‘సాక్షి’ బాల ఎడిటర్లు 301 మంది

29 Sep, 2020 06:17 IST|Sakshi

వార్తాపత్రిక తయారీ పోటీకి విద్యార్థుల నుంచి విశేష స్పందన

రాష్ట్ర స్థాయిలో 80 మంది, జిల్లాల స్థాయిలో 221 మంది ఎంపిక

త్వరలో విజేతలకు బహుమతుల ప్రదానం  

హైదరాబాద్‌: ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల ఎడిటర్‌ పోటీకి పాఠశాల విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీసే క్రమంలో నిర్వహించిన ఈ పోటీలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన మొత్తం 301 మంది ఈ పోటీలో విజేతలుగా నిలిచారు. ఇందులో ఇరు రాష్ట్రాల స్థాయిలో 80 మంది విద్యార్థులను బాల ఎడిటర్లుగా ఎంపిక చేయగా జిల్లాల స్థాయి బాల ఎడిటర్లుగా 221 మందిని ఎంపిక చేశారు. 

రెండు కేటగిరీలుగా పోటీ..
బాల ఎడిటర్‌ అనేది ‘సాక్షి’మీడియా గ్రూప్‌ నిర్వహించిన వార్తాపత్రిక తయారీ పోటీ. ఈ పోటీని రెండు విభాగాల్లో నిర్వహించారు. ఈ పోటీలో కాన్సెప్ట్, చిత్రాలు, అంశాలను పూర్తిగా విద్య, చదువుకు సంబంధించే రూపొందించారు. ఇందులో 30 వేల మందికిపైగా విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. ‘ఎ’విభాగంలో 5 నుంచి 7వ తరగతి విద్యార్థులకు, ‘బి’విభాగంలో 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అవకాశం కల్పించారు. 100 మార్కుల ఈ పోటీ పరీక్షలో నూటికి 80 శాతం మార్కులు సాధించిన వారే అధికంగా ఉన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల జవాబులను పరిశీలించి ఆ మేరకు మార్కులు ఇచ్చారు. సోమవారం నిర్వహించిన ఈ ప్రక్రియలో ఉత్తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన విద్యార్థులను ఎంపిక చేశారు.

వార్తాపత్రికే పరీక్ష పేపరు..
‘సాక్షి’దినప్రతికను పరీక్ష పేపరుగా పోటీలో పాల్గొన్న విద్యార్థులకు అందజేశారు. అందులో పొందుపరిచిన ప్రశ్నలకు తెలుగులో లేదా ఆంగ్లంలో నిర్దేశిత టెంప్లెట్‌లో స్వదస్తూరితోనే వారు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. ఆ విధంగా పూర్తి చేసిన వార్తాపత్రికను 2019 నవంబర్‌ 15వ తేదీ నాటికి ఆయా పాఠశాల కో ఆర్డినేటర్లకు అందజేశారు. అక్కడి నుంచి ‘సాక్షి’ప్రతినిధి బృందం సేకరించింది. 

బహుమతులు..
‘ఎ ’కేటగిరీలో రాష్ట్ర స్థాయి బాల ఎడిటర్లుగా నిలిచిన 40 మంది విద్యార్థులకు సోనీ ప్లే స్టేషన్లను, జిల్లాల స్థాయి విజేతలకు సైన్స్‌ కిట్స్‌ను బహుమతిగా అందజేయనున్నారు. ‘బి’కేటగిరీలో 40 మంది రాష్ట్ర స్థాయి విజేతలకు లెనోవో ట్యాబ్స్‌ను, జిల్లా స్థాయిలో బాల ఎడిటర్లుగా ఎంపికైన విద్యార్థులకు ఫిటెనెస్‌ ట్రాకర్‌ బ్యాండ్స్‌ను బహుమతులుగా ఇవ్వనున్నారు. ఆయా విద్యార్థులకు ‘సాక్షి’బాల ఎడిటర్‌ సర్టిఫికెట్లను అందించనున్నారు. త్వరలో విజేతల జాబితాను వెల్లడిస్తామని, కరోనా నిబంధనల మేరకు బహుమతి ప్రదానోత్సవాన్ని కూడా త్వరలోనే నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు.

‘సాక్షి’ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన బాల ఎడిటర్‌ పోటీల పత్రాలను పరిశీలిస్తున్న న్యాయనిర్ణేతలు

మరిన్ని వార్తలు