Rahul Gandhi Speech: టీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు 

7 May, 2022 11:57 IST|Sakshi

వరంగల్‌ ‘రైతు సంఘర్షణ సభ’లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ 

(వరంగల్‌ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి): ‘‘రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయి. తెలంగాణను నేరుగా పాలించలేమని, ఇక్కడ అధికారంలోకి రాలేమని బీజేపీకి తెలుసు. అందుకే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ రిమోట్‌ కంట్రోల్‌ కావాలని కోరుకుంటోంది. కాంగ్రెస్, బీజేపీ కలవవు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. ఇక్కడి సీఎం ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నా ఈడీ, సీబీఐ లాంటి సంస్థల చేత కేంద్రం విచారణ జరిపించకపోవడమే ఇందుకు సాక్ష్యం’’ అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. శుక్రవారం హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో టీపీసీసీ నిర్వహించిన ‘రైతు సంఘర్షణ సభ’లో రాహుల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్, బీజేపీలపై మాటల తూటాలు పేల్చారు. సభలో రేవంత్‌రెడ్డి ప్రకటించిన ‘వరంగల్‌ రైతు డిక్లరేషన్‌’లో ఇచ్చిన హామీలన్నింటికీ కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీ ఇస్తుందని, రైతుల పక్షాన నిలబడతామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లను మెరిట్‌ ప్రాతిపదికన ఇస్తామని, ఎంత పెద్ద నాయకులైనా సరే పేదల పక్షాన పోరాటం చేయకపోతే టికెట్‌ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. సభలో రాహుల్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

ఆ ఒక్క కుటుంబానికే లబ్ధి.. 
‘‘తెలంగాణ అంత సులువుగా ఏర్పాటు కాలేదు. యువత ప్రాణ త్యాగాలు చేసింది. తెలంగాణ తల్లి కోసం తనువు చాలించింది. ఈ రాష్ట్రం ఏ ఒక్కరి కోసమో ఏర్పాటైనది కాదు. ఇది తెలంగాణ ప్రజలందరి కల. ప్రజలు తమ రక్తం చిందించారు. పోరాటం చేశారు. వారికి కాంగ్రెస్‌ పార్టీ తోడుగా నిలబడింది. పోరాటం చేసింది. తెలంగాణ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి రాష్ట్రం ఇచ్చాం. ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని.. రైతులు, కార్మికులు, పేదల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించాం. కానీ ఈ ఎనిమిదేళ్లలో ప్రజల ఆకాంక్షలు ఏమయ్యాయి? ఎవరికి లాభం జరిగింది? ఒక్క కుటుంబం మాత్రమే పెద్ద లబ్ధి పొందింది. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? వేల మంది రైతుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు? ఆ రైతుల కుటుంబాల రోదనలకు బాధ్యులెవరు?  

ఛత్తీస్‌గఢ్‌ వెళ్లి అడగండి.. 
ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల సమయంలో మేం చాలా హామీలు ఇచ్చాం. క్వింటాల్‌ ధాన్యానికి రూ.2,500 ధర కావాలని, రుణమాఫీ చేయాలని అక్కడి రైతులు మమ్మల్ని అడిగారు. మేం హామీ ఇచ్చి అమలు చేశాం. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ వెళ్లి ధాన్యం ఎంతపెట్టి కొంటున్నామో అడగండి. ఇక్కడి రైతులు కూడా పంటలకు గిట్టుబాటు ధర కావాలని అడుగుతున్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌లో భాగంగా రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు మెరుగైన మద్దతు ధరలను ప్రకటించాం. రైతులెవరూ ఆందోళన పడొద్దు. ఇవి నెరవేరడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇవి వట్టి మాటలు కావు. తెలంగాణ ప్రజల కలలు నెరవేరే దిశలో ఇది తొలి అడుగు. ఇది డిక్లరేషన్‌ కాదు. రైతులకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే గ్యారెంటీ. తెలంగాణలోని ప్రతి రైతు ఈ డిక్లరేషన్‌ చదవాలి. ఇందులోని ప్రతి అంశాన్ని నెరవేరుస్తాం. గిరిజనులకు కూడా భరోసా కల్పిస్తాం. వారికి 10 శాతం రిజర్వేషన్ల విషయంలో మా మద్దతు ఉంటుంది. 

టీఆర్‌ఎస్‌కు, మాకే యుద్ధం 
తెలంగాణను మోసం చేసిందెవరు? ఇక్కడి ప్రజల కలలను భగ్నం చేసిందెవరు? వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దొంగిలించిందెవరు? 
ఆ వ్యక్తులతో, ఆ పార్టీలతో కాంగ్రెస్‌కు ఎలాంటి అవగాహన ఉండదు. ఈ విషయం గురించి కాంగ్రెస్‌ పార్టీలోని నేతలు, కార్యకర్తలు ఎవరైనా చర్చిస్తే.. వారిని పార్టీ నుంచి పంపించేస్తాం. అది ఎంత వారైనా సరే. అలాంటి ఆలోచన ఉన్న వాళ్లు ఎవరైనా ఉంటే టీఆర్‌ఎస్‌ లేదా బీజేపీలోకి వెళ్లిపోవచ్చు. మేం రాజులతో స్నేహం చేయం. పేదలతో ఉంటాం. టీఆర్‌ఎస్‌ను ఓడించి తీరుతాం. భవిష్యత్తు పోరాటం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్యే జరుగుతుంది. తెలంగాణ ప్రజల కలలను భగ్నం చేసిన వారిని.. కార్మికులు, రైతులు, ఉద్యోగులకు అన్యాయం చేసిన వారిని కాంగ్రెస్‌ వదిలిపెట్టదు. 

ప్రజల పక్షాన పోరాడేవారికే టికెట్లు 
పార్టీ టికెట్ల కేటాయింపు మెరిట్‌ పద్ధతిలో జరుగుతుంది. ప్రజల పక్షాన నిలబడి, సమస్యలపై పోరాటం చేసే వారికి మాత్రమే రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇస్తాం. అది ఎంత పెద్దవారయినా, ఎవరైనా సరే. రైతులు, పేదల పక్షాన నిలబడకపోతే కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వదు. 
 

మీ కోసం వస్తా.. మీకోసం పనిచేస్తా.. 
సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం వెనుక ఒక లక్ష్యం ఉంది. ప్రజల అభీష్టం మేరకు సోనియా రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరాలనేది ఆమె కోరిక, మనందరి కోరిక. దీన్ని నెరవేర్చేందుకు మీ అందరితో కలిసి పనిచేస్తాం. ఇందుకోసం నా అవసరం ఎక్కడ ఉన్నా, నన్ను మీరు ఎక్కడికి పిలిచినా, నా నుంచి ఎలాంటి మద్దతు కావాలన్నా.. తెలంగాణ ప్రజల పక్షాన వచ్చి నిలబడతా. మీ కోసం పనిచేస్తా. ఇది కాంగ్రెస్‌ పార్టీ పోరాటం. నా పోరాటం. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య అవగాహన ఉంది. కేంద్రం నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ తోడుగా నిలిచింది. తెలంగాణను నేరుగా పాలించలేమని, ఇక్కడ అధికారంలోకి రాలేమని బీజేపీకి తెలుసు. అందువల్ల ఈ రాష్ట్రంలో వారికి ఒక రిమోట్‌ కంట్రోల్‌ కావాలని కూడా తెలుసు. కాంగ్రెస్, బీజేపీ కలవవు కాబట్టి.. ఇక్కడ కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా టీఆర్‌ఎస్‌ రావాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. 

ఒక్కసారి అవకాశం ఇవ్వండి 
రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్‌ఎస్‌కు ప్రజలు రెండుసార్లు అవకాశమిచ్చారు. కానీ టీఆర్‌ఎస్‌ మోసం చేసింది. కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశమివ్వండి. రైతులు, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మీతో కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం’’ అని రాహుల్‌ విజ్ఞప్తి చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షత వహించిన ఈ సభలో.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, సీనియర్‌ నేతలు జానారెడ్డి, రేణుకాచౌదరి, బలరాం నాయక్,  దాసోజు శ్రవణ్, అంజన్‌కుమార్‌ యాదవ్,  దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, కొండా సురేఖ, కొండా మురళి, ఇతర నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

రాహుల్‌ నేటి షెడ్యూల్‌ ఇదీ.. 
వరంగల్‌ సభకు హాజరైన రాహుల్‌ రాత్రికి హైదరాబాద్‌ చేరుకుని హోటల్‌ తాజ్‌కృష్ణలో బస చేశారు. శనివారం ఉదయం ఆయన హోటల్‌లోనే పలువురు ప్రముఖులు, మీడియా పెద్దలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సంజీవయ్య పార్కులో మాజీ సీఎం దామోదరం సంజీ వయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత నేరుగా గాంధీభవన్‌కు చేరుకుని పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. ముఖ్య నేతలతో చర్చించాక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోఆర్డినేటర్లతో మాట్లాడుతారు. సాయంత్రం 5.40 గంటల సమయంలో శంషాబాద్‌ నుంచి తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. అయితే.. సమయానుకూలతను బట్టి చర్లపల్లి జైలులో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలతో రాహుల్‌ ములాఖత్‌ అవుతారని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ ఈ ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు.  

మరిన్ని వార్తలు