'ఆటల్లేవ్‌... పోటీల్లేవ్‌'.. పిల్లలకు బోర్‌ కొట్టిస్తున్న సంక్రాంతి సెలవులు

10 Jan, 2022 03:19 IST|Sakshi

విద్యార్థుల ఉత్సాహానికి కరోనా కళ్లెం.. అమ్మమ్మ ఇంటికెళ్లినా తప్పని ఆంక్షలు

ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌కే వెచ్చిస్తున్న పిల్లలు

ఆన్‌లైన్‌ గేమ్స్‌తో కాలక్షేపం.. ఎప్పటికప్పుడు కొత్తవాటి కోసం వెతుకులాట

పుస్తక పఠనంపై దృష్టి మళ్లించాలంటున్న ఉపాధ్యాయులు

సాక్షి, హైదరాబాద్‌: ‘సెల్‌ ఫోన్‌తో ఆడుకోవడం లేదా డల్‌గా పడుకోవడం’.. ప్రస్తుత సంక్రాంతి సెలవుల్లో పిల్లలు చేసేది ఇదే అంటున్నారు చాలామంది తల్లిదండ్రులు. కరోనా పుణ్యమాని ఉత్సాహంగా ఊరెళ్లే పరిస్థితి లేదు. ఆనందంగా అయిన వాళ్లను రమ్మనే అవకాశం లేదు. కనీసం పక్కింటి పిల్లలతో ఆడుకుందామన్నా ఆందోళన.. వెరసి సంక్రాంతి సెలవులు విద్యార్థులకు బోర్‌ కొట్టిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అర్ధరాత్రి వరకు సెల్‌ పట్టుకుని, అదే పనిగా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతుంటే మౌనంగా చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోయారు. సరే అని కట్టడి చేస్తే ఏదో కోల్పోయినట్టుగా ఉండిపోతున్నారని చెప్పారు. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు కనీసం పక్కింటి పిల్లలతో ఆడుకోవడానికి కూడా సంశయించాల్సి వస్తోంది. కరోనా పరిస్థితుల్లో వచ్చిన సంక్రాంతి సెలవుల్లో స్కూల్‌ పిల్లల దిన చర్యను ‘సాక్షి’క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కొన్ని ప్రాంతాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను పలకరించింది. 

ఇంట్లో బందీగా పిల్లలు
‘ఇది వరకు సంక్రాంతి సెలవులొస్తే చాలు పిల్లాడిని పట్టుకోవడం కష్టంగా ఉండేది. పొద్దున లేస్తే గాలి పటాల గోలే. ఇప్పుడు ఇల్లు కదలడం లేదు. బయట కూడా అంతా సందడిగా ఉండేది. ఇప్పుడా వాతావరణం లేదు..’ అని వరంగల్‌ పట్టణానికి చెందిన లలిత చెప్పారు. కరోనా భయంతో పిల్లల్ని ఇల్లు కదలనివ్వడం లేదు. ఇంటికి వేరే పిల్లల్నీ రానివ్వడం లేదు. పక్క పక్క ఇళ్ళవాళ్ళయితే కాస్త సర్దుకుపోతున్నారు. అదీకూడా వాళ్ళింటికి కొత్తవాళ్ళు ఎవరూ రాకపోతేనే. నిజానికి సంక్రాంతి పండగొస్తే పోస్టాఫీసు కాలనీ మొత్తం హడావిడిగా ఉంటుందని, ఎక్కడెక్కడి నుంచో గాలి పటాలు ఎగరెయ్యడానికి, ఆటల పోటీల్లో పాల్గొనడానికి వస్తుంటారని హన్మకొండ పోస్టాఫీసు కాలనీకి చెందని రవి తెలిపారు. ఇప్పుడు అవేవీ కన్పించడం లేదని అన్నారు. పక్క వీధిలోని ఫ్రెండ్‌ ఇంటికి తన కొడుకు వస్తానంటే, అతని తల్లిదండ్రులు ‘రోజులు బాగోలేవు కదా’అని సున్నితంగా వద్దని చెప్పారని వెల్లడించారు. రెండేళ్ళ క్రితం చూసిన ముగ్గుల పోటీలు, కబడ్డీ ఆటలు, కుస్తీ పోటీలు ఏవీ పిల్లలు ఎంజాయ్‌ చేసే పరిస్థితి కన్పించడం లేదని అన్నారు. 

అమ్మమ్మ ఇంటికెళ్ళినా అదే సీన్‌...
‘నేనొచ్చానని అమ్మమ్మ ఎన్నో పిండి వంటలు చేసింది. కొత్త దుస్తులూ కొన్నది. కానీ ఇల్లు మాత్రం దాటనివ్వడం లేదు..’అని కరీంనగర్‌ జిల్లా కమాన్‌పూర్‌లో అమ్మమ్మ ఇంటికొచ్చిన 9వ తరగతి విద్యార్థి రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిజానికి ఆ ఊళ్ళో వారం రోజులుగా పరిస్థితి బాగాలేదు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్నిచోట్ల మనవళ్లు, మనవరాళ్లు ఊరికి వస్తామన్నా వద్దన్న ఘటనలున్నాయి. ఖమ్మం పట్టణంలో ఉంటున్న చంద్రం దంపతులు.. తమ ఇంటికి హైదరాబాద్‌ నుంచి మనవడు, మనమరాలు సంక్రాంతికి వస్తామన్నా.. వద్దన్నారు. ‘రోజులు బాగోలేవు. ఇక్కడ వాళ్ళకు ఏవైనా వచ్చినా వాళ్ళనే అంటారు. వాళ్ళకు ఏమైనా అయినా మాటొస్తుంది’అని చంద్రం వ్యాఖ్యానించారు. 

కొత్త గేమ్స్‌ కోసం వేట
లాక్‌డౌన్‌లో విద్యార్థులు ఆడే గేమ్స్‌పై సూపర్‌ స్కూల్స్‌ అనే సంస్థ ఓ సర్వే చేపట్టింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ విషయంలోనూ పిల్లల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆ సంస్థ సీఈవో భానూ ప్రసాద్‌ తెలిపారు. పబ్జీ, క్యాండీ క్రష్, యాంగ్రీ బర్డ్, సబ్‌వే సర్ఫర్స్, టెంపుల్‌ రన్‌ వంటి ఆటలు వాళ్ళకు పెద్దగా కిక్కెకించడం లేదు. దీంతో కొత్త కొత్త గేమ్స్‌ ఏమొచ్చాయా అనే దిశగా నెట్‌లో వెతుకుతున్నారు. కరోనా కారణంగా బయటకెళ్ళే అవకాశం లేకపోవడంతో 24 గంటలూ సెల్‌ఫోన్‌ గేమ్స్‌పై ఆధారపడుతున్నారని సర్వేల్లో తేలింది. సంక్రాంతి సెలవుల్లోనూ ఇదే కన్పిస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గేమ్స్‌ మోజులో నెట్‌ లింక్స్‌ తెలియకుండా క్లిక్‌ చేస్తే తలిదండ్రుల బ్యాంకు సమాచారం తెలుసుకుని, సైబర్‌ నేరగాళ్ళు దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

పిల్లల మానసిక స్థితిపై ప్రభావం 
కరోనా కాలంలో పిల్లలకు ఆన్‌లైన్‌ విద్య కోసం తల్లిదండ్రులే ఫోన్లు కొనిచ్చారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో అది అంతర్భాగమైంది. సెలవులొస్తే చాలు ఫిజికల్‌ గేమ్స్‌ గురించి వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కరోనా ఉధృతి దీనికి మరింత అవకాశం ఇచ్చింది. ఎంతసేపూ మొబైల్‌ పట్టుకుని కాలం గడిపేస్తున్నారు. ఇది విద్యార్థి మానసిక స్థితిలో మార్పు తెస్తుంది. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి
– పణితి రామనాథం (ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, బూర్గుంపాడు, కొత్తగూడెం జిల్లా) 

సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలి 
సెల్‌ ఆటలే విద్యార్థులకు శరణ్యం అయినట్టయ్యింది. అయితే ఇవి హద్దుమీరడానికి నియంత్రణ లేకపోవడమే కారణం. పిల్లల్ని తల్లిదండ్రులు అలా వదిలేయకూడదు. వాళ్ళ బాగుకోరి కొంతసేపైనా సెలవుల్లో పుస్తకాల పఠనం వైపు దృష్టి మళ్లించే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులూ వాళ్ళతో ఆడుకుంటూ, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండేలా చేయడం మంచిది. 
– శ్రీధర్‌ (భారత్‌ పబ్లిక్‌ స్కూల్, కోదాడ)  

మరిన్ని వార్తలు