తక్కువ మరణాల రేటుకు జన్యుక్రమమే కారణం

8 Sep, 2020 04:20 IST|Sakshi

‘సాక్షి’తో సీడీఎఫ్‌డీ డైరెక్టర్‌ డాక్టర్‌ తంగరాజ్‌

సాక్షి, హైదరాబాద్‌: అగ్రరాజ్యం అమెరికా, యూరోపియన్‌ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత తక్కువగా ఉండేందు కు కారణమేమిటో తెలుసా? వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ఇప్పుడు ఎన్ని మార్పు లు చెందింది? భారత్‌లో వ్యాపిస్తున్నది ఆ వైరసేనా? ప్రాణాంతక కోవిడ్‌ మహమ్మారి మరోసారి విజృంభించే అవకాశ్చాలెన్ని? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కనుక్కునేందుకు ‘సాక్షి’సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నొస్టిక్స్‌(సీడీఎఫ్‌డీ) డైరెక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ తంగరాజ్‌ను సంప్రదించింది. ఆయా అంశాలపై ఆయన ఇచ్చిన సమాధానాలివీ.. 

వైరస్‌ డీఎన్‌ఏను విశ్లేషించామన్నారు కదా.. ఆసక్తికర విషయాలు ఏమైనా ఉన్నాయా?
డాక్టర్‌ తంగరాజ్‌: ఇప్పుడు దేశంలో ఎక్కువవ్యాప్తిలో ఉన్న వైరస్‌.. వూహాన్‌లో పుట్టిన వైరస్‌ కంటే భిన్నమైంది. దీన్ని మేం 20బీ అంటున్నాం. ప్రస్తుతం దాదాపు 95 శాతం వైరస్‌ ఈ 20బీ రకానికి చెందినదే. కొంతకాలం క్రితం 20బీలోనూ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తమ్మీద చూస్తే తెలంగాణలో మార్పు చెందిన వైరస్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించని వైరస్‌ రకాన్ని గుర్తించాం. కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ ఎక్కువస్థాయిలో వ్యాప్తి చెందుతున్నప్పటికీ లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

భారత్‌లో మరణాల రేటు, వ్యాధి తీవ్రత తక్కువకు కారణం?
భారతీయుల జన్యుక్రమం ఒక కారణమన్నది నా అంచనా. రోగ నిరోధక వ్యవస్థ పాత్ర కూడా చాలా కీలకం. భారతదేశంలో రకరకాల వాతావరణాల్లో నివసించేవారు, జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటి చోట గతంలో ఎప్పుడైనా కొందరు రకరకాల వైరస్‌ల బారిన పడి ఉంటారు. కొంతమందిలో సహజసిద్ధంగా యాంటీబాడీలు వృద్ధి చెంది ఉంటాయి. మరికొందరిలో వైరస్‌ తీవ్ర ప్రభావం చూపినప్పటికీ సహజసిద్ధంగా కోలుకుని ఉండవచ్చు. ఫలితంగా కొంతమంది రోగ నిరోధక వ్యవస్థ ఈ వైరస్‌ను కొంతవరకూ తట్టుకునేలా మారి ఉంటుంది. గతంలో అతితక్కువగా వైరస్‌ల బారిన పడ్డవారు ప్రస్తుతం ఎక్కువ సమస్యలు అనుభవించేందుకు అవకాశముంది. గతంలో మలేరియా విషయంలో నూ ఈ తేడా గుర్తించాం. కొన్ని గిరిజన తెగల్లో మలేరియా నిరోధకత కనిపిస్తుంది. అలాగే కొంతమందిలో సికిల్‌సెల్‌ అనీమియా విషయంలోనూ నిరోధకత కనిపిస్తుంది.  

మరి అండమాన్, నికోబార్‌ దీవుల్లోని ఆదిమ తెగల్లోనూ కరోనా వైరస్‌ ఎలా వ్యాపించిందంటారు?
అండమాన్, నికోబార్‌ దీవుల్లో నాలుగు తెగలున్నాయి. వీటిల్లో సెంటినెలిస్‌ ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఒంగే అనే ఇంకో తెగ డుగాంగ్‌ జలసంధిలో ఇతరులు ఎవరూ చేరుకోలేని ప్రాంతంలో నివసిస్తున్నారు. మూడో తెగ గ్రేట్‌ అండమానీస్‌ జనాభా అతితక్కువగా ఉంది. వీరితోపాటు జరావ తెగ ప్రజలూ చాలాకాలంగా ఇతరులతో కలుస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే 2006లోనే మేం తెగల జన్యుక్రమాన్ని పరిశీ లించాం. తండ్రుల నుంచే సంక్రమించే వై – క్రోమోజోమ్‌లో మార్పులు ఉన్నట్లు స్పష్టమైంది. ప్రస్తుతం కోవిడ్‌–19 బారిన పడ్డవారు గ్రేట్‌ అండమానీస్‌ తెగవారే.

జన్యుక్రమాల విశ్లేషణ వైరస్‌ నియంత్రణకు ఏమైనా ఉపయోగపడుతుందా?
ఏ వైరస్‌ను నియంత్రించాలన్నా వాటి జన్యుక్రమాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. కరోనా విషయాన్నే తీసుకుంటే.. తెలంగాణ మొత్తమ్మీద 20బీ రకం వైరస్‌ వ్యాప్తిలో ఉందని ముందే చెప్పుకున్నాం. ఈ రకం జన్యుక్రమాన్ని విశ్లేషించడం వల్ల ఇతర ప్రాంతాల్లో వాడే మందులు లేదా అభివృద్ధి చేసే టీకా పనిచేస్తుందా? లేదా? అన్నది ముందుగానే తెలుసుకోవచ్చు. 

వూహాన్‌లో వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పుడు ఇది చైనా సృష్టి అన్న వార్తలు చాలా వచ్చాయి. జన్యుస్థాయిలో వైరస్‌ను విశ్లేషించిన మీ అభిప్రాయం ఏమిటి?
నేనే కాదు... ఈ వైరస్‌పై అధ్యయనం చేసిన పలువురు అంతర్జాతీయ స్థాయి వైరాలజిస్టులు కూడా ఇది మానవ నిర్మితమైన వైరస్‌ కాదని ఇప్పటికే విస్పష్టంగా పేర్కొన్నారు. గబ్బిలాలు లేదా పాంగొలిన్‌ల నుంచి ఈ వైరస్‌ మానవుల్లోకి ప్రవేశించిందని అంచనా. కచ్చితంగా ఏ జంతువు నుంచి మనకు సోకిందో తెలుసుకోవాలంటే ఆ వైరస్‌ను ఆ జంతువుల్లోకి ఎక్కించి వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీడీఎఫ్‌డీ మానవ కణాల్లోకి చేరిన వైరస్‌ను మాత్రమే విశ్లేషిస్తోంది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం సాధ్యం కాకపోవచ్చు.

కరోనా వైరస్‌ మరోసారి విజృంభించే అవకాశం ఉందా?
అవకాశం లేకపోలేదు. తీవ్రత విషయంలో మాత్రం కొంచెం తేడాలు ఉండవచ్చు. రెండోసారి వైరస్‌ సోకినప్పుడు అంత తీవ్రత ఉండకపోవచ్చు.

మరిన్ని వార్తలు