సదరం స్కాంలో సర్కారు ఉద్యోగులు!

30 Jun, 2022 20:03 IST|Sakshi

సర్టిఫికెట్లు తీసుకున్న 22 మంది ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు

317 జీవో బదిలీల కోసమే తీసుకున్నారని అనుమానం

ఎవరెవరు ఎక్కడ ఉన్నారని ఆరా తీస్తున్న ఏసీబీ

సర్టిఫికెట్లు పొందిన సివిల్‌ ఆసుపత్రి సిబ్బందిపైనా నజర్‌..?

దూకుడు పెంచిన ఏసీబీ అధికారులు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా సివిల్‌ ఆసుపత్రి కేంద్రంగా వెలుగుచూసిన సదరం స్కాంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఆర్‌డీఏ అధికారులు, సివిల్‌ ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించిన అధికారులకు దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఇంతకాలం సదరం సర్టిఫికెట్లను పింఛన్లు, ఆదాయ పన్ను మినహాయింపు, బస్‌పాస్, రైల్వేపాస్‌ల్లో రాయితీ కోసం తీసుకుంటున్నారని అంతా భావించారు.

కానీ.. విచిత్రంగా దర్యాప్తులో సరికొత్త నిజం వెలుగుచూసింది. ఈ సర్టిఫికెట్లను తీసుకున్న వారిలో సామాన్య ప్రజలు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని అధికారులు గుర్తించడం కేసును మరో మలుపు తిప్పింది. 

త్వరలోనే వీరి విచారణ..!
వాస్తవానికి సదరం స్కాం వెలుగుచూసిన సమయంలో 317 జీవో అమలులో ఉంది. ఆ సమయంలో చాలామంది ప్రభు త్వ ఉద్యోగులు తాము దివ్యాంగులమని అక్రమ మార్గంలో సర్టిఫికెట్లు పొందారు. ప్రస్తుతం ఏసీబీ సేకరించిన 22 మంది ప్రభుత్వ ఉద్యోగుల జాబితాను ఏసీబీ అధికారులు ఇప్పటికే తనిఖీ చేశారని సమాచారం. వీరు ఇటీవల జరిగిన బదిలీల్లోనూ ఈ సర్టిఫికెట్లను చూపినట్లు తెలిసింది. ఈ క్రమంలో బదిలీల లిస్టులో వీరు ఈ సర్టిఫికెట్లను కోరుకున్న స్థానాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారా? లేదా అని పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం వీరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు? ఏ స్థానంలో పనిచేస్తున్నారు? అన్న విషయాలపై దృష్టి సారించారు. ఈ విషయంలో వీరు ఒక నిర్ధారణకు వస్తే.. అప్పుడు వీరిని పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంది. దాంతోపాటు.. సర్టిఫికెట్లు కలిగి ఉన్న సివిల్‌ ఆసుపత్రి సిబ్బంది వెంటనే సమర్పించాలని వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఏసీబీ ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుందని సమాచారం.

22 మంది ప్రభుత్వ ఉద్యోగులు
2020 కరోనాకు ముందు సదరం సర్టిఫికెట్ల జారీ మొత్తం మ్యాన్యువల్‌ విధానంలో జరిగేది. 
► కరోనాతో 2020లో శిబిరాలు నిర్వహించలేదు. 
► 2020 ఫిబ్రవరి నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన స్లాట్లపై తీవ్ర దుమారం రేగింది. జారీ చేసిన సర్టిఫికెట్లలో అధికశాతం అనర్హులకు కేటాయించారన్న విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. 
► వాస్తవానికి ఈ కుంభకోణం మూలాలు 2015 నుంచే ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్‌లో డీఆర్‌డీఏ– సివిల్‌ ఆసుపత్రి వారు కుమ్మక్కై తమకు కావాల్సిన వారికే స్లాట్లు దక్కేలా చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. 
► ఈ ఏడాది వ్యవధిలో పొందిన సర్టిఫికెట్లలో మొత్తం 22 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని గుర్తించింది. వీరిలో దాదాపు 14 మంది కరీంనగర్‌కు నగరానికి చెందినవారే కావడం గమనార్హం. 
► మిగిలిన వారు చుట్టుపక్కల ఉన్న మండలాల్లో నివసిస్తున్నారు. వీరంతా పోయినేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ వరకు వివిధ క్యాంపుల్లో సర్టిఫికెట్లు తీసుకున్నారు. వీరి సర్టిఫికెట్లు అనుమానాస్పదంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు వీరి వ్యక్తిగత వివరాలు, ఫోన్‌నెంబర్లను సేకరించారు. 

మరిన్ని వార్తలు