పల్లెపల్లెకు వెళ్తేనే పరిష్కారం.. చేతిరాత పహాణీలతో ధరణిని ఆధునీకరించాలి

11 Jul, 2022 03:37 IST|Sakshi

గ్రామాల్లో పారాలీగల్‌ వాలంటీర్లు తప్పనిసరి

భూ చట్టాలన్నింటితో రెవెన్యూ కోడ్‌ తేవాలి

వీలైనంత త్వరగా భూముల సర్వే చేపట్టాలి

‘సాక్షి’తో భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్‌  

ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చినా భూ సమస్యలు తీరకపోవడంతో సర్కారు సహా అన్ని రాజకీయ పక్షాలు మళ్లీ భూసర్వే రికార్డులు, సమస్యలపై దృష్టి సారించాయి. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 15 నుంచి ప్రభుత్వం మండల స్థాయి రెవెన్యూ సదస్సులకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యాయ శిబిరాలతో భూ సమస్యలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి గ్రామీణ న్యాయ పీఠం ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తున్న భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్‌ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నారు.  

ప్ర: మళ్లీ రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారమవుతాయా? 
జ: భూ సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో కాకుండా గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించాలి. ఈ సదస్సులు జరగడానికంటే ముందే ఆ ఊరిలోని భూ సమస్యలను గుర్తించాలి. ఇందుకోసం ఆ గ్రామ యువతకు తర్ఫీదు ఇచ్చి వారిని ఇందులో భాగస్వాములను చేయాలి. గ్రామంలోనే రెవెన్యూ కోర్టు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలి. చేతిరాతతో పహాణి రాసి ఆ తరువాత ధరణి రికార్డును సవరించాలి. ప్రతి గ్రామానికి ఒక బృందం ఏర్పాటు చేసి వారికి కనీసం 3–6 నెలల గడువు ఇవ్వాలి. 

ప్ర: కొత్త రెవెన్యూ చట్టం భూ యాజమాన్య హక్కులకు పూర్తి హామీ ఇస్తుందా? 
జ: భూ రికార్డుల్లోని వివరాలకు ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉంటుంది. రికార్డుల్లో పేరు ఉన్నా భూ యజమాని హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వమే జరిమానా కడుతుంది. అలాంటి వ్యవస్థను తెస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించారు. కానీ ఇంకా అలాంటి చట్టమేదీరాలేదు. భూ హక్కులకు పూర్తి భరోసా ఇచ్చే టైటిల్‌ గ్యారెంటీ వ్యవస్థను తెచ్చే ప్రయత్నాలు ఈ దేశంలో మూడు దశాబ్దాలుగా జరుగుతున్నాయి.

ఒకప్పటి ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ, ఇప్పటి డీఐఎల్‌ఆర్‌ఎం పథకం అందుకు ఉద్దేశించిందే. టైటిల్‌ గ్యారెంటీ చట్టం ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీని ఆధారంగా ఇప్పటికే రాజస్తాన్, ఏపీ చట్టాలు రూపొందించుకున్నాయి. టైటిల్‌ గ్యారెంటీ చట్టం అమల్లోకి వస్తే భూములన్నింటికీ ఒకే రికార్డు ఉంటుంది. ఆ రికార్డులోని వివరాలకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంది. యజమానికి నష్టం జరిగితే నష్టపరిహారం అందుతుంది. తెలంగాణ తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఆ భరోసా ఇవ్వదు. 

ప్ర: భూ సమస్యలను ‘ధరణి’ ఏ మేరకు పరిష్కరించగలిగింది? 
జ: భూమి రికార్డులన్నీ కంప్యూటర్లలోకి నిక్షిప్తమయ్యాయి. అందరికీ అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ ప్రక్రియలు వేగవంతం, సులభతరం అయ్యాయి. కానీ భూ సమస్యల పరిష్కారం క్లిష్టతరంగా మారింది. ధరణిలో తప్పులను సరి చేయించుకోవడం రైతులకు చాలా కష్టంగా ఉంది. ధరణిలో వివరాలను సరిచేయడానికి పెట్టుకున్న వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే రికార్డు (ధరణి)లో తప్పుల సవరణ కోసం రూ. వెయ్యి ఫీజు తీసుకోవడం పేద రైతులకు భారంగా మారింది. అనేక సమస్యలకు ఆప్షన్లు ఇవ్వనేలేదు. 

ప్ర: రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటుతో ఏ మేరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయి? 
జ: భూ సమస్యల పరిష్కారాల కోసం ఏర్పాటు చేసిన రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో తాత్కాలిక జిల్లా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసి పాత కేసులను పరిష్కరించింది. కొత్త కేసులన్నీ సివిల్‌ కోర్టులకు వెళ్లాల్సిందేనని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్‌ఓఆర్‌ చట్టం కింద భూ రికార్డులను సవరించే అధికారం మాత్రమే రెవెన్యూ కోర్టుల నుంచి తీసివేశారు. కానీ అసైన్డ్‌ భూముల అన్యాక్రాంతం, ఇనాం, పీటీ భూముల సమస్యలు, ఇతర భూ వివాదాలు ఇంకా రెవెన్యూ కోర్టుల పరిధిలోనే ఉన్నాయి.

అయినా ఈ అంశంపై స్పష్టత లేకపోవడం వల్ల రెవెన్యూ యంత్రాంగం భూమి సమస్యలను పరిష్కరించకుండా కోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నారు. ధరణిలోని సమస్యలను పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. కొత్త వ్యవస్థ భూ సమస్యల పరిష్కారాన్ని రైతులకు భారంగా మార్చింది. సమస్యల పరిష్కారం నత్తనడకన సాగుతోంది. భూ వివాదాలు పరిష్కారం కావాలంటే జిల్లాకొక ట్రిబునల్‌ను ఏర్పాటు చెయ్యాలి. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యలు పరిష్కారమయ్యేలా భూ వివాద పరిష్కర చట్టాన్ని రూపొందించాలి. 

ప్ర: భూమి హక్కులకు చిక్కులు లేకుండా చూడాలంటే ఏం చేయాలి? 
జ: భూమి హద్దులకు, హక్కులకు స్పష్టత, భద్రత ఇచ్చే వ్యవస్థ కావాలి. భూ చట్టాలన్నీ కలిపి ఒక రెవెన్యూ కోడ్‌ను రూపొందించాలి. సమస్యల పరిష్కారానికి జిలాకొక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. ఒక్కసారన్నా చేతిరాత పహాణీ రాసి దాని ఆధారంగా ధరణిని సవరించాలి. గ్రామ రెవెన్యూ కోర్టులను నిర్వహించి భూ వివాదాలు పరిష్కరించాలి. పారాలీగల్‌ వ్యవస్థను మళ్లీ తేవాలి. భూముల సర్వే జరగాలి. మొత్తంగా తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో అమలు జరగాలి. ప్రజల భూమి ఆకాంక్షలు నెరవేరకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదు. భూ హక్కుల చిక్కులు లేని తెలంగాణ సాకారం కావాలంటే భూమి ఎజెండా అందరి ఎజెండా కావాలి.  

మరిన్ని వార్తలు