పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలు వెంటాడుతున్నాయా? కళ్లు తిరగడం వల్ల..

13 Jun, 2022 01:43 IST|Sakshi

ఇతరత్రా సమస్యలతో పాటు నరాలపైనా ప్రభావం

22 శాతం మందికి వర్టిగో సమస్యలు

ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఓటోలారింగాలజీ’లో సర్వే వివరాలు

కొందరిలో శరీర సమతుల్యతను నియంత్రించే నరాలు దెబ్బతింటున్నాయని నిర్ధారణ

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రముఖ ఈఎన్‌టీ న్యూరో ఆటాలజిస్ట్‌ డాక్టర్‌ లాస్య సాయి సింధు

పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలు (లాంగ్‌ హాలర్స్‌ సిండ్రోమ్‌) ఇప్పటికీ చాలామందిని వేధిస్తూనే ఉన్నాయి. ఇందులో ఇతరత్రా సమస్యలతో పాటు నరాలకు సంబంధించినవి కూడా ఉంటున్నాయి. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చేతులు, కాళ్లు లాగడం వంటివి కొనసాగడంతో పాటు కళ్లు తిరగడం ప్రధాన సమస్యగా మారింది. పోస్ట్‌ వ్యాక్సినేషన్‌ తర్వాత కూడా కొందరిలో కళ్లు తిరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలపై సిటీ న్యూరో ఆసుపత్రికి చెందిన ఈఎన్‌టీ న్యూరో ఆటాలజిస్ట్‌ డాక్టర్‌ లాస్య సాయి సింధు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే...
– సాక్షి, హైదరాబాద్‌


డాక్టర్‌ లాస్య సాయి సింధు

కరోనా వైరస్‌ నేరుగా మన శరీర సమతుల్యతను నియంత్రించే పలు రకాల నరాలను కూడా దెబ్బతీస్తోంది. దానివల్ల మన మెదడులోని ఎమోషనల్‌ సెంటర్‌ (మెదడు అంతర్భాగంలోని వ్యవస్థ) అనేది ప్రభావితం అవుతుంది. ఈ సెంటర్‌కు మన శరీర సమతుల్యతను నియంత్రించే నరాలు కనెక్ట్‌ అయి ఉంటాయి. మెదడులోని ఒకటో నరం వాసనకు సంబంధించినది, ఎనిమిదో నరం (వెస్టిబిలో కాక్లియర్‌ నర్వ్‌) వినికిడికి సంబంధించినది అయితే ఏడోది పేషియల్‌ (ముఖం) నర్వ్‌.

ఈ నరాలు ప్రభావితం అయినప్పుడు వాసన కోల్పోవడం, వినికిడి శక్తిని కోల్పోవడం, మూతి వంకర పోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. కోవిడ్‌ నుంచి కోలుకున్నాక ఎనిమిది నెలలు గడిచినా వాసన తిరిగి రానివారున్నారు. కొందరికి చెడు వాసన రావడం. కిరోసి, డిటర్జెంట్‌ వాసనలు వచ్చినవారున్నారు. కొందరిలో ఒక చెవి వినికిడి శక్తి పూర్తిగా (సడన్‌ సెన్సరీ న్యూరల్‌ హియరింగ్‌ లాస్‌) పోతుంది. చాలామంది చెవిలో కుయ్‌ మనే శబ్దం వస్తుంటుంది. కొందరిలో తట్టుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. 

22.3 శాతం మందికి వర్టిగో సమస్యలు...
పోస్ట్‌ కోవిడ్‌ సమస్యల్లో ప్రధానమైనది శరీరం స్థిరత్వాన్ని కోల్పోవడం. కళ్లు తిరగడం ఇందులో ముఖ్యమైనది. తలనొప్పి, తల దిమ్ముగా ఉండటం, బరువుగా అన్పించడం, పడుకోవాలనిపించడం ఇతర లక్షణాలు. కొందరికి పడుకున్నా నిద్రరాదు. నీరసంగా అనిపిస్తుంది. కొందరు నడుస్తూ నడుస్తూ తూలిపోతారు.

కొందరికి వాంతులవడం జరుగుతుంది. ఈ విధమైన పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలపై మన దేశంలో ఒక సర్వే జరిగింది. దాని వివరాలు ఈ ఏడాది ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఓటోలారింగాలజీ అండ్‌ హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జరీలో ప్రచురితమయ్యాయి. 18–60 వయస్సు వారిపై సర్వే జరగ్గా, అందులో 22.3 శాతం మందికి వర్టిగో సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. 

కుటుంబసభ్యులపైనా ప్రభావం..
కోవిడ్‌తో దేశంలో అనేకమంది చనిపోయారు. అలా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు మానసికంగా దెబ్బతిన్నారు. మెదడుపై ప్రభావం చూపడం వల్ల కొందరిలో కళ్లు తిరుగుతుంటాయి. కింద పడిపోతారు. కొందరు బయటకు వెళ్లడానికి భయపడతారు. కొందరు సెన్సిటివ్‌గా మారిపోతారు. చిన్న చిన్నవాటికే కోపం, ఏడుపు వస్తాయి. కొందరిలో ఏదో భయం.. నేను చనిపోతానా? నా మెదడులో ఏమైనా సమస్య ఉందా అన్న భావన ఏర్పడుతుంది. పడిపోతామా అన్న భయంతో చాలామంది ఇంట్లో పడుకుంటారు. వయస్సు మళ్లినవారు మంచానికే పరిమితం అవుతారు. 

సరైన ఎక్సర్‌సైజులే మందు
వర్టిగో సమస్యలను గుర్తించేందుకు డాక్టర్‌ చేసే శారీరక పరీక్ష కీలకం. వీహిట్, వీఎన్‌జీ పరీక్షల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. బీపీపీవీ (బినైన్‌ పారాక్సిస్మల్‌ పొజిషినల్‌ వర్టిగో) అనేది చాలా సాధారణంగా కనిపిస్తుంది. బీపీపీవీలో బ్యాలెన్స్‌కు సంబంధించిన నరం ప్రభావితం అవుతుంది. చెవి లోపల కొన్ని కాల్షియం కణాలు అతుక్కొని ఉండా ల్సినవి విడిపోతాయి. దీనివల్లనే కళ్లు తిరుగుతుం టాయి. బీపీపీవీ అనగానే ఎప్లీ మానోవర్‌ ఎక్సర్‌ సైజ్‌ అనే ఒకే రకమైన పద్ధతిలో చికిత్స చేస్తారు. ఇది సరిగ్గా చేయకుంటే సమస్య మరింత పెరుగుతుంది.

చికిత్సలో ప్రధానంగా ఏ వైపున సమస్య ఉందో తెలుసుకోవాలి. దాని తర్వాత ఏ కెనాల్‌ ప్రభావితం అయిందో తెలుసుకోవాలి. దానికి సంబంధించిన సరైన ఎక్సర్‌సైజ్‌ చేయించాలి. మళ్లీ మళ్లీ రాకుండా ఉండేందుకు వేరే చికిత్సలు ఉంటాయి. ఎక్సర్‌సైజులు ఉంటాయి. మాత్రలతో అవసరం ఉండదు. సరైన ఎక్సర్‌సైజ్‌తో సెట్‌ అవుతుంది. 

మరిన్ని వార్తలు