దీక్ష భగ్నంపై వైఎస్‌ షర్మిల ధ్వజం

17 Sep, 2021 03:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణికాలనీకి చెందిన ఆరేళ్ల బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన నిరాహారదీక్షను పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేశారు. ఆమెతోపాటు శిబిరంలో ఉన్న నాయకులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కాగా, శాంతియుతంగా దీక్ష చేస్తున్న షర్మిలను తరలించటంపై సింగరేణికాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని బుధవారం పరామర్శించిన షర్మిల ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ స్పందించాలంటూ ఆ కుటుంబం ఇంటి సమీపంలోనే దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.  

ధర్నా చేసే హక్కు లేదా?:  కేసీఆర్‌ పాలనలో శాంతియుతంగా ధర్నా చేసే హక్కు కూడా లేదా అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. ఆరేళ్ల చిన్నారికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించేందుకు వెళ్లిన తమను పోలీసులతో నిర్బంధించడాన్ని తాలిబన్ల చర్యగా ఆమె అభివర్ణించారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ..బాలిక హత్యాచార ఘటనపై తాము ఆందోళనకు దిగాకే ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించడం ఈ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు. కేసీఆర్‌ పాలనలో యువత ఆశయం లేకుండా కాలం వెళ్లదీస్తోందని, మత్తు మందులకు బానిసయ్యే దురవస్థ ఏర్పడిందన్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక మహిళలపై దాడులు  పెరిగాయని, మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు.  

చదవండి: సైదాబాద్‌ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ షర్మిల

మరిన్ని వార్తలు