రైతన్నకు ‘వేదిక’

31 Oct, 2020 02:06 IST|Sakshi

జనగామ జిల్లా కొడకండ్లలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

రూ. 572 కోట్లతో 2,601 రైతు వేదికల నిర్మాణం

ఎరువులు, విత్తనాలు, పంట ఉత్పత్తులు నిల్వ చేసుకొనేలా ఏర్పాట్లు

రైతులకు శిక్షణ, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలన్నీ వాటిలోనే

సాక్షి, హైదరాబాద్‌/ వరంగల్‌: విత్తు నాటింది మొదలు పంట చేతికొచ్చే వరకు కష్టాల సాగు చేసే అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం మరో కానుక ఇస్తోంది. రైతులను ఒకే వేదిక కిందకు తీసుకురావడంతోపాటు వారు అధిక రాబడి పొందడంలో సహాయ పడేందుకు నిర్మించిన రైతు వేదికలను నేడు కర్షకులకు అంకితం చేయనుంది. తెలంగాణలో తొలి రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం జనగాం జిల్లా కొడకండ్లలో ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 572.22 కోట్లు కేటాయించగా క్లస్టర్లవారీగా ప్రతిపాదించిన వాటి నిర్మాణ వ్యయాలను గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖలు భరించాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేదికల నిర్మాణాలను అనుసంధానించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,536, పట్టణ ప్రాంతాల్లో 65 రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా భూసేకరణ, తదితర కారణాలతో 63 చోట్ల రైతు వేదికలకు ఇంకా పునాది రాయి పడలేదు. మిగిలిన వాటిలో పూర్తయిన 2,476 రైతు వేదికలను దసరా రోజున ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ అనివార్య కారణాలతో సాధ్యంకాలేదు.

సకల సదుపాయాలతో.. 
రాష్ట్రంలో ప్రతి 5 వేల ఎకరాల విస్తీర్ణానికి ఒక ఏఈవో ఉన్నారు. ఏఈవో క్లస్టర్‌ పరిధిలో రెండు, మూడు గ్రామాలకు కలిపి అందరికీ అందుబాటులో ఉండే ఒక గ్రామంలో రైతు వేదికలను నిర్మించారు. వేదికల్లో మౌలిక సదుపాయాలైన కుర్చీలు, మైకులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. అవసరాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు, పంట ఉత్పత్తులు నిల్వ చేసుకొనేలా వేదికలను నిర్మించారు. క్లస్టర్‌ పరిధిలోని రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతులు సమావేశాలు అక్కడే నిర్వహించుకొనేలా నిర్మాణాలకు రూపకల్పన చేశారు. రైతులకు శిక్షణ, పథకాలపై అవగాహన కార్యక్రమాలు ఈ వేదికల్లోనే నిర్వహించనున్నారు. రైతులకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ ఇదే ‘వేదిక’ కానుంది.

దాతల చేయూత...
రైతు వేదికల నిర్మాణంలో కర్షక లోకానికి దాతలు అండగా నిలిచారు. కొన్నిచోట్ల స్థలాలను, మరికొన్ని చోట్ల నిర్మాణ ఖర్చులను విరాళంగా ఇచ్చారు. 135 చోట్ల రైతు వేదికల నిర్మాణ స్థలాలను దానం చేయగా 24 చోట్ల వాటి నిర్మాణ వ్యయాన్ని దాతలు భరించారు.

కొడకండ్లలో ప్రారంభించనున్న సీఎం...
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శనివారం బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో జనగామ జిల్లా కొడకండ్లకు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కొడకండ్లకు చేరుకొని 12:10 గంటలకు రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తారు. 12:20 నిమిషాలకు సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారు. అనంతరం కొడకండ్ల మండలంలోని రామవరం గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు పనులను పరిశీలిస్తారు. కొడకండ్లలో దాదాపు 5 వేల మంది రైతులతో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగి చేరుకోనున్నారు.

మరిన్ని వార్తలు