సాక్షి పరిశోధన: పెట్రోల్‌ బంకుల్లో టెక్నాలజీ ట్యాంపరింగ్‌ 

5 Jul, 2021 15:48 IST|Sakshi

అధికారులు సైతం కనిపెట్టలేని విధంగా ఆయిల్‌ డిస్పెన్సింగ్‌

యూనిట్లలో మార్పులు, చేర్పులు చేయిస్తున్న యజమానులు

మదర్‌బోర్డులోని ప్రతి సర్క్యూట్‌కు ‘తూట్లు’ 

డిస్‌ప్లేలో రీడింగ్‌ ఓకే.. ఆయిల్‌ డెలివరీలోనే షార్టేజ్‌

ప్రతి లీటర్‌కు కనీసం 50 నుంచి 100 ఎంఎల్‌ వరకు కోత  

నిత్యం కోట్ల రూపాయల్లో కొట్టేస్తున్న వైనం

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఒక ప్రైవేటు సంస్థలో పనిచేసే సైదాబాద్‌ కాలనీకి చెందిన నీల రవిచంద్ర ఎప్పుడూ తన ద్విచక్ర వాహనంలో మార్గంమధ్యలో గల జైళ్ల శాఖ నిర్వహించే చంచల్‌గూడ ఆయిల్‌ బంకులోనే పెట్రోల్‌ పోయించుకుంటాడు. కొలత సరిగా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది వాహనదారులు ఇక్కడ క్యూ కడుతుంటారు. రెండురోజుల క్రితం ఆ బంకును దాటేశాక బండిలో పెట్రోల్‌ దాదాపు అడుక్కి వచ్చిందన్న సంగతి రవిచంద్రకు గుర్తొచ్చింది. దీంతో దారిలో ఒక ప్రైవేటు బంక్‌లో పెట్రోల్‌ కొట్టిద్దామనుకుని, సరిగా కొడతారో లేదో అన్న అనుమానంతో ఒక లీటర్‌ మాత్రమే కొట్టించాడు.

అతని పాత మోటార్‌సైకిల్‌ లీటర్‌కు 40 కి.మీ మైలేజీ మాత్రమే ఇస్తుంది. దీంతో ఒక లీటరు ఆఫీసుకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునేందుకు, మరునాడు చంచల్‌గూడ వెళ్లే వరకు సరిపోతుందని భావించాడు. కానీ సాయంత్రం ఆఫీసు నుంచి తిరుగు ప్రయాణంలో, ఇంకాసేపట్లో ఇంటికి చేరుకుంటాడనగా వాహనం ఆగిపోయింది. దీంతో పెట్రోల్‌ ట్యాంక్‌ ఓపెన్‌ చేసి చూస్తే.. అతను అనుమానించినట్టే జరిగింది. ట్యాంక్‌ ఖాళీగా కన్పించడంతో బంకులో మోసం జరిగిందని గ్రహించాడు. 50 నుంచి 100 ఎంఎల్‌ వరకు పెట్రోల్‌ తక్కువ పోసి ఉంటారని అంచనా వేశాడు. 

రోజుకెంతో తెలుసా..! 
ఇలా ఒక వినియోగదారుడు ఒక లీటర్‌పై నష్టపోయేది కేవలం 50 నుంచి 100 మిల్లీలీటర్లే కావొచ్చు. కానీ ఈ తరహా మోసంతో కొన్ని బంకుల యజమానులు ఒక్క రోజులోనే కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున 40 లక్షల లీటర్లకు పైగా పెట్రోల్, 60 లక్షల లీటర్లకు పైగా డీజిల్‌ అమ్మకాలు సాగుతుంటాయి. ఈ లెక్కన చూస్తే రోజుకు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల లీటర్ల వరకు పెట్రోల్, మూడు లక్షల నుంచి ఆరు లక్షల లీటర్ల వరకు డీజిల్‌ను నొక్కేస్తున్నారన్నమాట. ప్రస్తుత ధరలతో లెక్కిస్తే పెట్రోల్‌పై రోజుకు దాదాపు రూ.2 కోట్ల నుంచి 4 కోట్లు, డీజిల్‌పై కూడా అటు ఇటుగా రూ. 3 కోట్ల నుంచి 6 కోట్లు వినియోగదారులు నష్టపోతున్నారన్నమాట.  

క్రమం తప్పకుండా పెరుగుతున్న ఇంధనం ధరలతో ఇప్పటికే అల్లాడిపోతున్న వాహనదారులను కొందరు పెట్రోల్‌ బంకుల యజమానులు నిలువునా మోసం చేస్తున్నారు. చాలా పెట్రోల్‌ బంకుల్లో డిజిటల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ల టెక్నాలజీ హైటెక్‌ ట్యాంపరింగ్‌ (సాంకేతికతలో మార్పులు, చేర్పులు) అధికారులు సైతం కనిపెట్టలేని విధంగా కొనసాగుతోంది. పలు రకాల ట్యాంపరింగ్‌తో డిస్‌ప్లేలో మీటర్‌ రీడింగ్‌ కరెక్ట్‌గానే చూపిస్తున్నా.. వాస్తవంగా డెలివరీ అయ్యే ఆయిల్‌ మాత్రం తక్కువగా ఉంటోంది.

ప్రధానంగా ముంబయి, కోయంబత్తూర్‌లలోని డిజిటల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థల్లో పనిచేసి మానేసిన సిబ్బంది, అలాగే  ప్రస్తుతం పనిచేస్తున్న కొందరు టెక్నీషియన్లు ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారు. వీరు చేసే ట్యాంపరింగ్‌ను మళ్లీ టెక్నీషియన్లు వచ్చి బహిర్గతం చేసి చూపిస్తే తప్ప గుర్తించడం కష్టమేనని చెబుతున్నారు. అయితే బంకుల డీలర్లు అత్యంత కట్టుదిట్టంగా చేస్తున్న డిజిటల్‌ టెక్నాలజీ ట్యాంపరింగ్‌ ట్రిక్కులు అనేకం ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశోధనలో బహిర్గతమయ్యాయి. 

తనిఖీ చేస్తే సరిగానే..
ఎప్పుడైనా అధికారులు కానీ, అనుమానంతో వినియోగదారులు కానీ కొలత వేయించినప్పుడు ఆయిల్‌ సరిగానే వచ్చే ప్రత్యేక ఏర్పాట్లు ఉండటంతో ఈ ట్యాంపరింగ్‌ను వెలుగులోకి తేవడం వినియోగదారుల
మాట అలా ఉంచితే సంబంధిత అధికారులకే దాదాపు అసాధ్యంగా మారుతోంది. 

ట్యాంపరింగ్‌ ఇలా.. 
సాఫ్ట్‌వేర్‌ మార్చేస్తున్నారు.. 
పెట్రోల్‌ బంకు డిస్పెన్సెంగ్‌ యూనిట్‌లో గల కంట్రోల్‌ బోర్డులోని కేబుల్‌ ఇన్‌పుట్‌ వైర్‌ ద్వారా,  మెయిన్‌ చిప్‌కు అదనంగా మైక్రో చిప్‌ ఏర్పాటు చేసి  సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ మార్పిడికి పాల్పడుతున్నారు. యూనిట్‌ బయట ఉండే కీ ప్యాడ్‌తో ఆపరేట్‌ చేస్తున్నారు. దీంతో ముందే ఏర్పాటు చేసుకున్న కోడ్‌ మేరకు సర్దుబాటు చేసిన కొలతల ప్రకారం (లీటర్‌కు 50 ఎంఎల్‌ నుంచి 100 ఎంఎల్‌ కోత పడేలా) ఆయిల్‌æ డెలివరీ అవుతోంది. డిస్‌ప్లే బోర్డులో కొలత సక్రమంగానే చూపించినా డెలివరీ మాత్రం సర్దుబాటు చేసిన ప్రకారమే అవుతోంది. ప్రస్తుతం చాలా బంకుల్లో ఈ టెక్నాలజీ ట్యాంపరింగ్‌ ద్వారానే మోసం జరుగుతోంది. మరి కొందరు యాజమానులు యూనిట్‌లో మెజరింగ్‌ సిస్టమ్‌ (పల్సర్‌ విభాగం)కు సర్క్యూట్‌తో కూడిన అదనపు కేబుల్‌ను అనుసంధానించి, కీ ప్యాడ్‌కు కనెక్ట్‌ చేయడం ద్వారా పంప్‌ను ఆపరేట్‌ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది. 

అదనపు సర్క్యూట్‌.. 
డిస్పెన్సింగ్‌ యూనిట్‌లో ఆయిల్‌ పరిమాణాన్ని, విలువను సూచించే డిస్‌ప్లే బోర్డులో అదనపు సర్క్యూట్‌ ఏర్పాటు ద్వారా మెజర్‌మెంట్‌ కౌంట్‌ కమాండ్‌ (కొలత)లో మార్పు చేయడం, రీడింగ్‌ తెలియచేసే డిజిటల్‌ అనలాగ్‌ వద్ద సిమ్‌ కార్డును పోలి ఉండే చిప్‌ అమర్చడం ద్వారా డిస్‌ప్లే బోర్డులో కొలత కరెక్టుగానే చూపించేలా చేస్తూ ఆయిల్‌ మాత్రం తక్కువ పోస్తున్నారు. 

ఇన్‌స్టెంట్‌ అప్లికేషన్‌  ఇన్‌స్టాలేషన్‌
మదర్‌ బోర్డులో అప్లికేషన్‌ ఇన్‌స్టాలేషన్‌ ట్యాంపరింగ్‌ గతేడాదే బయటపడినా.. ఇంకా పలు బంకుల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూనే ఉంది. 

 ఫిక్స్‌డ్‌ పల్సర్‌ వచ్చినా.. 
ట్యాంపరింగ్‌ నివారణకు ఆప్టికల్‌ పల్సర్‌ స్థానంలో ఫిక్స్‌డ్‌ పల్సర్‌ తెచ్చారు. అయితే దీనికి కూడా కేబుల్‌ అనుసంధానం, ఇతరత్రా ఏర్పాట్లతో అక్రమాలు కొనసాగిస్తున్నారు.  ఆయిల్‌ కొలతకు  ఈ పల్సర్‌ అనే పరికరం కీలకం. ఈ పల్సర్‌లో ట్యాంపరింగ్‌ ద్వారా కొలతల్లో హెచ్చుతగ్గులు చేస్తుంటారు. పల్సర్‌లో చిన్న చక్రం లాంటి పరికరం తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగేటప్పుడు చిన్న లైటు వెలుగుతుంటుంది. (బ్లింక్‌) ఒకసారి బ్లింక్‌ అయితే 2.5 ఎంఎల్‌ ఆయిల్‌ డెలివరీ అవుతుంది. అయితే పల్సర్‌లో అదనపు చిప్‌ ఏర్పాటు ద్వారా బ్లింకింగ్‌ సమయాన్ని తగ్గిస్తారు. దీనితో తక్కువ ఆయిల్‌ డెలివరీ అవుతుంది. 

డిస్పెన్సింగ్‌ యూనిట్‌లో కీలకమైన ప్రాసెసింగ్‌ యూనిట్‌గా మదర్‌బోర్డు పనిచేస్తుంది. ఇందులోని కన్ఫిగరేషన్, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్, మైక్రో కంట్రోల్, బైపాస్‌ కేబుల్, రిమోట్‌ సిస్టమ్, కీ ప్యాడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌.. ఇలా మదర్‌ బోర్డులోని ప్రతి టెక్నాలజీని ట్యాంపర్‌ చేస్తున్నారు. 

మదర్‌ బోర్డులోని ఐసీ సర్క్యూట్‌ ద్వారా ‘ఇన్‌స్టెంట్‌ (తాత్కాలిక) అప్లికేషన్‌’ ఇన్‌స్టాలేషన్‌ చేయడంతో అడ్జెస్ట్‌ చేసిన మెజర్‌మెంట్‌ ప్రకారం ఆయిల్‌ డెలివరీ అవుతోంది. తనిఖీల సమయంలో లేదా వినియోగదారులు డిమాండ్‌ చేసిన సమయంలో డిస్పెన్సింగ్‌ యూనిట్‌ ఒకసారి ఆఫ్‌ చేసి మళ్లీ ఆన్‌ చేస్తే ఇన్‌స్టెంట్‌ అప్లికేషన్‌ ఎగిరిపోయి సరైన మెజర్‌మెంట్‌ ప్రకారం ఆయిల్‌ డెలివరీ అవుతోంది. తనిఖీలు ముగిసిన తర్వాత మళ్లీ నిపుణులను పిలిపించి ఇన్‌స్టెంట్‌ అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేయిస్తున్నారు. 

 కరెంటు వోల్టేజీ నియంత్రణతో 
డిస్పెన్సరీ యూనిట్లు విద్యుత్‌ సరఫరా పైనే ఆధారపడి పనిచేస్తాయి. డిపార్ట్‌మెంట్‌ సీలు వేయని కరెంట్‌ వైర్ల ద్వారా  వోల్టేజీ లో మార్పు చేసి  మెజర్‌మెంట్‌ సర్దుబాటుతో  మోసాలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. 

ఇలా కూడా..సీల్‌కు సోల్డరింగ్‌ 
యూనిట్‌లో ఉండే మదర్‌ బోర్డు, కీ ప్యాడ్, కంట్రోల్‌ కార్డు, పల్సర్, కంట్రోల్‌ కార్డు ఇలా ప్రతి దానికీ సీల్‌ వేస్తారు. అయితే సోల్డరింగ్‌ చేయడం ద్వారా సీల్‌ వైర్‌ బ్రేక్‌ చేస్తున్నారు. చేయాల్సిన ట్యాంపరింగ్‌ చేసి తిరిగి సోల్డరింగ్‌ ద్వారా అవసరమైతే అదే రకమైన కొత్త వైర్‌ కనెక్ట్‌ చేస్తున్నారు.  

టెక్నీషియన్లకు లక్షలు..
ఇంతకుముందు డిజిటల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్ల తయారీ కంపెనీల్లో పనిచేసి వివిధ కారణాలతో బయటకొచ్చిన టెక్నీషియన్లు ట్యాంపరింగ్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. సాధారణంగా డిజిటల్‌  డిస్పెన్సింగ్‌ యూనిట్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసినా, అదనంగా చిన్న పరికరం అమర్చినా.. టెక్నికల్‌ ఎర్రర్‌గా చూపిస్తూ యూనిట్‌ పని చేయడం మానివేస్తుంది. యూనిట్‌ హిస్టరీ (లావాదేవీల వివరాలు) సైతం పాడవుతుంది. ఎప్పటికప్పుడు ఇంధన ధరల హెచ్చు తగ్గులు కూడా కంపెనీ ఆన్‌లైన్‌ ఆటోమేషన్‌ ద్వారానే జరిగిపోతుంటాయి.

అందువల్ల సాధారణంగా ఎలాంటి ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు. కానీ, ఈ మాజీ టెక్నీషియన్లు తమ నైపుణ్యంతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కనీసం హిస్టరీలో ఎలాంటి తేడాలు రాకుండా, పంప్‌లో ఎలాంటి ఎర్రర్‌ తలెత్తకుండా పని కానిచ్చేస్తున్నారు. గతంలో కొందరు ముంబయి, బెంగళూరు కేంద్రాలుగా పనిచేసే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు విదేశాల నుంచి చిప్స్, సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేసి మాజీ మెకానిక్‌ల సహకారంతో అక్రమ తంతు నడిపిస్తూ పట్టుబడ్డారు. అయితే లక్షల్లో ముడుతుండటంతో.. తాజాగా మాజీ టెక్నీషియన్లే ట్యాంపరింగ్‌ దందాకు పాల్పడుతున్నారు.  

5 లీటర్లకు 25 ఎంఎల్‌కు మించి తక్కువ రాకూడదు 

తూనికలు కొలతల శాఖ నిబంధన ప్రకారం.. ఏదైనా బంకులో 5 లీటర్ల ఆయిల్‌ పోశారనుకుంటే 25 ఎంఎల్‌కు మించి తక్కువ రాకూడదు. ఒక వేళ అలా వస్తే తక్షణమే సంబంధిత డిస్పెన్సింగ్‌ నాజిల్‌ను సీజ్‌ చేసి నోటీసు జారీ చేస్తారు. బంకు యాజమాని సంజాయిషీ ఆధారంగా కనీసం రూ.2,500 నుంచి రూ.25 వేల వరకు కాంపౌండింగ్‌ జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు కేసులు కూడా నమోదు చేసి కోర్టుకు నివేదించే అవకాశం ఉంటుంది. 

సిబ్బంది.. సాంకేతిక పరిజ్ఞానం కొరత
చిప్‌లు, రిమోట్లతో మోసం ఎప్పుడో బయటపడినా ఇప్పటికీ అనేకచోట్ల కొనసాగుతూనే ఉంది. మదర్‌బోర్డులోని వేర్వేరు ప్రదేశాల్లో చిప్‌లు, ఇతరత్రా ఏర్పాట్లతో అక్రమ దందా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా తూనికలు, కొలతల విభాగం పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గత నాలుగేళ్ల నుంచి తనిఖీలు మొక్కుబడిగా మారాయి. ఈ విభాగానికి పూర్తిస్థాయి రాష్ట్ర కంట్రోలర్‌ లేకుండా పోయాడు. మరోవైపు సిబ్బంది కొరత కూడా వెంటాడుతోంది. మొత్తం 254 పోస్టుల్లో 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అందులో క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించే 39 ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల్లో 23 ఖాళీగా ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తనిఖీల కోసం ఏర్పడిన రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు సారథ్యం వహించిన అప్పటి అసిస్టెంట్‌ కంట్రోలర్‌ భాస్కర్‌ బంకులపై పెద్దయెత్తున దాడులకు దిగడంతో.. డీలర్లకు సమ్మెకు సైతం సిద్ధం కావడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం మొక్కుబడిగా దాడులు జరుగుతున్నా స్వల్ప సంఖ్యలో మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. 

సాంకేతిక పరిజ్ఞానం కూడా లేదు 
పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్లను తనిఖీ చేసి స్టాంపింగ్, సీలింగ్‌ వేసే తూనికల కొలతల శాఖ అధికారులకు కనీస సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం పెట్రోల్‌ బంకు అక్రమార్కుల పాలిట వరంగా తయారైంది. పదేళ్ల క్రితమే డిజిటల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌లు ఏర్పాటయ్యాయి. ఇప్పటికీ డిపార్ట్‌మెంట్‌లో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్, రీజినల్‌ కంట్రోలర్లను వేళ్లపై లెక్కించవచ్చు. మరోవైపు తూనికలు కొలతల శాఖకు మీటర్‌ యూనిట్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఆడిటింగ్‌కు అధికారం లేకపోవడంతో, ఆధునిక టెక్నికల్‌ ట్యాంపరింగ్‌ను గుర్తించడంలో విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. 

వినియోగంలో హైదరాబాద్‌ టాప్‌.. 
రాష్ట్ర పెట్రోల్, డీజిల్‌ వినియోగంలో హైదరాబాద్‌ వాటా సగానికి పైనే. రాష్ట్రం మొత్తం మీద మూడు ప్రధాన కంపెనీలకు చెందిన 4,710 బంకులు ఉండగా, అందులో నగరంలోనే 580కి పైగా బంకులున్నాయి. హైదరాబాద్‌ శివార్లలోని ఘట్‌కేసర్, నాచారం, చర్లపల్లిలోని ఐవోసీ, బీపీసీ, హెచ్‌పీసీఎల్‌ ఆయిల్‌ కంపెనీల టెర్మినల్‌ డిపోల నుంచి ప్రతినిత్యం పెట్రోల్‌ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్ల ద్వారా ఇంధనం సరఫరా అవుతోంది. ఒక్కో ట్యాంకర్‌ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. సుమారు 50 లక్షల లీటర్ల పెట్రోల్, 40 లక్షల లీటర్ల డీజిల్‌ సరఫరా అవుతోంది. ప్రతిరోజూ నగరంలో సగటున 27 నుంచి 30 లక్షల లీటర్ల పెట్రోల్, 30 నుంచి 33 లక్షల డీజిల్‌  వినియోగమవుతోంది. 


దాడుల్లో భాగంగా డిస్పెన్సింగ్‌ యూనిట్‌ను తనిఖీ చేస్తున్న అధికారులు (ఫైల్‌)

ఒక్క చిప్‌ ఏర్పాటుకు రూ. లక్ష పైనే..
వినియోగదారుల్లో నిలదీసే తత్వం పెరగాలి 
టెక్నాలజీ ట్యాంపరింగ్‌ను గుర్తించడం అంత సులువు కాదు. వినియోగదారులే అప్రమత్తంగా ఉండాలి. ఆయిల్‌ తక్కువగా పంపింగ్‌ అవుతున్నట్లు ఆనుమానం వస్తే వెంటనే నిలదీయాలి. అధికారులకు ఫిర్యాదు చేయాలి. బంకులు.. ఆయిల్‌ కంపెనీ, తూనికలు కొలతలు, స్థానిక అధికారుల ఫోన్‌ నంబర్లను  ప్రదర్శించని పక్షంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడే మోసాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. 
–విమల్‌ బాబు, రీజినల్‌ డిప్యూటీ కంట్రోలర్, తూనికలు, కొలతల శాఖ 

 ఎనిమిది ఏళ్ల క్రితమే వెలుగులోకి..
మాన్యువల్‌ యూనిట్ల ద్వారా జరుగుతున్న చేతివాటానికి అడ్డుకట్ట వేసేందుకు డిజిటల్‌ పంపులు ప్రవేశపెడితే అధికారుల ఊహకు సైతం అందని సాంకేతిక మోసం దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే బయటపడింది. అప్పట్లో యూనిట్లలో ఆప్టికల్‌ పల్సర్‌ ఉండటంతో అక్రమార్కులు సాఫ్ట్‌వేర్‌కు అనుగుణంగా డిజై¯Œ చేసిన అదనపు చిప్‌లను అమర్చేవారు. రిమోట్‌ సెన్సర్‌తో పల్సర్‌కు అనుసంధానం చేసి దానిని కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ఆపరేట్‌ చేస్తూ ఆయిల్‌ డెలివరీని నియంత్రిస్తుండేవారు. రెండు స్విచ్‌లతో కూడిన రిమోట్‌లో ఒక స్విచ్‌ నొక్కగానే నకిలీ చిప్‌ పనిచేసి తక్కువ ఆయిల్‌ డెలివరీ అయ్యేది. వినియోగదారులు క్యాన్లు, సీసాలతో వచ్చినప్పుడు, అధికారులు తనిఖీలకు ఐదు లీటర్ల క్యాన్‌తో వచ్చినప్పుడు రిమోట్‌లోని మరో స్విచ్‌ నొక్కితే ఇంధనం కరెక్టుగా డెలివరీ అయ్యేది. మొత్తం మీద వంద లీటర్లు పెట్రోల్, డీజిల్‌ పోస్తే దాదాపు పది లీటర్లు మిగులుబాటు అయ్యే విధంగా మైక్రో చిప్స్‌లో సాఫ్ట్‌వేర్‌ డిజై¯Œ  చేసినట్లు బహిర్గతం కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. 

ఎలా బయటపడింది 
హైదరాబాద్‌ శివారులో 2013 జనవరి 26న సైబరాబాద్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు (ఎస్‌వోటీ) వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బ్యాగుల్లో వందల సంఖ్యలో రిమోట్స్‌ చిప్స్‌ బయటపడ్డాయి. అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆయిల్‌ బంకుల డిస్పెన్సింగ్‌ యూనిట్ల తయారీ కంపెనీలకు చెందిన మాజీ టెక్నికల్‌ సిబ్బందిగా తేలింది. డిస్పెన్సింగ్‌ యూనిట్‌ ద్వారా ఆయిల్‌ డెలివరీ సమయంలో సరఫరాను నియంత్రించేందుకు చిప్‌లు, రిమోట్లు ఉపయోగిస్తున్నట్లు వారు వెల్లడించారు. నగరంలోని పలు పెట్రోల్‌ బంకులకు ఆర్డర్‌పై చిప్‌లు, రిమోట్లు తెస్తున్నామని చెప్పారు. అప్పటికే పలు బంకుల్లో చిప్‌లు అమర్చినట్లు కూడా బయటపెట్టారు. ఈ నేపథ్యంలో పలు బంకులపై అధికారులు దాడులు చేసినప్పుడు మోసం బట్టబయలైంది. 

ఒక్క చిప్‌ ఏర్పాటుకు రూ. లక్ష పైనే..
ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా డిస్పెన్సరీ యూనిట్‌లో ఇంటిగ్రేటెడ్‌ చిప్‌లు అమర్చి తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు కొన్ని నెలల క్రితం బయటపడింది. అప్పట్లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ నేతృత్వంలో పోలీసులు, ఎస్‌ఓటీ టీమ్స్‌ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తూనికలు కొలతల శాఖ అధికారుల సహకారంతో అకస్మిక వరుస దాడులకు దిగాయి . రాష్ట్రంలోని హైదరాబాద్‌ తోపాటు రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, ఆర్‌సీపురం తదితర బంకుల్లో ఆధునిక చిప్‌ల వ్యవహారం బయటపడింది. మీటరింగ్‌ యూనిట్‌ డిస్‌ప్లే వెనుక భాగం ఇంటిగ్రేటెడ్‌ చిప్‌ అమర్చి 1000 ఎమ్‌ఎల్‌ పెట్రోల్‌కు  970 ఎమ్‌ఎల్‌ మాత్రమే డెలివరీ అయ్యే విధంగా సర్ధుబాటు చేశారు.

తనిఖీలో గుర్తించని విధంగా మదర్‌ బోర్డును తయారు చేసి అమర్చినట్లు మోసాలకు పాల్పడుతున్నట్లు బహిర్గతమైంది. ముంబైకి చెందిన సాంకేతిక నిపుణులు ఆప్‌డేట్‌ టెక్నాలజీకి అనుగుణంగా సాఫ్ట్‌వేర్,  ప్రోగ్రాం డిజైన్‌ చేసి ముఠా ద్వారాఒక్కో చిప్‌ అమర్చేందుకు రూ. 80 వేల నుంచి రూ.లక్షా 20 వేల వరకు వసూలు చేసినట్లు విచారణలో తెలింది. దీంతో అప్పట్లో రాష్ట్రంలో 11, ఏపీలో 22 బంకుల్ని సీజ్‌ చేసి బంకుల్లో చిప్‌లు అమర్చే మెకానిజం చేసిన ముఠా సభ్యులతో పాటు తొమ్మిది పెట్రోల్‌ బంకుల యజమానులను సైతం అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి పంపడం సంచలనం సృష్టించింది. ఇది కొన్ని  చోట్ల ఇప్పటికీ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు