – ఎర్ర మేఘన,  జెఫ్రోజియా స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ 
 
ప్రభుత్వం చొరవ చూపాలి   
మా అబ్బాయి శరత్‌ ఉక్రెయిన్‌లో ఉన్నాడు. 15 రోజులుగా ఫ్లైట్‌ దొరకడం లేదన్నాడు. ప్రసుత్తం అక్కడ పరిస్థితి ఆందోళనగానే ఉన్నదని, ఆహార పదార్ధాలు దొరకడం కష్టంగా ఉందని చెప్పాడు. విద్యుత్‌ సరఫరా కూడా అంతంత మాత్రమే ఉన్నదన్నాడు. ప్రభుత్వం తర్వగా విమానాలు ఏర్పాటు చేసి వెనక్కి రావడానికి చర్యలు తీసుకోవాలి. 
– అముద, మల్కాజిగిరి, (శరత్‌ తల్లి) 
 
సత్వర చర్యలు తీసుకోవాలి 
మా పాప శ్రీవైష్ణవి ఉక్రెయిన్‌లోని వినెక్సియా పిరిగోం నేషనల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతోంది. యుద్ధంతో అక్కడ ఎలా ఉందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నాం. ఫోన్‌లో మాట్లాడింది. ప్రస్తుతం అక్కడ విద్యుత్‌ బాగానే ఉందని చెప్పింది. కానీ నెట్‌వర్క్‌ సరిగ్గా లేదంట. ఎవరూ హాస్టల్‌ నుంచి బయటకు రావొద్దని చెప్పారని తెలిపింది. వీలైనంత త్వరగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంబసీ వాళ్లతో మాట్లాడి మా పిల్లలకు సహాయం అందించాలి. మంత్రి కేటీఆర్‌కు కూడా ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశాం.      – కందుకూరి సవిత 

మరిన్ని వార్తలు