బతుకునిచ్చిన బతుకమ్మలు

24 Jan, 2021 02:09 IST|Sakshi

అన్నీ తామై.. కుటుంబాల పోషణ

ఆడపిల్ల కదా.. ఎప్పటికైనా ఓ అయ్య చేతిలో పెట్టాల్సిందే.. ఇదీ అప్పుడూ.. కొన్నిచోట్ల ఇప్పుడూ ఆడపిల్లలపై ఉన్న అభిప్రాయం.. కానీ.. ఈ మహిళలంతా వివక్షను జయించారు. తాము పుట్టే నాటికి ఎంత వివక్ష ఉండేదో కానీ.. నేడు వారే ఇంటికి పెద్దదిక్కయ్యారు. తల్లిదండ్రులకు అంత్యకాలంలో ఊతకర్రయ్యారు. తోడబుట్టిన వారికి ఆసరాగా నిలిచారు. వీరంతా కుటుంబపోషణ కోసం ఎంచుకున్న పనుల వెనుక ఓ బాధ్యత ఉంది. అసాధారణ బతుకు పోరాటం ఉంది. వివక్షకు గురికాకుండా.. జీవితాలను గెలిచి, నిలిచిన నాటి బాలికలు.. నేటి మహిళల బతుకు పాఠాలు.. నేడు జాతీయ బాలికాదినోత్సవం సందర్భంగా..    
– సాక్షి, నెట్‌వర్క్‌

ఇద్దరూ ఇద్దరే
ఒకరు పూలమ్మ.. మరొకరు ఆదిలక్ష్మి.. మగవాళ్లు చేసే పనిని అవలీలగా చేసేస్తారు. బాధ్యతలే వాళ్లను విభిన్న వృత్తులవైపు నడిపించాయి. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన జీడి పూలమ్మకు చిన్నతనంలోనే వివాహమైంది. 14 ఏళ్ల కిందట భర్త మరణించాడు. మనసంతా శూన్యం.. ఎదురుగా ఇద్దరు పిల్లలు.. ధైర్యంగా వంటింట్లోంచి బయటకొచ్చింది.  పంక్చర్లు వేయడాన్నే వృత్తిగా మలుచుకుంది. ఆ పని చేస్తూనే కుమార్తెకు పెళ్లి చేసింది. కుమారుడిని చదివిస్తోంది. రోజూ రూ.600 వరకు సంపాదిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి 3వ తరగతి వరకే చదువుకుంది. భర్త కష్టంతో కుటుంబం గడవదనే ఆలోచనతో.. సంసార చక్రంలో తానూ భాగస్వామైంది. భర్త చేసే పంక్చర్లు, వెల్డింగ్‌ పనిలో పట్టు సాధించింది. స్థానిక వార్డు సభ్యురాలు కూడా అయిన ఆమె మగవారికి ధీటుగా వాహనాలకు గ్రీస్, పంక్చర్, టైర్‌ పౌడర్, బోల్ట్‌ సెట్టింగ్, ప్యాచ్, ఫిల్టర్‌ క్లీనింగ్, గాలి చెకింగ్, వెల్డింగ్‌ పనులు చకచకా చేసేస్తుంది. తమ ఇద్దరి సంపాదనతో కుటుంబం హాయిగా నడిచిపోతోందని అంటోంది.

పనులు చేస్తున్న ఆదిలక్ష్మి;   లారీ టైరుకు పంక్చర్‌ చేస్తున్న పూలమ్మ

కష్టాలు.. ముక్కలు ముక్కలు
చికెన్‌ను ముక్కలుగా కట్‌చేస్తున్న ఈ ఫొటోలోని మహిళ పేరు జరీనా. భర్త అబ్దుల్‌ కరీం నడుపుతున్న చికెన్‌ సెంటర్, హోటల్‌తో సంసారం సాఫీగా గడిచిపోయేది. ఉన్నట్టుండి కరీం అనారోగ్యం బారినపడ్డాడు. చూస్తూ కూర్చుంటే.. కుటుంబం గడవదని భావించిన జరీనా.. తన భర్త చేసే పనినే తానెంచుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో చికెన్‌ సెంటర్‌ను నిర్వహిస్తూ కుటుంబాన్ని నిలబెట్టుకుంది. పెద్ద కొడుకు అల్తాఫ్‌హుస్సేన్‌ ఏడో తరగతి చదువుతూనే పంప్‌ మోటార్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రెండో కొడుకు సల్మాన్‌కు ఎంఎల్‌టీ శిక్షణనిప్పిస్తోంది.

ఇలా ఇంటికొక్కరుంటే చాలు!
అమ్మానాన్నా ఇద్దరూ కూలీలే. ఆరుగురు ఆడపిల్లలు. తల్లిదండ్రులు ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా.. నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లడమే గగనం.. దీంతో ‘నేనున్నా’నంటూ తల్లిదండ్రులతో పాటూ తానూ కుటుంబభారాన్ని పంచుకుంది అరుణ. ఇద్దరు అక్కలకు, చెల్లికి పెళ్లి చేసింది. మరో ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం గంగారం గ్రామానికి చెందిన అరుణ.. కూలి పనులకు వెళ్తుంది. సొంతంగా కొంత భూమి కొని, కొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తోంది. పురుషులతో సమానంగా నాగలి దున్నడం, ట్రాక్టర్‌ తోలడం  చేస్తుంది. ఇంత కష్టం చేస్తూనే అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. మొదట్లో ఆశ కార్యకర్తగా పనిచేసినా.. వచ్చే జీతం కుటుంబపోషణకు సరిపోక.. ‘సాగు’లోకి దిగింది. తల్లిదండ్రులను కూలి పనులకు వెళ్లొద్దంది. తమకు కొడుకులు లేరనే బాధలేదని అరుణ తల్లిదండ్రులు అంటున్నారు. అరుణ లాంటి వారు ఇంటికొక్కరున్నా చాలని గంగారం గ్రామస్తులు అంటున్నారు. నేనే అబ్బాయినై ఇంటిల్లిపాదినీ పోషిస్తానని అరుణ చెబుతోంది.

బుజ్జమ్మ..ఒంటరి పోరు!

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బుజ్జమ్మ అలియాస్‌ రాజేశ్వరి పదమూడో ఏటనే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పటికే పెద్దక్క అనారోగ్యంతో మరణించింది. రెండో అక్కకు పెళ్లయి ఇద్దరు కుమార్తెలు, కొడుకు పుట్టాక.. అక్కాబావలిద్దరూ అనారోగ్యంతో చనిపోయారు. మరో ఏడాదికి ఇంటికి పెద్దదిక్కనుకున్న అన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇక మిగిలింది.. చెల్లెలు రమ, రెండో అక్క పిల్లలు అరుణశ్రీ, మనోజ్, వర్ష.. ఈ పరిస్థితుల్లో బుజ్జమ్మ ఇంటి బాధ్యతను భుజానికెత్తుకుంది. మొదట్లో బీడీలు చుట్టింది. మిషీన్‌ కుట్టడం నేర్చుకుంది. రెక్కలు ముక్కలు చేసుకుని చెల్లెలు రమకు పెళ్లి చేసింది. అక్క పిల్లలు ఆదరణకు దూరమవుతారనే భయంతో పెళ్లి వద్దనుకుంది. ఏడాది క్రితం అక్క కుమార్తె అరుణశ్రీకి అన్నీతానై వివాహం చేసింది. మిగతా మనోజ్, వర్షను డిగ్రీ, ఇంటర్‌ చదివిస్తోంది. మూడేళ్ల క్రితం బుజ్జమ్మ ఆశ కార్యకర్తగా వైద్యారోగ్య శాఖలో చేరింది. మరోపక్క బీడీలు చుడుతూ, మిషీన్‌ కుడుతూ ఇప్పటికీ అక్క పిల్లలిద్దరే తన రెండు కళ్లుగా జీవిస్తోంది.

మా ఇంటి ‘భాగ్య’రేఖ

చేనేత కష్టాలకు ఎదురీదలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బీడీలు చుడుతూ బిడ్డల్ని కడుపున పెట్టుకుని చూసుకున్న అమ్మ అనారోగ్యానికి బలైపోయింది. అప్పటికి పదిహేనేళ్లు భాగ్యకు. అమ్మ చివరిసారిగా తమ్ముడు నవీన్, చెల్లెలు స్రవంతి చేతుల్ని తన చేతుల్లో పెట్టడం భాగ్యకు ఇప్పటికీ గుర్తే. ఆ బాధ్యతే.. ముందుకు నడిపించింది. మొండి ధైర్యంతో కుటుంబభారాన్ని భుజానికెత్తుకుంది. అందరూ అయ్యో పాపం.. అన్నవాళ్లే కానీ.. ఎవరూ ఆదుకున్నది లేదు. చదువాగిపోయింది. కానీ తమ్ముడు, చెల్లి చదువాగిపోకూడదని వారి కోసం బీడీలు చుట్టింది. ఆమె కష్టం గురించి తెలిసిన అప్పటి జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా.. భాగ్యకు హోంగార్డుగా అవకాశమిచ్చారు. ఆమె కష్టార్జితంతోనే స్రవంతి ఎంబీఏ పూర్తిచేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంటే, నవీన్‌ ఎంబీఏ ఫైనలియర్‌లో ఉన్నాడు. ప్రస్తుతం సంబంధాలు వస్తున్నా.. చెల్లెలు, తమ్ముడు స్థిరపడ్డాకేనంటోంది.

రాత మార్చిన ‘గీత’

తలరాత బాగాలేదని చింతిస్తూ కూర్చోలేదు సావిత్రి.. కల్లుగీత వృత్తిని చేపట్టి రాతను మార్చుకుంది. మెదక్‌ జిల్లా రేగోడ్‌కు చెందిన సావిత్రి టెన్త్‌ వరకు చదివింది. చిన్న వయసులోనే సాయాగౌడ్‌తో వివాహమైంది. ఐదేళ్లకే భర్త హఠాన్మరణం.. అప్పటికి సావిత్రి నిండు గర్భిణి. పెద్దమ్మాయి భవాని పుట్టుకతోనే దివ్యాంగురాలు. తలవని తలంపుగా మామ మంచానపడ్డాడు. ఈ పరిస్థితుల్లో ఆ ఇంటికి తానే పెద్దదిక్కుగా మారింది. భర్త కల్లు గీతవృత్తిని దగ్గర్నుంచి పరిశీలించిన ఆమె ఆ వృత్తినే చేపట్టింది. అధికారుల సాయంతో లైసెన్స్‌ పొందింది. రోజూ పది కిలోమీటర్ల మేర తిరుగుతూ ఈత చెట్లెక్కి కల్లుగీస్తుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే తొలి మహిళా కల్లుగీత కార్మికురాలీమె.

 

మరిన్ని వార్తలు