తీరొక్క సంతసం

24 Jan, 2021 06:11 IST|Sakshi

ఒక్కో వస్తువుకు ఒక్కో అంగడి

కామారెడ్డిలో ‘వాహనాల అంగడి’

పిట్లం.. కలప చెక్కలకు ఫేమస్‌

పప్పుదినుసులకు ప్రసిద్ధి బిచ్కుంద

మద్నూర్‌లో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల సంత

ఒక్కో చోట ఒక్కో రకం

సాక్షి, కామారెడ్డి: వారమైందంటే.. వారి మనసంతా సంతపైనే! ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తే తమకు కావాల్సిన వస్తువులు ఇంటిముందు వాలే ఈ కాలంలోనూ అంగడికి ఆదరణ తగ్గలేదు. తీరొక్క వస్తువులకు ముచ్చటైన నెలవు అది. సరుకులు, బట్టలు, చిన్న, పెద్ద వస్తువులు, కూరగాయలు, పశువులు, మేకలు... ఇలా అన్ని రకాలు అక్కడ లభిస్తాయి. ‘అంగడికి పోయి గొంగడి తెస్త ’అన్న సామెత కూడా అట్ల పుట్టిందే. అయితే, ఇప్పుడు స్పెషల్‌ సంతలు వచ్చేశాయి. కామారెడ్డి అంగడి వాహనాలకు ప్రసిద్ధి. నవీపేట మేకలకు కేరాఫ్‌గా మారింది. బిచ్కుంద పప్పుదినుసులకు ఫేమస్‌. పిట్లం తలుపుచెక్కల పొట్లంగా మారింది. మద్నూర్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలు.. ఇలా పలు చోట్ల ఒక్కోరకం వస్తువుకు ఒక్కో రకం అంగడి నిర్వహిస్తున్నారు. ప్రజల మధ్య ఆత్మీయతకు అంగడి వేదికగా కూడా ఉంటోంది. చుట్టాలు, స్నేహితులు అంగట్లో కలుసుకుంటారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. వారానికోసారి జరిగే అంగడికి తప్పనిసరిగా వెళ్లేవారు చాలామంది ఉంటారు. ఇప్పుడు జనం అవసరాల మేరకు వారంలో రోజుకో చోట అంగడి సాగుతోంది.

తలుపుచెక్కలకు కేరాఫ్‌ పిట్లం
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో నిర్వహించే అంగడి.. ఇంటి దర్వాజాలకు బిగించే తలుపు చెక్కలకు స్పెషల్‌. వేప, మామిడి చెక్కలు ఇక్కడ లభిస్తాయి. పిట్లం మండలంతోపాటు పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లా నుంచి కూడా ప్రజలు తరలివచ్చి చెక్కలు కొనుగోలు చేస్తుంటారు.

కామారెడ్డిలో వాహనాల అంగడి
జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో కొన్ని దశాబ్దాలుగా ప్రతి గురువారం సాధారణ అంగడి సాగుతోంది. అయి తే, ఇక్కడ ఐదారేళ్లుగా ప్రత్యేకంగా బైకుల అంగడి కూడా సాగుతోంది. కొత్త బస్టాండ్‌ సమీపంలోని సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌లో ప్రతి గురువారం సెకండ్‌ హ్యాండ్‌ బైకుల అంగడి నిర్వహిస్తున్నారు. బాబా అనే ఒక వ్యక్తి ప్రారంభించిన బైకుల అంగడి ప్రతివారం నిరాటంకంగా కొనసాగుతోంది. బైకులతోపాటు కార్లు, ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోలు కూడా అమ్ముతున్నారు.

నవీపేట మేకల సంత
నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం మేకల సంత సాగుతోంది. వారంవారం రూ.కోట్లలో వ్యాపారం నడుస్తోంది. మేకల కొనుగోలుకు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాం తాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు.

 

పప్పుదినుసులకు ఫేమస్‌ బిచ్కుంద
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం నిర్వహించే అంగడిలో పప్పుదినుసుల అమ్మకాలు జోరుగా సాగుతాయి. పెసర్లు, బబ్బెర్లు, కందులు, శనగలతోపాటు జొన్నలు, గోధుమలు కూడా భారీగా అమ్ముడవుతాయి. చుట్టుపక్కల మండలాల నుంచి పప్పుదినుసుల కోసం వస్తుంటారు.

మద్నూర్‌ అంగట్లో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు
కామారెడ్డి జిల్లాలో మారుమూలన మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న మద్నూర్‌ అంగడి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల అమ్మకాలకు పెట్టింది పేరు. ఇక్కడ విరివిగా ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, సామగ్రి విక్రయిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి కొందరు వ్యాపారులు వచ్చి ఫ్యాన్లు, కూలర్లు, స్పీకర్లు, డెక్కులు, మిక్సీలు, గ్రైండర్లు, మైకులు విక్రయిస్తారు. బైకులపై ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకువచ్చి అంగట్లో విక్రయిస్తుంటారు. ధరలు కూడా అందుబాటులో ఉండటంతో వీటి అమ్మకాలకు ఆదరణ కూడా బాగానే ఉంటుంది.

మరిన్ని వార్తలు