85 శాతం ఇళ్లలో టీవీలు..

16 Sep, 2020 06:30 IST|Sakshi

40 శాతం మందికి స్మార్ట్‌ఫోన్లు, ఐపాడ్స్, ట్యాబ్స్‌

ఈ సౌకర్యాలు లేని వారు 6.8 శాతమేనని ప్రభుత్వ పరిశీలనలో వెల్లడి

దూరదర్శన్, టీ–శాట్‌ల ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు: మంత్రి సబిత  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా 85 శాతం ఇళ్లలో టీవీలున్నట్టు ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది. ఇటు 40 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు, ఐపాడ్స్, ట్యాబ్స్‌ వంటివి ఉపయోగిస్తున్నారని, కేవలం 6.8% మందికి మాత్రమే ఈ సదుపాయాలేవీ లేవని తేలింది. ప్రభుత్వపరంగా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంతమందికి ఈ సౌకర్యాలున్నాయి.. ఏ సాధనాల ద్వారా మారుమూల ప్రాంతాల్లోని వారిని చేరుకోవచ్చు.. తదితర అంశాలపై నిర్వహించిన సర్వేలో భాగంగా ఆయా విషయాలు తెలిశాయి.

వివిధ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ–లెర్నింగ్‌ చేపడుతున్నట్లు, ఎక్కువ మంది విద్యార్థులకు పాఠాలు అందుబాటులో తెచ్చేందుకు దూరదర్శన్, టీ–శాట్‌ల ద్వారా ఆన్‌లైన్‌ తరగతులను ప్రసారం చేస్తున్నట్టు, వీటిని 85 శాతం విద్యార్థులు వీక్షిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్కూళ్లను తెరవాల్సి ఉంటుందని, ఈ నెల 21 నుంచి నుంచి వాటిని తెరిచే అవకాశాలున్నట్టు తెలుస్తోందన్నారు. అయితే ఇప్పుడిప్పుడే విద్యార్థులను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు సుముఖంగా లేరనే అభిప్రాయం వినిపిస్తోందన్నారు.

మంగళవారం శాసనమండలిలో ఆన్‌లైన్‌ తరగతులపై ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మొత్తంగా 48,150 వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేయడంతో పాటు 86 వేల మంది పేరెంట్స్‌తో అధికారులు మాట్లాడి ఈ తరగతులు సవ్యంగా జరిగేటట్టు చర్యలు చేపట్టారని మంత్రి సబిత చెప్పారు.  మొత్తం 16 విశ్వవిద్యాలయాల స్థాపనకు పిలిస్తే 9 దరఖాస్తులు వచ్చాయని వాటిలో 8 సమ్మ తించినట్లు,  మొదటి దశలో 5 వర్సిటీలకు అనుమతినిస్తున్నట్టు సబితా తెలిపారు. 

నివేదిక రాగానే చర్యలు: మంత్రి జగదీశ్‌
శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై దర్యాప్తుæ నివేదికలు రాగానే దానిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సీబీసీఐడీతో పాటు జెన్‌కో సీఎండీ ఆధ్వర్యంలో అంతర్గత విచారణ చేపట్టినట్టు, అయితే ఈ ఐదుగురు సభ్యుల బృందంలో సీఎండీతో సహా మరో ఇద్దరికి కోవిడ్‌ సోకిన కారణంగా కొంత జాప్యం జరుగుతోందన్నారు. విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రెండేళ్ల కిందే బ్యాటరీ బ్యాకప్‌ బ్యాంక్‌ ఏర్పాటుపై ఇండెంట్‌ పంపించినా దాని ఏర్పాటులో జాప్యం, యూనిట్‌కు అపారనష్టం వాటిల్లకుండా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అధికారులు, సిబ్బందికి మెరుగైన పరిహారం, వారి కుటుంబసభ్యులకు ఉద్యోగాల కల్పన చేయాలని రామచంద్రరావు కోరారు. మరణించిన విద్యుత్‌ ఉద్యోగులకు ప్రభుత్వం, జెన్‌కో పరంగా నష్టపరిహారంతో పాటు కారుణ్య నియామకాలు చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు. 

5 వర్సిటీలకు ఓకే
దేశవ్యాప్తంగా చూస్తే ప్రైవేట్‌ వర్సిటీల విష యంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందరికీ విద్య అందించాలని, విద్యా ప్రమాణాలు పెంపొందించాలనే ఉద్దేశంతో మొదటిదశలో ఐదు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. గతంలోనే ఆమోదించిన బిల్లుకు ఇప్పుడు సవరణలు ప్రతిపాదిస్తూ కౌన్సిల్‌ ఆమోదం కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను నిరీ్వర్యం చేయడం లేదని వాటి బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు, వీసీల నియామకం, అధ్యాపకులు, ఇతర సిబ్బంది నియామకానికి చర్యలు చేపడతామన్నారు.

ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్టు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి, టీచర్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రకటించారు. ఈ బిల్లును ఆమోదించేటప్పుడు జరిపిన ఓటింగ్‌లోనూ వీరు వ్యతిరేకంగా ఓటేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కావాలనే నీరుగార్చి ప్రైవేట్‌లను సర్కార్‌ ప్రోత్సహిస్తోందని, వీసీలను నియమించకపోగా.. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని జీవన్‌ రెడ్డి విమర్శించారు. ఈ బిల్లును విరమించుకోవాలని అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్‌ వర్సిటీల వల్ల తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.  

మరిన్ని వార్తలు