28 నుంచి ‘రైతుబంధు’ జమ

23 Jun, 2022 09:49 IST|Sakshi

ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఆదేశం

65 లక్షల మంది రైతులకు అందనున్న రూ.7,500 కోట్లు

బుధవారం నాడు క్రయవిక్రయాలు జరిగిన వారూ అర్హులే  

సాక్షి, హైదరాబాద్‌: రైతుబంధు కింద అన్నదాత లకు ఈ నెల 28 నుంచి పెట్టుబడి సాయం అందనుంది. ఈ అంశంపై బుధవారం సీఎస్‌ సోమేశ్‌ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో చర్చించిన సీఎం కేసీఆర్‌... వర్షాలు బాగా కురుస్తున్నందున రైతులకు రైతు బంధు సొమ్ము అందించాలని ఆదేశించారు. ఈ వానాకాలం సీజన్‌కు 65 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి.

ముందుగా ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత ఒకటి నుంచి రెండెక రాల రైతులకు.. ఇలా రైతుబంధు సొమ్మును దశల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ‘సాక్షి’కి తెలి పారు. వచ్చే నెల 15 నాటికి అందరి ఖాతాల్లో పెట్టు బడి సాయం జమ అయ్యే అవకాశం ఉంది. అంతే గాకుండా బుధవారం రాత్రి వరకు క్రయవిక్ర యాలు జరిగిన భూములకు చెందిన రైతులకు కూడా రైతుబంధు సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు.

గతేడాది వానాకాలంలో 60.84 లక్షల మంది రైతులకు రూ. 7,360.41 కోట్ల రైతు బంధు సాయం అందగా గత యాసంగిలో 63 లక్షల మంది రైతులకు రూ.7,412.53కోట్ల సాయం అందింది. 2022–23 సంవత్సరానికి బడ్జెట్‌లో రైతుబంధు కోసం ప్రభుత్వం రూ. 14,800 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు ఎనిమిది విడతల్లో రూ. 50,447.33 కోట్ల సాయం అందించింది.

కేంద్రం కొర్రీలు పెట్టినా రైతుబంధు ఆగదు: మంత్రి నిరంజన్‌రెడ్డి
కేంద్రం ఆర్థిక నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి ఇరికించాలని చూసినా రైతుబంధు పథకం ఆగదని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి 9వ విడత రైతుబంధు సాయం జమ చేస్తామన్నారు. సీఎం కేసీ ఆర్‌కు నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ధన్యవాదాలు తెలిపారు.  

చదవండి: (సీఎం కేసీఆర్‌పై సీబీఐకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్‌)

మరిన్ని వార్తలు