అమెరికా టు కరీంనగర్‌.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో  దేశంలోనే రెండో బ్రాంచ్‌

16 May, 2022 10:21 IST|Sakshi

 సిటీలో పుష్కరకాలంగా అగ్రరాజ్యం కంపెనీ

ఇక్కడి బ్రాంచిని నడిపిస్తున్న సోదరులు

30 మంది సాఫ్ట్‌వేర్లకు లోకల్‌గా ఉపాధి

శోధించి సాధించాలన్న తపన ఉంటే ఎంతటి లక్ష్యమైనా చిన్నదైపోతుందని నిరూపించారు కరీంనగర్‌కు చెందిన అన్నదమ్ములు. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసి తామేందుకు కంపెనీ పెట్టకూడదన్న ఆలోచన చేశారు. వెంటనే ఆచరించారు. నేడు అగ్రరాజ్యానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీని కరీంనగర్‌ కేంద్రంగా నడుపుతూ 30మందికి ఉపాధినిస్తున్నారు.. కరీంనగర్‌ పాతబజార్‌కు చెందిన అన్నదమ్ములు శశిధర్, మనోజ్‌ కుమార్‌. అమెరికాకు చెందిన ఆ కంపెనీ బ్రాంచీలు దేశవ్యాప్తంగా బెంగళూర్‌లో ఒకటి ఉండగా.. రెండోది  కరీంనగర్‌ కావడం విశేషం.   
– కరీంనగర్‌టౌన్‌

కంపెనీ స్థాపనే లక్ష్యంగా
పన్నెండేళ్ల క్రితం మెట్రోనగరాలకే పరిమితమైన సాఫ్ట్‌వేర్‌ కంపెనీని కరీంనగర్‌లో సైతం నెలకొల్పాలనే సంకల్పాన్ని పెట్టుకున్నారు శశిధర్, మనోజ్‌ కుమార్‌. ఎంబీఏ పూర్తిచేసి 2010లో హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కొద్ది నెలల పాటు పని చేశారు. వీరి పనితనం చూసిన మరో కంపెనీ ప్రతినిధి ‘మీలో సత్తాఉంది.. సొంతంగా చేసుకోండి’ అంటూ... ఆ కంపెనీకి సంబంధించిన బ్రాంచి ఇచ్చాడు. ఏం ఆలోచించకుండా సహస్ర సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ పేరుతో కరీంనగర్‌కు 2010లోనే కంపెనీని తీసుకొచ్చారు.

ఇద్దరితో మొదలై..
2010లో కరీంనగర్‌లోని పాతబజార్‌లో సహస్ర సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ కంపెనీలో అన్నదమ్ములిద్దేరే ఉద్యోగులు. కేవలం రెండు కంప్యూటర్లతో రెండేళ్లపాటు ఇద్దరే రేయింబవళ్లు కష్టపడ్డారు. 2012లో కంపెనీస్థాయి పెరిగి, పనిభారం ఎక్కువ కావడంతో దశలవారీగా మరో ఆరుగురిని నియమించుకున్నారు. ప్రస్తుతం 30మంది సాఫ్ట్‌వేర్‌లతో సహస్ర సర్వీసెస్‌ కంపెనీ విజయవంతంగా ముందుకు సాగుతోంది.

లాక్‌డౌన్‌లో సైతం
సక్సెస్‌గా నడుస్తున్న తరుణంలో ఒక్కసారిగా కరోనా మహమ్మారి రాకతో ఆందోళ చెందాం. కంపెనీ పరిస్థిత ఎలా ఉండబోతుందోన్న టెన్షన్‌. అన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం ఇచ్చారు. మా కంపెనీ ఇవ్వలేదు. దీంతో మేం కొంత మందిని ఉద్యోగాలనుంచి తీసివేసి వర్క్‌ కొనసాగించాం. మా కష్టం ఫలించింది. కరోనాలోనూ బాగా నడిచింది. ప్రస్తుతం తీసేసిన వారందరిని మళ్లీ తీసుకున్నాం.                                – నేదునూరి శశిధర్‌

మరింత మందికి ఉపాధి
ఇద్దరితో మొదలై 30మందితో ప్రస్తుతం కంపెనీ నడిపిస్తున్నాం. భవిష్యత్‌లో మరింత మందికి ఉద్యోగాలివ్వడమే మా లక్ష్యం. కంపెనీని అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చి కరీంనగర్‌ పేరు అగ్రరాజ్యానికి వినపడేలా చేస్తాం. గతంలో కరీంనగర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అనగానే ఏదోలా చూసేవారు. నేడు ఐటీ టవర్‌ రావడం, పలు కంపెనీలు మేం ఉద్యోగాలు ఇస్తాం అంటూ ముందుకురావడం శుభపరిణామం.              – నేదునూరి మనోజ్‌ కుమార్‌

మరిన్ని వార్తలు