‘తెలంగాణలో మాత్రమే టీవీల ద్వారా విద్యాబోధన’

30 Oct, 2020 17:41 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి : విద్యారంగంలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకువస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి సబిత పాల్గొన్నారు. బీటీఎస్ చౌరస్తా వద్ద ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో 2 కోట్ల 95 లక్షలతో నిర్మించిన కస్తూర్భా గాంధీ పాఠశాల ప్రారంభోత్సవంతో పాటు పాఠశాల దాత తిమ్మారెడ్డి సుభాష్ రెడ్డి సొంత ఖర్చులతో మూడు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బాలుర పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మనసున్న మనిషిగా పాఠశాల నిర్మాణానికి ముందుకు వచ్చిన సుభాష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారని చెప్పారు. చదవండి: ఆగ్రహం: మంత్రి సబితకు నిరసన సెగ

కరోనా లాక్ డౌన్ సమయంలో రైతాంగం, విద్యారంగాలపై సీఎం కేసీఆర్ మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. రైతు పండించిన పంటని ఇంటికి తీసుకురావడంతో పాటు విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూశారన్నారు. రాష్ట్రంలో గురుకులాలు ఏర్పాటు చేసి విద్యారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే టీవీల ద్వారా విద్యాబోధన కొనసాగుతోందని, ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే విద్యాబోధన అందుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయని వివరించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరిక మేరకు జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, ప్రతి రంగంలో కామారెడ్డి నియోజకవర్గం ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తామని చెప్పారు

మరిన్ని వార్తలు