రాజును పోలీసులే చంపారు! నాకు, నా బిడ్డకు దిక్కెవరు?: మౌనిక

17 Sep, 2021 04:04 IST|Sakshi
రోదిస్తున్న రాజు కుటుంబసభ్యులు 

పోలీసులే చంపారు!

ఆత్మహత్యగా కట్టుకథ అల్లారు

రాజు భార్య మౌనిక, తల్లి ఈరమ్మ ఆరోపణ

సాక్షి, అడ్డగూడూరు: రాజును పోలీసులే చంపారని, ఆత్మహత్య అని కట్టుకథ అల్లి ప్రచారం చేస్తున్నారని అతడి భార్య మౌనిక, తల్లి ఈరమ్మ ఆరోపించారు. రాజును పట్టుకున్న పోలీసులు.. కోర్టుకు అప్పజెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగిందని అంటున్నారని.. మరి తమ కుటుంబం పరిస్థితి ఏమిటని నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

చంపేసి పట్టాలపై వేశారు: ఈరమ్మ
తన కొడుకు రాజును పోలీసులు పథకం ప్రకారమే చంపేశారని అతడి తల్లి ఈరమ్మ ఆరోపించింది. ‘‘నేను హైదరాబాద్‌లోని సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నప్పుడే.. నా కొడుకు రాజును పట్టుకున్నారని పోలీసులు అనుకుంటుంటే విన్నాను. కానీ చంపేసి రైలు పట్టాలపై వేశారు. ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథ అల్లారు. హైదరాబాద్‌లోని మా కొడుకు ఇంటిని చిన్నారి బంధువులు కూలగొట్టారు. మాకు తలదాచుకోవడానికి ఏ దిక్కూ లేకుండా పోయింది.’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.

నా బిడ్డకు న్యాయం చేయాలె..
తిరుమలగిరి (తుంగతుర్తి): రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తున్నారని, తన బిడ్డ బతుకు మాత్రం ఆగమైపోయిందని మౌనిక తల్లి యాదమ్మ వాపోయింది. సూర్యాపేట జిల్లా తిరు మలగిరి మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన ఆమె గురువారం మీడియాతో మాట్లాడింది. ‘‘రాజు నా బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పోయిన శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి పోలీసులు వచ్చి నా భర్తను, ఇద్దరు కొడుకులను, బిడ్డను తీసుకొనిపోయారు. ఈ బుధవారం రాత్రి పంపించారు. తెల్లారే సరికి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. నా బిడ్డ బతుకు ఆగమైపోయింది. ఆమెకు ఓ ఆడపిల్ల ఉంది. వారి భవిష్యత్తు ఏమైపోవాలి. ప్రభుత్వమే న్యాయం చేయాలి..’’ అని విజ్ఞప్తి చేసింది.

నాకు, నా బిడ్డకు దిక్కెవరు?: మౌనిక
కొద్దిరోజులుగా తాను తల్లిగారి ఇంట్లో ఉంటున్నానని రాజు భార్య మౌనిక తెలిపింది. ‘‘గత శుక్రవారం హైదరాబాద్‌ నుంచి పోలీసులు వచ్చి.. నన్ను, మా అత్తమ్మ, ఆమె బిడ్డ, బిడ్డ భర్తను తీసుకెళ్లారు. రాజు గురించి అడిగారు. వెతకడానికి మమ్మల్ని వెంట తీసుకెళ్లారు. మాతో తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని.. బుధవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ చౌరస్తాలో వదిలివెళ్లారు. అక్కడి నుంచి మేం భువనగిరికి బస్సులో వచ్చి.. ఓ బండి మాట్లాడుకుని గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అడ్డగూడూరుకు చేరుకున్నాం. కొద్దిగంటల్లోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. నా భర్తను పోలీసులే పొట్టన పెట్టుకున్నారు. కోర్టుకు అప్పగిస్తే శిక్ష అనుభవించేవాడు. ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగితే.. మరి మా కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. నాకు 11 నెలల కూతురు ఉంది. ఇప్పుడు మా ఇద్దరికి దిక్కెవరు?’’ అంటూ రోదించింది.

మరిన్ని వార్తలు