కరోనా: అంతా ఓకే ఆనుకోవద్దు

11 May, 2021 01:15 IST|Sakshi

ఆక్సిజన్‌ స్థాయి, ఇతర అంశాలు ఎప్పటికప్పుడు చూసుకోవాలి 

ఆరు నిమిషాల నడక పరీక్షతో ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవచ్చు 

సాక్షి ఇంటర్వ్యూలో ఏఐజీ ఆస్పత్రి పల్మనాలజీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా

కరోనా మహమ్మారి రెండో దశలో కేసులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ నుంచి ఊపిరితిత్తులను ఎలా కాపాడుకోవాలి ? కరోనా సోకిన బాధితుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి తీవ్రతకు చేరుకునే దశలో ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలి? ఏయే అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి తదితర అంశాలపై ఏఐజీ ఆస్పత్రి పల్మనాలజీ విభాగం డైరెక్టర్‌ డా. విశ్వనాథ్‌ గెల్లా ‘సాక్షి’ఇంటర్వ్యూలో స్పందించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...    – సాక్షి, హైదరాబాద్‌

‘స్వల్ప లక్షణాలు ఉన్నప్పటి నుంచే ఇళ్లలోనే ఆయా అంశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవాలి. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలోనే ఉంటే మల్టీ విటమిన్స్‌ మాత్రలు తీసుకుంటే సరిపోతుంది. లక్షణాలున్నా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినంత మాత్రాన ఏమీ కాదని రిలాక్స్‌ కావొద్దు. తమకు కరోనా లేదని ఎవరికివారే నిర్ధారణకు వచ్చేసి, డాక్టర్ల సలహా తీసుకోకుండా.. జ్వరం, జలుబు, ఆక్సిజన్‌ ఇతర అంశాలను సైతం మానిటరింగ్‌ చేయకపోవడం వంటి అంశాలు చేటు తెస్తాయి. వ్యాధి ముదిరి లంగ్స్‌ ప్రభావితమయ్యాక ఆస్పత్రులకు పరిగెత్తేసరికి అవి సీరియస్‌ కేసులుగా మారుతున్నాయి.  

తొలిదశలో స్టెరాయిడ్స్‌ ప్రమాదకరం... 
జ్వరం 3,4 రోజులకు కూడా తగ్గకపోతే డోలో–650 మాత్రలు తీసుకోవాలి. ఇక మొదటివారంలోనే స్టెరాయిడ్స్‌ వాడకం చేటుచేస్తోంది. ఈ విషయంలో కొందరు డాక్టర్లు సైతం ప్రారంభ దశల్లోనే స్టెరాయిడ్స్‌ ఇంకా ఏవేవో మందులు వాడేస్తున్నారు. స్వల్ప లక్షణాలున్నపుడు అధిక ప్రభావం చూపే మందులు వాడకపోవడమే మంచిది.

 

6 నిమిషాల నడక పరీక్ష.. 
‘ఆరు నిమిషాల నడక పరీక్ష’ద్వారా మన ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా ఆరు నిమిషాలపాటు వేగంగా నడవాలి. అనంతరం పల్స్‌ ఆక్సీ మీటర్‌తో చెక్‌ చేసుకుంటే ఆక్సిజన్‌ స్థాయి 95 కంటే ఎక్కువే ఉండాలి. ఒకవేళ 93 కంటే తక్కువ ఉంటే మాత్రం స్టెరాయిడ్స్‌ చికిత్స చేయాల్సి ఉంటుంది. విశ్రాంతి తీసుకునేటపుడు కూడా ఆక్సిజన్‌ స్థాయిల్లో తగ్గుదల ఉంటే వీటిని వాడాలి. మొదటి వారంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గితేనే స్టెరాయిడ్స్‌ తీసుకోవాలి. ప్రభుత్వం ఇస్తున్న మెడికల్‌ కిట్‌లో స్టెరాయిడ్స్‌ మందులున్నా, వాటిని రెండోవారంలోనే డాక్టర్ల సలహాపై వాడాల్సి ఉంటుందని అందరూ గమనించాలి. 

యాంటీబాడీ కాక్‌టెయిల్‌ చికిత్స.. 
ప్రస్తుతం యాంటీబాడీ కాక్‌టెయిల్‌ చికిత్స అందుబాటులోకి వచ్చింది. తొలిదశల్లో అదికూడా షుగర్, బీపీ, గుండె జబ్బు ఇతర కోమార్బిడ్‌ కండిషన్‌ ఉన్న వారికి మాత్రమే ఉపయోగించాలి. వ్యాధి తీవ్రస్థా యికి వెళ్లకుండా ఇది ఉపయోగపడుతుంది. సెకండ్‌ వేవ్‌లో కొంతమంది పేషెంట్లు చాలా త్వరగా 3, 4 రోజుల్లోనే వ్యాధి తీవ్రతకు లోనవుతున్నారు. చిన్న వయసు వారు కూడా  ప్రభావితమౌతున్నారు.  

చికిత్స కంటే పర్యవేక్షణే కీలకం
రెండోవారంలో కరోనా తీవ్రస్థాయికి చేరుకోవడానికి ముందే మన శరీరంలో వస్తున్న మార్పులు ఎలా ఉంటున్నాయి? ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే విషయాలపై పర్యవేక్షణ కీలకంగా మారింది. డాక్టర్ల నుంచి చికిత్స తీసుకోకపోయినా మొదటి 2, 3 రోజుల్లో పారాసిటమాల్‌ తీసుకుంటే సరిపోతుంది. ఏదో జరిగిపోతుందనే భయంతో ముందే ఆ మందులు, ఈ మందులు వాడితే నష్టం జరుగుతుంది. ప్రారంభ దశలో మల్టీ విటమిన్స్‌, డోలో–650 తీసుకుంటే చాలు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ సరిగ్గానే ఉంటే స్టెరాయిడ్స్‌ వాడకూడదు. అప్పటికీ జ్వరం, ఇతర లక్షణాలు కొనసాగడం లేదా ఎక్కువ కావడం వంటివి జరిగితే చికిత్స తీసుకోవాలి. 

ప్రాణాయామంతో మేలు.. 
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లో కొంతమేర భయం ఏర్పడింది. ఎక్కువగా మాస్కులు పెట్టుకుంటున్నారు. అయితే వాటిని సరిగా ధరించడంతో పాటు భౌతికదూరం పాటించడం గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ ముఖ్యం. హ్యాండ్‌ శానిటైజేషన్‌ తప్పనిసరిగా కొనసాగించాలి. మల్టీ విటమిన్స్‌ సప్లిమెంట్స్‌. బ్రీథింగ్‌ ఎక్సర్‌సైజులు, ప్రాణాయామం వంటి వాటితో శ్వాస తీసుకునే తీరులో గుణాత్మక మార్పులొస్తాయి. ఇవి ఊపిరితిత్తులకు మంచి చేస్తాయి. 

అంతా వ్యాక్సిన్‌ వేసుకోవాలి.. 
అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలి. టీకా కోసం వెళ్లినపుడు ఎన్‌–95 మాస్కులు ధరించాలి. అవి అందుబాటులో లేకపోతే డబుల్‌ క్లాత్‌ మాస్కు లు తప్పకుండా వాడాలి. ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి, ప్రభావం తీవ్రంగా మారుతున్న తరుణంలో మాస్కులు పెట్టుకోవడం అత్యంత అవసరం’.   

మరిన్ని వార్తలు