మంత్రి సబిత హామీతో ఆగిన ఆందోళన

21 Jun, 2022 01:34 IST|Sakshi
సోమవారం రాత్రి విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో మంత్రి సబిత చర్చలు సఫలం 

సోమవారం అర్ధరాత్రి దాకా కొనసాగిన చర్చలు 

నెల రోజుల్లో డిమాండ్లన్నీ తీరుస్తామన్న మంత్రి 

రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థుల పట్టు 

స్వయంగా చెప్తున్నా ఇంకేం కావాలన్న మంత్రి 

చివరికి వెనక్కి తగ్గిన విద్యార్థులు..  

నిర్మల్‌/ బాసర: బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ఆందోళనపై ప్రతిష్టంభన వీడింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతోపాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వచ్చి చర్చించడం, నెలరోజుల్లో డిమాండ్లన్నీ నెరవేరుస్తమని హామీ ఇవ్వడంతో.. ఆందోళన విరమణకు విద్యార్థులు అంగీకరించారు. 

అర్ధరాత్రి దాకా చర్చలు.. 
బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు పట్టువీడకుండా ఆందోళన చేస్తుండటంతో స్వయంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్కడికి వెళ్లారు. ఇప్పటికే నిర్మల్‌ కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు రెండుసార్లు విద్యార్థులతో చర్చించి విఫలమయ్యారు. తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు బాసర చేరుకున్నారు.

ఆమెతోపాటు ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి వీసీ రాహుల్‌ బొజ్జా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.వేణుగోపాలాచారి, ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ, అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఆర్జీయూకేటీ కొత్త డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సతీశ్‌కుమార్‌ తదితరులు క్యాంపస్‌కు వచ్చారు. తొలుత దాదాపు యాభై మంది విద్యార్థులతో అధికారులు చర్చించాక.. రాత్రి 10.25 గంటల సమయంలో మంత్రి సబిత వారితో మాట్లాడారు. సోమవారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి.

ఈ సందర్భంగా నెలరోజుల్లో డిమాండ్లన్నింటినీ తీరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరగా.. ‘సంబంధిత మంత్రిని స్వయంగా చెప్తున్నా.. ఇంకా ఎలాంటి హామీ కావాలి’ అని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆందోళన విరమించాలా, కొనసాగించాలా అన్నదానిపై చర్చించుకున్న విద్యార్థులు.. అనంతరం క్యాంపస్‌ ప్రధాన గేటు వద్దకు వచ్చి మీడియాతో మాట్లాడారు. డిమాండ్లను పరిష్కరిస్తారని మంత్రిపై, అధికారులపై నమ్మకం ఉందని.. ఆందోళన విరమిస్తున్నామని ప్రకటించారు. 

పట్టుదలగా ఆందోళన.. 
ఆర్జీయూకేటీ విద్యార్థులు ఏడు రోజులుగా పట్టుదలతో ఆందోళన కొనసాగించారు. ఆదివారం రోజంతా ఎండలో, రాత్రంతా చలిలో ఆరు బయటే నిద్రించి నిరసన తెలిపారు. సోమవారం వేకువజామునే మేల్కొని అంతా కలిసి యోగా చేశారు. తర్వాత ఆర్జీయూకేటీ ప్రాంగణంలోనే రాత్రి వరకు నిరసన కొనసాగించారు. 

ట్విట్టర్, యూట్యూబ్‌లే.. 
ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారు సమస్యలను చెప్పుకుందామంటే పోలీసులు మీడియాను క్యాంపస్‌లోకి అనుమతించలేదు. కనీసం ప్రధాన ద్వారం దరిదాపుల్లోకీ రానివ్వలేదు. విద్యార్థుల్లో నుంచి ఒకరిద్దరు తమకు తెలిసిన పాత్రికేయులకు సమాచారమిస్తేనే తప్ప.. క్యాంపస్‌లో లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

ఈ క్రమంలో ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు.. ట్విట్టర్, యూట్యూబ్‌లను అనుసంధానకర్తలుగా మార్చుకున్నారు. వాటి ద్వారానే క్యాంపస్‌లో జరుగుతున్న పోరును ప్రపంచానికి వెల్లడిస్తున్నారు. క్యాంపస్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఓ విద్యార్థి గీసిన చిత్రం, మరికొందరు విద్యార్థులు తయారు చేసిన పాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

క్యాంపస్‌లోకి వెళ్లేందుకు బీజేపీ నేతల యత్నం 
ట్రిపుల్‌ ఐటీ ప్రధానద్వారం వద్ద పోలీసులు అడ్డుకుంటుండటంతో.. బీజేపీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, బీజేవైఎం నాయకులు సోమవారం వేకువజామున నాలుగు గంటలకు వెనుక భాగంలో గోడదూకి క్యాంపస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. కాగా.. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఆందోళనపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. ప్రభుత్వం, మంత్రులు విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

విద్యార్థుల డిమాండ్లివీ.. 
ఆర్జీయూకేటీ విద్యార్థి పాలక మండలి సభ్యులు సోమవారం తమ డిమాండ్లపై యూట్యూబ్‌ లైవ్‌ ద్వారా స్పష్టత ఇచ్చారు. 
► ప్రభుత్వం వెంటనే చాన్సలర్‌ను నియమించాలని, సెర్చ్‌ కమిటీ వేసి వైస్‌ చాన్సలర్‌నూ ఎంపిక చేయాలని, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ను నియమించాలని కోరారు. 
► విద్యార్థుల అవసరాల కోసం కేటాయించే 312 గ్రాంట్లు 2019 నుంచీ రావడం లేదని.. వీటిని ఇవ్వడంతోపాటు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును కోరారు. బడ్జెట్‌ లేనందునే తమకు ల్యాప్‌టాప్, యూనిఫాం, స్పోర్ట్స్‌వేర్, బెడ్లు ఇవ్వడం లేదని చెప్పారు. 
► ఎనిమిదివేల మంది విద్యార్థులు ఉండే వర్సిటీలో రెగ్యులర్‌ అధ్యాపకులు 17 మందేనని.. మిగతా 170 మంది కాంట్రాక్టు వాళ్లు ఉన్నారని, వెంటనే సరిపడా అధ్యాపకులను నియమించాలన్నారు. 
► క్యాంపస్‌లో కేవలం ఇద్దరు మాత్రమే పీఈటీలు ఉన్నారని, విద్యార్థినులకు ప్రత్యేకంగా మహిళ పీఈటీని నియమించాలని కోరారు. 
► 24 గంటల పాటు లైబ్రరీ, షాపింగ్‌ కాంప్లెక్స్‌లతోపాటు మంచి క్యాంటిన్‌ కావాలని కోరారు. ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్‌ తదితర సమస్యలు, హాస్టల్‌ గదుల మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు