సైదాబాద్‌ ఘటన: మత్తు రహిత సింగరేణిగా మారాలి

24 Sep, 2021 13:08 IST|Sakshi
సింగరేణి కాలనీ

సాక్షి, సైదాబాద్‌(హైదరాబాద్‌): సింగరేణి కాలనీలో చోటు చేసుకున్న చిన్నారి అత్యాచారం, హత్య ఉదంతం లాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ ప్రాంతంలో అక్రమ మద్యం, గుడుంబా, గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మత్తు రహిత సింగరేణికాలనీతోనే ఇక్కడ అనర్థాలు అంతం అవుతాయనే స్పృహ సింగరేణివాసుల్లో పెరగాలి.

స్థానిక సైదాబాద్‌ పోలీసులు, మలక్‌పేట ఎక్సైజ్‌ పోలీసులు ఇప్పటికైనా అక్రమ మత్తు పదార్థాల అమ్మకాలపై పటిష్ట చర్యలు తీసుకోవాలి. తమ ప్రాంతంలో సాగుతున్న అక్రమ వ్యాపారాలపై సింగరేణివాసులు ఇప్పటి నుంచి అయినా అధికారులకు పక్కా సమాచారం ఇవ్వాలి. 

మనకెందుకులే అనే ధోరణి వీడాలి 
సింగరేణి కాలనీలో అక్రమ మద్యం, గంజాయి అమ్మకాలు సాగుతుండటం బహిరంగ రహస్యమే. ఇక్కడి స్థానికులకు ఎవరు ఏమేమి అమ్ముతారో కూడా విధితమే. కానీ ఎవరూ ఏమి అమ్ముకుంటే మనకెందుకు అనే ధోరణిలోనే ఇంతకాలం ఉన్నారు. ఆ ధోరణి విడాలి. అమ్మకాల పక్కా సమాచారాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయటానికి వెనుకడుగు వేయొద్దు. అప్పుడే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చు. 

ఉక్కుపాదం మోపాల్సిందే... 
మత్తు రహిత సింగరేణికాలనీగా మార్చాలంటే అధికారులు కూడా అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో ఘటనలు జరిగినప్పుడో.. ఫిర్యాదులు వచ్చినప్పుడో లేక తమకు ఉన్నతాధికారులు టార్గెట్‌లు విధించినప్పుడో మొక్కుబడిగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయటం కాకుండా పక్కాప్రణాళికతో పటిష్ట చర్యలు తీసుకోవాలి.

తూతూమంత్రంగా కేసులు పెట్టడం కాకుండా మరోసారి నిషేధిత మత్తు పదార్థాలు అమ్మటానికి భయపడేలా చర్యలు తీసుకోవాలి. తరుచు దాడులు జరిపి అక్రమ వ్యాపారులకు తగిన శిక్షలు పడేలా చూస్తేనే లక్ష్యం సాధ్యమవుతుంది. 

ఐక్యతతో ఏదైనా సాధ్యం... 
సింగరేణికాలనీలో అన్ని పార్టీల, కుల, ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు. చిన్నారి ఘటనతో అందరూ సింగరేణివాసులతో ఏకమై పోరాడారు. వారి పోరాట ఫలితంగానే అన్ని పక్షాల అగ్రనాయకులు సింగరేణికి తరలి వచ్చారు. అందరి ఐక్యత కృషి వల్లనే బాధిత బాలిక కుటుంబానికి న్యాయం చేయగలిగారు. ఆ ఐక్యతను నాయకులు మరిచిపోవద్దు. అదే ఐక్యతను కొనసాగించి సింగరేణి కాలనీని మత్తురహితంగా మార్చాలి.

కఠిన చర్యలు తీసుకుంటాం 
సింగరేణికాలనీలో అక్రమంగా మత్తుపదార్థాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 15 మందిని న్యాయస్థానంలో బైండోవర్‌ చేశాం. మద్యం అమ్ముతున్న వారిపైన వారికి సహకరిస్తున్న షాపుల యజమానులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశా. అక్రమ వ్యాపారులు తమ తీరును మార్చుకోకుంటే వారిపై చార్జ్‌షీట్‌లు తెలరవటం, పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తాం. 

– సుబ్బిరామిరెడ్డి, ఇన్‌స్పెక్టర్, సైదాబాద్‌ పీఎస్‌ 

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి 
సింగరేణికాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చు. వాటిని సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు అనుసంధానం చేయాలి. మేము కూడా సింగరేణికాలనీలో మత్తుపదార్థాల అమ్మకాలు అరికట్టడానికి యువకులతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సంకల్పించాం. ఇక నుంచి ఇక్కడ ఎవరైనా అక్రమ అమ్మకాలు చేస్తే వెంటనే అలాంటి వారిపై అధికారులకు సమాచారం ఇస్తాం.

– కొర్ర మోతీలాల్‌నాయక్, అధ్యక్షుడు సేవాలాల్‌ బంజారా సంఘం

ఫిర్యాదులపై పోలీసులు స్పందించాలి 
సింగరేణికాలనీలో అక్రమ వ్యాపారులపై గతంలో ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు సరిగా స్పందించేవారు కాదు. అందువల్ల కూడా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సింగరేణిలో అక్రమ వ్యాపారంపై ఫిర్యాదులు చేయటానికి స్థానికులు సిద్ధంగా ఉన్నారు. సైదాబాద్‌ పోలీసులు, మలక్‌పేట ఎక్సైజ్‌ పోలీసులు ఫిర్యాదులపై సత్వరమే స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు 
తీసుకోవాలి.    

– నగరాగారి దేవదాసు, సింగరేణికాలనీ, డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు 

చదవండి: రాజు మృతి: సింగరేణి కాలనీ ఊపిరి పీల్చుకుంది

మరిన్ని వార్తలు