తెలంగాణకు కేంద్రం మొండిచేయి

13 Jun, 2022 01:25 IST|Sakshi

‘మన ఊరు– మన బడి’కి నిధులిస్తుంటే నిరూపించాలి? 

సంజయ్‌కు మంత్రి సబిత సవాల్‌

ఒక్క కేంద్ర విద్యాసంస్థను కూడా ఇవ్వలేదని ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్నింటా మొండి చేయి చూపుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ‘మన ఊరు – మన బడి’ కోసం మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న రూ.3,497 కోట్లలో రూ.2,700 కోట్లు కేంద్రం నిధులేనంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధారాలతో సహా నిరూపించాలని మంత్రి సవాల్‌ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’కి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని, దానికి అధిక మొత్తంలో నిధులిచ్చి పనులను చేపట్టిందని, ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిని మించి రూపొందిస్తుంటే చూసి ఓర్వలేక బండి సంజయ్‌ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆమె మండిపడ్డారు.

ఎనిమిదేళ్ల పాలనలో కేంద్రం రాష్ట్రానికి ఒక్క కేంద్ర విద్యా సంస్థనూ ఇవ్వలేదని, ఈ అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులెవ్వరికీ ధైర్యం లేదని ఆమె ధ్వజమెత్తారు. ‘బేటీ బచావో– బేటీ పడావో’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మోడల్‌ స్కూళ్లను ఎత్తివేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని మంత్రి ఎద్దేవా చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన బడిబాటలో బీజేపీ నాయకులు కూడా పాల్గొనాలని ఆమె కోరారు.

విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే ఆకాంక్షతో ప్రభుత్వం ఈ ఏడాది నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపడుతోందని, విద్యార్థుల సౌలభ్యం కోసం ద్విభాషా పుస్తకాలను ముద్రించి ఇస్తోందని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరై పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొల్పాలని ఆమె కోరారు.   

మరిన్ని వార్తలు