ప్రయాణాలపై ఆంక్షలెందుకు?

5 Dec, 2021 04:04 IST|Sakshi

జీనోమ్‌ సీక్వెన్స్‌ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు 

90 శాతం జనాభాలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందాయి 

బూస్టర్‌ డోస్‌తో రక్షణ 

సాక్షి ఇంటర్వ్యూలో ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ అధిక వ్యాప్తి, తీవ్రత గురించి ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) ఆసుపత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయనే కారణంగా లాక్‌డౌన్లు, దేశవిదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఇప్పటికే రెండు వేవ్‌లలో లాక్‌డౌన్‌ అనుభవాలు చూసినందున మరోసారి విధిస్తే చాలా నష్టాలుంటాయని పేర్కొన్నారు.

ఒమిక్రాన్‌తో సహా కరోనా వేరియెంట్‌ ఏదైనా దాని నియంత్రణకు ప్రధానంగా మాస్క్, భౌతిక దూరం దోహదపడతాయన్నారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలోనే ఎస్‌–యాంటీజెన్‌ అనేది ఉందా లేదా అన్న దాని ప్రాతిపదికన అది ఒమిక్రానా కాదా అన్నది తేల్చేయొచ్చని చెప్పారు. ప్రతీదాన్ని జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌ చేసి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. దక్షిణాఫ్రికాలోనూ ఇలాగే బయటపడిందని తెలిపారు. ఇప్పటికే దేశం లో 90 శాతం మందిలో యాంటీబాడీస్‌ ఏర్పడినందున థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాల్లేవన్నారు. ఇంటర్వ్యూ లోని ముఖ్యాంశాలు ఇలా..  

సాక్షి: భారత్‌పై ఒమిక్రాన్‌ ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది? 
నాగేశ్వర్‌: భారత్‌లోకి ఇప్పటికే ఇమిక్రాన్‌ ప్రవేశించింది. టీకాలు తీసుకున్న వారిపై దీని ప్రభావం స్వల్పంగా ఉంటుంది. నవంబర్‌ 9న బోట్స్‌వానాలో, 11న దక్షిణాఫ్రికాలో బయటపడినా, కొన్ని శాంపిల్స్‌ పరిశీలిస్తే అక్కడ అక్టోబర్‌ నుంచే ఉన్నట్టుగా వెల్లడైంది. ప్రస్తుతం 33 దేశాల్లో ఈ వేరియెంట్‌ ఉంది. దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణంలో మురుగునీటిలో నిర్వహించిన పరీక్షల్లో ఈ వైరస్‌ జాడలు ఎక్కువగా కనిపిస్తున్నా, ఆ మేరకు కేసులు పెరగడం లేదు.

దీన్నిబట్టి వైరస్‌ చాలా బలహీనంగా ఉండటంతో లక్షణాలు కూడా స్వల్పంగానే ఉన్నట్టు స్పష్టమవుతోంది. అక్కడ యువతరంలోనే ఎక్కువ కేసులు బయటపడ్డాయి. అయితే, వారిలో తీవ్రస్థాయికి చేరడం లేదు. వృద్ధుల విషయానికొస్తే వారిపై ఈ వేరియెంట్‌ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వారిపైనా తీవ్ర ప్రభావం చూపకపోతే మన దేశంలోనూ వృద్ధులకు సోకినా అంతగా భయపడాల్సిన అవసరం ఉండదు.  

ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి ? 
ఒమిక్రాన్‌ సోకిన వారు రుచి, వాసన కోల్పోవడం లేదు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు మాత్రమే ఎక్కువగా ఉంటున్నాయి. రుచి, వాసన పోకపోతే వ్యాధి మైల్డ్‌గా ఉన్నట్టుగా భావించాలి. అందువల్ల ఏదో ఊహించుకుని భయాందోళనలకు గురికావొద్దు.  

మ్యుటేషన్లు పెరిగితే ప్రమాదమా? 
స్పైక్‌ప్రొటీన్‌లో 32 మ్యుటేషన్లు రావడం వల్ల అధికవ్యాప్తితో ఎక్కువమందికి సోకుతుంది. దీంతోపాటు ఒకరి నుంచి మూడురెట్లు వ్యాప్తికి అవకాశం ఉంటుంది. దక్షిణాఫ్రికాలోని వైద్యులతో నేను మాట్లాడినప్పుడు గత 10, 15 రోజులుగా సీరియస్‌ కేసుల నమోదు లేదని చెప్పారు. అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగినా క్రమంగా అవి తగ్గిపోతాయి. మరో 15 రోజుల్లోనే ఒమిక్రాన్‌కు సంబంధించి పూర్తి స్పష్టత రానుంది.  

టీకాల ప్రభావశీలత గుర్తించేందుకు ఎలాంటి అధ్యయనాలు చేయాలి? 
వైరస్‌ల నుంచి టీకాలు ఏమేరకు రక్షణనిస్తాయో ‘ఇన్విట్రో స్టడీస్‌’ ద్వారా తెలుస్తుంది. వైరస్‌ కారణంగా యాంటీబాడీస్‌ వృద్ధి అయిన పేషెంట్ల సీరం జత చేసి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా ఏ వ్యాక్సిన్‌ దేనిపై బాగా పనిచేస్తుందనేది తెలుస్తుంది. మరో 10, 15 రోజుల్లో ఏ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌ నుంచి రక్షణ వస్తుందనేది వెల్లడవుతుంది. ప్రస్తుత టీకాలతో ఒమిక్రాన్‌కూ 40 శాతం దాకా రక్షణ లభిస్తుంది. మరో రెండు నెలల్లోనే ఈ వేరియెంట్‌కూ వ్యాక్సిన్‌ వస్తుంది.  

మరిన్ని వార్తలు